*తెరవని తాళం - మీ హృదయాలను కదిలించే కథ - (SUNDAY STORY - పెద్దల కోసం)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 రాజ్‌విహార్‌ సెంటర్‌కు కుడిపక్కన వున్న ఫుట్‌పాత్‌ మీద ఒక మూలన చింతచెట్టుకింద ఫక్కీరప్ప కూచోనున్నాడు. వదులైన మాసినపోయిన తెల్లని జిబ్బా పైజామా, నెత్తిన తెల్లని టోపీ, బక్క చిక్కిన శరీరం, వయసు మీదపడడంతో నెరసిన జుట్టు, ముడతలు పడిన మొగంతో దిగాలుగా వున్నాడు. అతని కండ్లు ఆశగా వచ్చీపోయేటోళ్ళను పట్టి పట్టి సూస్తున్నాయి.
''ఇచ్చట తాళాలు రిపేరి చేయబడును'' ఫకీరప్ప వెనుక గోడమీద రంగువెలసిన అక్షరాలు కనబడుతున్నాయి. ఎదురుగా పరిచిన చినిగిన ప్లాస్టిక్‌ చాపమీద వరుసగా రకరకాల తాళాలు కొత్తవి, పాతవి ఇనుప తీగలకు గుత్తులు గుత్తులుగా తగిలించి వున్నాయి. పక్కన పాత సిలుముపట్టిన ఇనుప పెట్టె వుంది. అందులో మూడు నాలుగు రకరకాల సైజుల్లో వున్న సుత్తులు, ఒక పొడవైన ఇనుపస్కేలు. తాళం చెవులను అరగదీసి సానబెట్టె ఆకురాయి, స్కూడ్రైవర్లు, స్పానర్లు వున్నాయి. ఆ పాత సామానుల నడుమ అతను ఒక పాత సిలుం పట్టిన పెద్ద తాళం కప్పలా కనిపిస్తున్నాడు.
ఫకీరప్ప గోడకు ఆనుకొని కూర్చున్నాడు. కండ్లు నిరాశగా లోపలికి పోయి వున్నాయి. పైన వున్న చింతచెట్టు కొంచం నీడ నిస్తావుంది. పైటాలవుతా వుంది. పొద్దున్నుంచీ ఒక్కటి గూడా మంచి బేరం తగల్లేదు. ఒక బగ్గిమోటరోడు తాళం చెవులకోసం వచ్చి బేరమాడి యాభై రూపాయలు చేతిలో పెట్టి పోయినాడు. చాయ్‌కీ, బన్నులకీ ఇరవై పోగా చేతిలో ముప్పయి మిగిలింది.
ఎల్లుండే పీర్లపండగ. వూరికి పోవాల. వూరికాడ కొడుకూ, కోడలూ, కూతురు, అల్లుడు వుంటారు. మనవండ్లనీ, మనవరాండ్లనీ సూడక శాన్నాళ్ళయ్యింది. సన్నపిల్లల మొగాలు ముద్దు ముద్దు మాటలు మాటి మాటికి కండ్ల ముందు మెదలుతున్నాయి.
''మీరు ముసిలోళ్ళయినారు. పనులు సాతగావడం లేదు. ఇంగ ఆ కర్నూల్లో ఏముంటారుగానీ వచ్చి ఈన్నే వుండండి'' అంటాడు కొడుకు అప్పుడప్పుడు. కానీ కొడుకూ కోడలూ ఇద్దరూ దినాము పనికి పోతే గానీ వాళ్ళ కడుపు నిండదు. అట్లాంటిది అదనంగా ఇద్దరు మనుషుల్ని కూసోబెట్టి సాకడమంటే మాటలు గాదు. అందుకే వాళ్ళమీద బరువు మోపడం ఇష్టంలేక.... శాతనైన కాడికి ఇక్కన్నే తెలిసిన విద్యతో ఇగ్గుదాం. ఆపై అల్లా దయ అనుకుంటాడు ఫకీరప్ప.
