తమిళ సినిమా చరిత్రలో తొలి సూపర్ స్టార్--త్యాగరాజ భాగవతార్!!:-- యామిజాల జగదీశ్

 తమిళ సినీ జగత్తులో తొలి సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్. ఆయన తన జీవితకాలంలో నటించిన సినిమాలు పద్నాలుగే అయినప్పటికీ వంద సినిమాలలో నటించిన వారికికూడా లభించినంత పేరుప్రఖ్యాతులు ఈయనకు దక్కాయి.
త్యాగరాజ భాగవతార్ స్వస్థలం తిరుచ్చి. ఆయన తండ్రి పేరు కృష్ణమూర్తి. తల్లి మాణిక్యత్తమ్మాళ్. 
 
 భాగవతార్ 1910 మార్చి ఒకటో తేదీన జన్మించారు.
చిన్నతనంలోనే ఆయనకు సంగీతమంటే మహా ఇష్టం. చదువుమీద శ్రద్ధ చూపలేదు. ఏడో ఏటే ఆయన వేదిక ఎక్కి నటించడం మొదలు పెట్టారు.
పదహారో ఏట ఆయన నాలుగు గంటలపాటు కచ్చేరీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మృదంగ విద్వాంసుడు పుదుక్కోట్టయ్ దక్షిణామూర్తి పిళ్ళై త్యాగరాజు కచ్చేరీని ప్రశంసిస్తూ "త్యాగరాజు ఓ భాగవతార్" అని కొనియాడారు.
ఆయన పాటలకు మంచి ఆదరణ లభించేది. దాంతో ఆయన నాటకరంగంలోనూ విశేష గుర్తింపు పొందారు. 
ఏ నాటకబృందంలోనూ చేరకుండా ప్రత్యేకమైన నిటకాలలో మాత్రమే నటించేవారు.
భాగవతార్, ఎస్. డి. సుబ్బలక్ష్మి నటించిన పవళక్కొడి నాటకాన్ని అయ రామ అళగప్ప చెట్టియార్ అనే ధనికుడు తిలకించారు. ఈ నాటకంలో ఆయన అర్జునుడి పాత్రలో నటించారు. ఆయన ఆ నాటకాన్నే సినిమాగా తీయాలనుకున్నారు.ఆయనతో ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ సినిమాకు కె. సుబ్రహ్మణ్యం దర్శకత్వం చేపట్టారు. ఈయన బి.ఎ.బి.ఎల్. చదువుకున్నవారు. కొంతకాలం వకీలుగా పని చేశారు. ఆ తర్వాత సినిమారంగంలోకొచ్చారు. భాగవతారుకీ, సుబ్బులక్ష్మికీ, సుబ్రహ్మణ్యానికీ పవళక్కొడి సినిమాయే మొదటిది. పాటలకు అధిక ప్రాధాన్యముండే ఆ రోజుల్లో పవళక్కొడి సినిమాలో దాదాపు అరవై పాటలుంటే వాటిలో ఇరవై రెండు ఆయనే పాడారు.
పవళక్కొడి సినిమాలో భాగవతారుకి వెయ్యి రూపాయలు జీతం. సుబ్బులక్ష్మికి రెండు వేలు ఇచ్చారు  దర్శకుడు సుబ్రహ్మణ్యానికి 750 రూపాయలు. 
 భాగవతార. రెండో సినిమా నవీన సారంగధ. ఇందులో ఆయనకు జోడీగా సుబ్బులక్ష్మి నటించారు. దర్శకుడు కె. సుబ్రహ్మణ్యమే.
ఆ తర్వాత భాగవతార్ సొంతంగా సత్య శీలన్ అనే సినిమా తీశారు. ఈ సినిమాకు అప్పట్లో అయిన మొత్తం ఖర్చు యాభై రెండు వేల రూపాయలు.
1937లో భాగవతార్ నటించిన చింతామణి, ఆంబికాపతి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. చింతామణి సినిమాలో లభించిన లాభాలతో మదురై రాయల్ టాకీస్ వారు మదురైలో చింతామణి అనే పేరుతో ఓ థియేటరుని నిర్మించారు.
భాగవతారు తదుపరి చిత్రం తిరునీలకంఠర్. ఇదికూడా ఆయన సొంత చిత్రమే. ఈ చిత్రానికి దర్శకుడు రాజా సాండో. ఈయన కచ్చితత్వానికి పెట్టింది పేరు. భాగవతారు నటనకు మెరుగులు దిద్దడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
 తిరునీలకంఠర్  తర్వాత త్యాగరాజ భాగవతార్ నటించిన సినిమా అశోక్ కుమార్. ఈ చిత్రాన్ని మదురై మురుఖన్ టాకీస్ వారు నిర్మించారు. ఇందులో భాగవతారుతోళపాటు ఎంజిఆర్ కూడా నటించారు.
దీని తర్వాత భాగవతారు చేసిన సినిమా శివకవి. కోవై పక్షిరాజా నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ వెండితెర కావ్యంగా అభివర్ణించవచ్చు. వీణ ఎస్. బాలచంద్రన్ సోదరి అయిన ఎస్. జయలక్ష్మి భాగవతారుకి జంటగా నటించారు. టి.ఆర్. రాజకుమారి కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా అనేక నగరాలలో ఏడాది పొడవునా ఆడటం విశేషం.
 