కూతుర్ని గూడా సొంతూరిలోనే బంధువులకిచ్చినాడు. అల్లుడు బంగారం. రంజాన్‌కి కనీసం బట్టలు పెట్టమని గూడా అడిగి ఎరగడు. పెద్ద పండక్కు రమ్మని పిలిస్తే ''ఎందుకులే మామా అనవసరంగా నీకు ఆగసాట్లు. ఎట్లాగూ ప్రతి ఏడూ పీర్లపండక్కి మీరే వూరికి వస్తారు గదా. అప్పుడు వచ్చి ఓ నాలుగు నాళ్ళు మాయింట్లో వుండిపోండి'' అంటూ దాటేస్తాడు. దినాం పొద్దున్నే నంద్యాలలో గౌండా పనికి పోయొస్తుంటాడు. కొత్త ఇండ్లు దినానికొకటి మొలుస్తా వుండడంతో పనికేం లోటు లేదు.
కొడుకు, కూతురూ, మనవండ్లు, మనవరాండ్లు గుర్తుకు రాగానే ఫకీరప్ప మొగంపై చిరునవ్వు మెరిసింది. పెద్దోళ్ళకు ఏమీ తీసుకోని పోకపోయినా పర్వాలేదు గానీ సన్న పిల్లలకు ఏదో ఒగటి తీసుకొనిపోవాల. దాదీ, దాదా అంటూ పోగానే చుట్టుకోని పిల్లలు ఆశగా, ఆత్రంగా సంచీలవంక చూస్తారు. అందుకే వున్న డబ్బంతా ఖర్సుపెట్టి చేతిలో ఛార్జీలకు గూడా మిగుల్చుకోకుండా అన్నీ కొనేశాడు. రెండు మూడు మంచి బేరాలు దొరుకుతే సాలు రాత్రికంతా వూరికి చేరుకోవచ్చు.
ఫకీరప్పది నంద్యాలను ఆనుకుని వున్న నూనెపల్లెనే. తాతముత్తాతలనుంచీ దూది ఏకి పరుపులు, దిండ్లు కుట్టేటోళ్ళు. వాళ్ళ నాయన సిద్ధప్పతో కలిసి సైకిలేసుకోని, దానికి కమాను కట్టుకోని నంద్యాల వీధుల్లో ''కొత్త పరుపులు కుడతాం, పాత పరుపులు బాగుచేస్తాం'' అంటూ అరుస్తా తిరిగేటోళ్ళు. దిండ్లు పరుపుల్లో దూది గట్టిపడి వుంటలు గట్టి, ఎగుడుదిగుడుగా తయారైన వాళ్ళు పిలచేటోళ్ళు. వాళ్ళ ఇంటిముందే పరుపు విప్పి, కమానుతో దూదిని మరలా ఏకి, నాలుగు వైపులా సమానంగా సర్ది, దూదిని అటూ యిటూ కదలకుండా జాగ్రత్తగా కుట్టేటోళ్ళు.
కానీ ఆ దూది ఏకేటప్పుడు పైకి ఎగిసే దుమ్ముతో ప్రాణం వుక్కిరి బిక్కిరి అయ్యేది. సిద్ధప్పకు ఆ దుమ్ము వూపిరి తిత్తుల్లోకి చేరీ చేరీ ఉబ్బసం పెరిగింది. ఒక పక్క ఆగని దగ్గు. మరొక పక్క పని చేయకుంటే పూట గడవని స్థితి. అట్లా దగ్గుతూ దగ్గుతూనే రక్తం పడి. మంచం పట్టి యాభై ఏండ్లకే కండ్లు మూసినాడు.
దాంతో ఫకీరప్ప పెండ్లాం మస్తానమ్మ భయపడి ''ఇంగ ఆ పని మానెయ్యి. ఈన్నే కూలోనాలో సేసుకోని బదుకుదాం'' అంటూ పట్టినపట్టు వదల్లేదు. మిల్లుల నుంచి వస్తున్న మెత్తని స్పాంజి పరుపులకు అలవాటు పడుతున్న జనం నెమ్మదిగా దూది పరుపులకు దూరం అవుతున్నారు. ఇంతకు ముందులా పనిగకూడా దొరకడం లేదు. ఫకీరప్పకి వూర్లో రెండెకరాల బైలు పొలం వుంది. వానొస్తే పంట లేదంటే లేదు. దాంతో పెండ్లాంతో కలసి ఒకపక్క పొలం చూసుకుంటా మరొక పక్క కూలీకి పోవడం మొదలు పెట్టినాడు.
ఒకసారి వాళ్ళ వూరికి కర్నూలు నుంచి దూరపు బంధువు ఒక పెండ్లికి వచ్చినాడు. ఆయన మాటల్లో ఫకీరప్పతో ''రేయ్‌... నాయెంబడి కర్నూలుకి రారా... నగరం రోజురోజుకీ పెరిగిపోతా వుంది. బండ్లు, కార్లు, ఇండ్లు, అంగళ్ళు ఎక్కువయిపోతా వున్నాయి. కానీ అక్కడ తాళాలు రిపేరీ చేసే ఆంగళ్ళు గడియారం ఆస్పత్రి దగ్గర నాలుగైదు తప్ప ఇంకెక్కడా లేవు. చేతినిండా పని. నువ్వు వస్తానంటే చెప్పు నేను నేర్పుతా. మా ఇంట్లోనే చిన్న గదుంది. సొంతంగా అంగడి పెట్టుకునే వరకు అందులో వుందువుగానీ. అట్లాగే నీ పెండ్లాం గూడా బైట యాడపడితే ఆడ కూలీకి పోకుండా ఇంటిపట్టునే వుండి మా ఇంటోళ్ళతో కలిసి బీడీలు సుట్టడం నేర్చుకుంటాది. ఏం చెప్పు... వస్తావా'' అన్నాడు.
ఫకీరప్ప ధైర్యం చేసి కర్నూల్లో అడుగుపెట్టినాడు. రెండేండ్లలోనే పనంతా నేర్చుకొని సీక్యాంప్‌ సెంటర్లో బంకు పెట్టుకున్నాడు. బాగానే జరిగేది. ఫకీరప్ప పండగలప్పుడు నమాజు చేయడానికి మసీదుకు పోతుంటాడు కానీ ఆడ సెప్పేది ఒక్క ముక్కా అర్థమయ్యేది కాదు. ముందున్న తురుకోళ్ళను చూస్తూ వాళ్ళు ఏమి చేస్తే అది చెయ్యడమే. దాంతో తన కొడుక్కన్నా పెద్ద బుక్కు సదవడం నేర్పిద్దామని ఇంటి పక్కనే వున్న వుర్దూ బడిలో ఏడవ తరగతి వరకు చదివించినాడు. కానీ వానికి సదువబ్బక పోగా చెడుతిరుగుళ్ళు ఎక్కువయినాయి. దాంతో వాన్ని తీసుకొనిపోయి సొంతూరిలో తమ్ముని దగ్గర వదిలినాడు. వాడు ఆన్నే పెరిగి పెద్దోడయి అదే వూరిలో నిఖా చేసుకుని పొలం పని, కూలీపని చేసుకుంటున్నాడు.
ఫకీరప్పది ఎదుగూ బొదుగూ లేని సంసారం. అప్పులూ లేవు. ఆస్తులూ లేవు. కాలం అట్లా గాలివాటంగా దొర్లిపోతావుంది. కానీ ఇటీవలే నాలుగేళ్ళ కిందట రోడ్ల విస్తరణలో భాగంగా సీక్యాంపు దగ్గరున్న అంగళ్ళన్నీ పీకేసినారు. దాంతో ఫకీరప్ప వీధిలో పడినాడు. యాడా సోటు దొరక్క, అద్దెలు కట్టలేక రాజ్‌విహార్‌ సెంటర్‌లో సింతసెట్టు కిందికి చేరినాడు. అప్పటినుంచీ గిరాకీలు బాగా తగ్గిపోయినాయి. దానికి తోడు వయసుమీద పడింది. ఇంతకు ముందులా చురుగ్గా పనిచేయలేక పోతున్నాడు.
ఫకీరప్ప కండ్లు వచ్చీపోయే వాహనాల వెంటే పరుగులు దీస్తున్నాయి. ఎవరైనా ఫుట్‌పాత్‌మీద నడుస్తూ వచ్చినా, ఏదయినా బండి కొంచం అటూ యిటూగా ఆగినా తనకోసమేనేమో అని ఆత్రపడుతున్నాడు. వాళ్ళు దాటిపోగానే నీరసపడి పోతున్నాడు. ఎప్పుడు ఎవరొస్తారో తెలీదు, ఏ బేరం జారిపోతాదో అర్థంగాదు. అందుకే ఆ సోటు వదిలి ఎక్కడికీ కదలడం లేదు. దానికితోడు ఇటీవలే పోటీ గూడా పెరిగింది. మరో ఐదారు మంది ఈ వృత్తిలోకి దిగినారు. ఫకీరప్ప పనిలో పనిగా టార్చిలైట్లు, గొడుగులు, కూడా రిపేరీ చేసేటోడు. కానీ ఇప్పుడు అవి ఎవరూ తీసుకొని రావడం లేదు. వుత్త తాళాలు మాత్రమే.
కొందరు కారు తాళాలు లోపల్నే మర్సిపోయి డోర్‌ వేస్తుంటారు. అది ఆటోమ్యాటిక్‌గా పడిపోతుంటాది. ఫకీరప్ప కారుకి చిన్న గీతకూడా పడకుండా చానా అవలీలగా, పొడవైన స్కేలు సాయంతో ఒక్క నిమిషంలో తీసేటోడు. చానా మంది ఇంటి తాళాలు, బైకు తాళాలు పోగొట్టుకొని వచ్చేటోళ్ళు. కొంతమంది ముందు జాగ్రత్తగా డూప్లికేట్‌ తాళాలు, దొంగ తాళాలు చేయించుకునేటోళ్ళు.
కొన్ని సార్లు వూహించనివి జరుగుతూంటాయి. ఒకసారి అర్థరాత్రి మొగుడూ పెండ్లాలు ఇద్దరు బండిమీద ఇంటికొచ్చి పడుకున్న ఫకీరప్పని నిద్రలేపినారు. సెకండ్‌షో చూసి వస్తావుంటే తాళాలు ఎక్కడో పడిపోయినాయని బ్రతిమలాడుకున్నారు. పాపం... పక్కనే ఆడామె వుంది గదా అని జాలిపడి ఆ అర్థరాత్రి సైకిల్‌ తొక్కుకుంటూ వాళ్ళెంబడి పోయినాడు.
వెంకటరమణకాలనీలో చివరన పెద్ద ఇండ్లు. లోపల మూడు నాలుగు గదులు అన్నిటికి తాళాలు వేసివున్నాయి. దొంగల భయం గదా అందుకని అన్నీ వేశామని చెప్పినారు. ఫకీరప్పకుకు బీగం చూడగానే తెలిసిపోతుంది. అది ఏ కంపెనీది. ఒక్క క్షణంలో వచ్చేదా సతాయించేదా అని. కానీ ఏదయినా సరే చివరికి లొంగాల్సిందే. ఒక్కొక్క తాళాన్నే తీస్తూ గంటలో అన్నీ తెరిచినాడు. వాళ్ళు ఐదువందలు చేతిలో పెట్టినారు. సంబరంగా ఇంటికి చేరుకున్నాడు. పొద్దున్నే ఎవరో తలుపులు కొడుతుంటే కండ్లు నులుపుకుంటూ తెరిచినాడు. ఎదురుగా పోలీసులు. ''నిన్న రాత్రి వెంకటరమణ కాలనీలో తలుపులు తెరిచింది నువ్వేనా'' అన్నాడు పోలీసు. ''అవును సార్‌'' అన్నాడు భయంభయంగా బెదపడుతూ.
''ఎప్పన్నించి మొదలు పెట్టినావురా దొంగలకు సాయం సేయడం. నీ తోడు దొంగలు యాడున్నారు సెప్పు'' అంటూ స్టేషన్‌కు లాక్కొని పోయినారు. ఆ కేసునుంచి బైట పడటానికి తలప్రాణం తోకకొచ్చింది. ఫకీరప్ప అవన్నీ తలచుకుంటూ దారినపోయే వాళ్ళని ఆశగా చూస్తున్నాడు.
******* ******* ****** *****
వినోద్‌ బస్సు ఎక్కబోతున్నంతలో ఫోన్‌ మోగింది. ఎవరా అని చూస్తే తన పెండ్లాం సునంద.
ఫోన్‌ ఎత్తగానే ''ఏమండీ బస్సెక్కేసినారా'' అంటూ ఆదుర్దాగా అడిగింది. ఆమె గొంతులో కంగారును కనిపెట్టి ''ఇంకా లేదే... ఏమిటి విషయం'' అన్నాడు.
సునంద హమ్మయ్య అని నిట్టూరుస్తూ ''ఏమీ లేదండీ... వూరికి వచ్చేటప్పుడు నా నగలన్నీ తీసుకొని వచ్చినాగానీ, పోయిన్నెల కొన్న నెక్లెస్‌ మాత్రం బీరువాలోనే పట్టుచీరలకింద పెట్టి మరిచిపోయినట్లున్నా. ఇందాకే మా అమ్మకు ఆ కొత్త నగ చూపిద్దామని సూట్‌కేస్‌ తెరిస్తే కనబడలేదు. మీరు వచ్చేటప్పుడు పట్టుకోని రండి. అసలే వూర్లో దొంగలు ఎక్కువగా తిరుగుతా వున్నారు. ఇంటికి వరుసగా రెండు దినాలు తాళం కనబడితే సాలు మీదపడి దోచేస్తున్నారు'' అనింది.
ఆ మాటినగానే వినోద్‌ అదిరిపడినాడు. ఆ నెక్లెస్‌ కొత్తది. ఇటీవలే పెండ్లాం పుట్టినరోజుకి కొన్నాడు. కనీసం మూడు తులాలు వుంటాది. ఎంత కాదన్నా లక్షపైన్నే.
''సరే... సరే... సమయానికి చెప్పినావు తీసుకోనొస్తాలే.'' అంటూ బస్టాండ్‌ నుంచి ఆటోలో తిరిగి ఇంటికి బైలుదేరినాడు.
చెల్లెలికి నిశ్చితార్థం వుండడంతో నాలుగు దినాలు ముందుగానే సునంద పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. వినోద్‌ ముందురోజు బాస్‌ను బతిమలాడి పర్మిషన్‌ తీసుకొని మద్యాహ్నం బైలుదేరినాడు. కానీ... అంతలో ఈ విషయం.
వినోద్‌ ఇంటి కాంపౌండ్‌ గేట్‌ తీసి లోపలికి వచ్చినాడు. తలుపు మెట్లమీద బ్యాగ్‌ వుంచి తాళం చెవులకోసం ప్యాంట్‌ ఎడమ జేబులో చేయి పెట్టినాడు. పర్సు లేదు. గుండె గుబేలుమనింది. పొరపాటున కుడివైపు పెట్టానేమో అని కుడి జేబులో చేయి పెట్టినాడు. కర్ఛీప్‌, దువ్వెన తప్ప ఏమీ లేవు. వెనుక జేబుల్లో కంగారుగా వెదికినాడు. నుదుటిమీద చిన్నగా చెమటలు పట్టసాగినాయి. పొద్దున్నే బ్యాంకునుంచి యాభైవేలు తీసుకొచ్చినాడు. పర్సు, దాంతో బాటు తాళాలు కనబడ్డం లేదు. పై జేబులో సెల్‌ఫోన్‌ మాత్రమే వుంది. పొరపాటున బ్యాగులో ఏమన్నా పెట్టుకున్నానా అని అనుమానమొచ్చి బట్టలన్నీ బైటకు తీసినాడు. యాడా లేవు. నీరసంగా మెట్లమీదే చతికిలబడినాడు. బస్టాండ్‌కు పోయేటప్పుడో, వచ్చేటప్పుడో... ఆటోలోనో, దారిలోనో పడిపోయినట్టున్నాయి. ఏం చేయాల్నో తోచలేదు. విషయం చెబితే పెండ్లాం కంగారు పడుతుంది. డబ్బులు తిరిగి రాకపోగా చెల్లెలి నిశ్చితార్థం అనే ఆనందం గూడా అందరికీ ఆవిరయిపోతుంది.
కాసేపాగి ఆలోచించి ఎవరికీ ఏమీ చెప్పకుండా లోపల హారం తీసుకొని పోదాం అనుకున్నాడు. పక్కింటిలో స్నేహితున్ని పిలిచి తాళాలు మాత్రం పడిపోయినాయని చెప్పి ''కొంచం బండివ్వరా, ఎవరినన్నా తాళాలు తీసేటోన్ని పిలుచుకోని వస్తా'' అన్నాడు. వాడు సరేనని తాళం చెవి ఇస్తూ ''జాగ్రత్తరా... ఇదిగూడా యాడన్నా పాడేశేవు. వున్నది ఒక్కటే తాళం అన్నాడు నవ్వుతా.
వాని ఎగతాళికి సురుక్కుమన్నా దాన్ని బైటకు కనబడనీయకుండా బండి తీసుకొని బైలుదేర్నాడు. పీర్ల పండుగకు ముందురోజు కావడంతో గడియారం అస్పత్రి, సీక్యాంప్‌ దగ్గర ఎప్పుడు వుండేటోళ్ళు లేరు. వెదుకుతూ పోతావుంటే రాజ్‌విహార్‌ దగ్గర ఫుట్‌పాత్‌మీద ఫకీరప్ప కనిపించినాడు.
''ఈ ముసలోనికి చేతనవుతుందా'' అని అనుమానంగానే దిగినాడు. విషయం వివరించి ''ఎంత తీసుకుంటావు'' అని అడిగినాడు.
ఫకీరప్ప తాళం మామూలుదేనా లేక ఏదయినా కంపెనీదా అని వివరాలు అడిగినాడు. తాళం ఏ కంపెనీదో చెప్పగానే ''యా అల్లా.. ఆ తాళమా... లోపల శానా లివర్లు వుంటాయి సార్‌. అదీ గాక డబల్‌ లాక్‌. అంత తొందరగా రాదు. మూడొందలు ఇప్పించండి అన్నాడు.
మూడొందలా... కొత్త తాళం వస్తాది దాని బదులు'' అన్నాడు వినోద్‌. ఫకీరప్ప నవ్వి ''తాళం పగలగొట్టడానికయితే వంద రూపాయలు చాలు సార్‌. కానీ తాళంగానీ, చెక్కతలుపులు గానీ కొంచం గూడా దెబ్బ తినగూడదు అంటున్నారు. శానా పనుంటాది'' అన్నాడు నసుగుతూ.
వినోద్‌ రెండు వందలకు బేరమాడి ఫకీరప్పను బండిమీద ఇంటికి తీసుకోని వచ్చినాడు.
ఫకీరప్ప ఆ తాళం అటూ యిటూ తిప్ప చూసి ''అబ్బో... ఇది మామూలు తాళం కాదు సార్‌. పెద్ద పెద్ద అంగళ్ళకు దొంగలు షట్టర్లు తెరవకుండా బైట వేస్తుంటారు. ఈ నడమనే వచ్చింది. నేను గూడా ఎప్పుడూ తియ్యలా'' అంటూ సంచీలోంచి పాత తాళాల గుత్తి తీసినాడు. అనేక తాళం చెవులు పెడుతున్నాడు, తీస్తున్నాడు. లివర్లు తిరగడానికి వీలుగా ఆకురాయితో చిన్నగా అరగదీస్తున్నాడు. నెమ్మదిగా గంట అయ్యింది. తాళం తెరుచుకోలేదు.
ఫకీరప్ప జీవితంలో అటువంటి మొండి తాళం ఎప్పుడూ ఎదురు పడలేదు. ''యాడకొన్నారు సార్‌ దీన్ని'' అన్నాడు నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ.
''వూర్లో దొంగతనాలు ఎక్కువైనాయి గదా... నాది ఎప్పుడూ వూర్లు తిరిగే వుద్యోగం... అందుకే మూడు వేలు పెట్టి హైదరాబాదులో కొన్నా'' అన్నాడు. అది అంత త్వరగా రానందుకు ఒకపక్క గర్వంగానూ, మరొక పక్క విచారంగానూ వుంది వినోద్‌కు.
ఇంకో అరగంట గడిచింది. ఐనా తాళం తెరచుకోలేదు. ఫకీరప్ప సిగ్గుతో తలొంచుకొని ''సార్‌... లాభం లేదు సార్‌. నా జీవితంలో ఏదయినా సరే పదినిముషాలు లేదా అరగంట. కానీ ఇది వచ్చేటట్టు లేదు సర్‌. పగలగొట్టమంటే చెప్పండి. కానీ తాళం ఇక పనికిరాదు'' అన్నాడు సంచీలోంచి సుత్తి తీస్తూ.
వినోద్‌ ఆలోచనలో పడినాడు. అదంతా చూస్తున్న పక్కింటి స్నేహితుడు ''వద్దొద్దు. ఆ తాళం తలుపుకు ఆనుకొని చానా దగ్గరగా వుంది. నువ్వు గట్టిగా కొడితే సుత్తి దెబ్బ తలుపుమీద పడి చెక్క దెబ్బతింటాది'' అంటూ వినోద్‌ వైపు తిరిగి ''ఇతన్ని వదిలేసి రాపో... మా స్నేహితుని వెల్డింగ్‌ షాప్‌ దగ్గర్లోనే వుంది. వాన్ని పిలిపిద్దాం. మిషన్‌తో నిమిషాల్లో కోసి పాడేస్తాడు'' అన్నాడు.
ఫకీరప్పకు నోట మాట రాలేదు. ఇంకొంత సేపు ప్రయత్నించినాడు. వూహూ రాలేదు. నిరాశ మొగమంతా కమ్మేసింది.
''సరేలే... రాకపోతే నువ్వేం చేస్తావు గానీ... పోదాం పద. దించొస్తాను'' అన్నాడు వినోద్‌.
ఫకీరప్ప నీరసంగా అన్నీ సంచీలోకి సర్దుకోని పైకి లేచినాడు. పొద్దున తిన్న రెండు బన్నులు ఎప్పుడో అరిగిపోయినాయి. నెమ్మదిగా దిగులుగా మాట మాట్లాడకుండా వచ్చి బైకుమీద కూచున్నాడు. చానా అవమానంగా వుంది. వినోద్‌ రాజ్‌విహార్‌ దగ్గరి ఫకీరప్ప షాప్‌ వద్ద బండి ఆపినాడు. ఫకీరప్ప వంచిన తల ఎత్తకుండా మౌనంగా బండి దిగినాడు. వినోద్‌ బండి తిప్పుకోని స్టార్ట్‌ చేసి ముందుకు కదిలిస్తూంటే....
''సార్‌... సార్‌'' అంటూ గట్టిగా అరుపు వినిపించింది.
వినోద్‌ వెనక్కి తిరిగి చూసినాడు.
ఎదురుగా పొద్దున తాను బస్టాండ్‌ పోయేటప్పుడు ఎక్కిన ఆటో డ్రయివర్‌. అతని మొగం ఆనందంతో వెలిగిపోతోంది.
''సార్‌... పొద్దున నువ్వే గదా... బీక్యాంప్‌లో నా ఆటో ఎక్కి బస్టాండ్‌ దగ్గర దిగింది'' అన్నాడు.
''అవును నేనే'' అన్నాడు వినోద్‌ అతన్ని పోల్చుకుంటూ.
''సార్‌... నువ్వు దిగిన కాసేపటికి చూస్తే నీ పర్సు, దాని పక్కనే తాళాలు కనబన్నాయి. తెరిచి చూస్తే అందులో చానా డబ్బులు వున్నాయి. ఎంత అవసరం వుండి అన్ని డబ్బులు తీసుకోని పోతున్నావో... వెంటనే బస్టాండంతా నీకోసం చానా సేపు వెదికినా. యాడా కనబల్లేదు. ఇంకాసేపుంటే పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చేద్దామనుకున్నా'' అంటూ పర్సు తాళాలు చేతిలో పెట్టినాడు. వినోద్‌ లెక్కంతా ఎంచుకున్నాడు. భద్రంగా వుంది.
''ఎట్లా గుర్తు పట్టినావు నన్ను'' అన్నాడు ఆనందంగా వినోద్‌.
''నీవు నల్లరంగు షర్టు వేసుకున్నావు గదా. ఆ రంగంటే నాకు చానా ఇష్టం సార్‌. నీవు ఎక్కేటప్పుడు అబ్బ... ఎంత బాగుంది షర్ట్‌ అనుకున్నా. అందుకే మరిచిపోలేక పోయినా సార్‌'' అన్నాడు.
వినోద్‌ ఆటో డ్రయివర్‌కి థ్యాంక్స్‌ చెప్పి రెండు అయిదు వందల నోట్లు తీసి ''తీసుకో'' అన్నాడు.
''వద్దు సార్‌. ఇందులో నేను చేసిందేమీ లేదు. నా ధర్మం నేను చేసినానంతే'' అన్నాడు వెనడుగు వేస్తూ.
వినోద్‌ అతని భుజంపై చేయివేసి ''నీకు నల్లరంగు షర్ట్‌ అంటే చానా ఇష్టం అన్నావు గదా. నువ్వు చేసిన మంచిపనికి గుర్తుగా కొనుక్కో'' అంటూ బలవంతంగా అతని జేబులో పెట్టి బైకు స్టార్ట్‌ చేసినాడు.
ఫకీరప్ప ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఒంటి పీరులాగా దిగులుగా సింతసెట్టు కిందే కూలబడి పోయినాడు. నోటికాడి కూడు జారిపోయినట్టనిపించింది. కండ్లలో నీళ్ళు దిరిగినాయి.
అతని కండ్లు మరలా రోడ్డుమీద వచ్చీపోయే జనాలవంక ఆశగా చూడసాగినాయి.
ఇంటి దగ్గర మస్తానమ్మ సంబరంగా సామానులు సర్దుతూ వుంది. కూతురిని, కొడుకును, మనవండ్లను, మనవరాండ్లను తలచుకుంటూ.
కామెంట్‌లు