 1944 అక్టోబరులో దీపావళి పండుగ. ఆరోజు విడుదలైన హరిదాస్ చెన్నై బ్రాడ్వేలో 1944 అక్టోబర్ 16 వ తేదీ నుంచి 1946 నవంబరు వరకు 110 వారాలు నిరాటంకంగా ప్రదర్శింపబడింది.
భాగవతార్ పాడిన కొన్ని ప్రముఖ పాటలు ....
భూమియిల్ మానిడ జన్మం, సొప్పన వాయ్విల్ ...., వదనమే చంద్ర బింబమో, రాధే ఉనక్కు కోపం ఆగాదడీ, మన్మధలీలై యై వెండ్రార్ ఉండో, కృష్ణా ముకుందా మురారే.
హరిదాస్ సినిమా విడుదలైన కొంత కాలానికి భాగవతారు జీవితంలో అనేక అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి.
సినిమా స్టార్లపై అనేక వదంతులు వచ్చాయి. అసభ్య రాతలు రాస్తూ వచ్చిన ఇఃదూ నేశన్ అనే ఎల్లో పత్రిక సంపాదకుడు లక్ష్మీనాథన్ 1944 నవంబర్ 9వ తేదీన దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఉసిగొల్పినవారు  భాగవతారు, ఎన్.ఎస్. కృష్ణన్ అంటూ ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిపై జరిగిన కేసులో ఇద్దరికీ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.
ఆంగ్లేయుల పాలనలో ఉన్నత న్యాయస్థానం (ప్రీవీ కౌన్సిల్) లండన్లో ఉండేది. అక్కడ భాగవతారు, కృష్ణన్ అప్పీల్ చేసుకున్నారు. చైన్నై హైకోర్టు సరిగ్గా విచారణ జరపలేదు. మళ్ళీ విచారణ జరపాలి. సరైన తీర్పు వెలువరించాలి ఆని ప్రీవీ కౌన్సిల్ ఆదేశించింది.
ఆ మేరకు హైకోర్టులో మళ్ళీ విచారణ జరిగింది. భాగవతారు, కృష్ణన్ ల తరఫున ప్రముఖ న్యాయవాది వి.ఎల్. ఎతిరాజ్ వాదించారు. తమ క్లయింట్లు ఇద.దరూ నిరపరాధులని గట్టిగా వాదించారు. అనంతరం వారిని విడుదల చేశారు.
భాగవతారు తన ప్రేమాభిమానాలకు గుర్తుగా న్యాయవాది ఎతిరాజ్ కి  వంద పౌండ్లలో బంగారు పళ్ళెం చేయించిచ్చారు. మీరెప్పుడూ ఇందులోనే తినాలని కోరారు భాగవతారు. ఆయన కోరిక మేరకు న్యాయవాది ఎతిరాజ్ ఆ కంచంలోనే తిన్నారు.
 భాగవతార్ నీటిలో పన్నీరు కలిపి స్నానం చేసేవారని ఆరోజుల్లో నలుగురూ అనుకునేవారు. అదెంత వరకు నిజమో తెలీదు కానీ ఆయన అలంకరణకు అధికప్రాధాన్యం ఇచ్చేవారన్నది నిజం.
వజ్రాలు పొదిగిన ఉంగరాలు పెట్టుకునేవారు. చెవులకు వజ్రాల దుద్దులు పెట్టుకునేవారు. పట్టు చొక్కా, పట్టు పంచ ధరించేవారు. జేబులో బంగారు కలం ఉండేది.నుజహదుట జవ్వాది బొట్టు పెట్టుకునేవారు.
తిరునీలకంఠర్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత సత్యమూర్తి, త్యాగరాజ భాగవతారుకి ఓ సూచన చేశారు..
"ఇక పట్టు లాల్చీ, పట్టు కహపంచ ధరించడం మానెయ్యండి. ఖద్దర్ బట్టలు ధరించండి" అని చెప్పారు సత్యమూర్తి.
అప్పటి నుంచి భాగవతారు ఖద్దర్ బట్టలు ధరించడం మొదలుపెట్టారు.
భాగవతార్ పేదరికం అనుభవించారు. బస్సులో ప్రయాణించేవారు అని ఆయన మరణానంతరం కొందరు ఆయన గురించీ రాసారు.ళలక్ష్మీకాంతన్ హత్య కేసు కారణంగా ఆస్తులన్నింటినీ కోల్పోయినప్పటికీ ఎవరి దగ్గరా చేయి చాచక ఆత్మాభిమానంతో బతికారు. నటుడు టి.ఆర్. మహాలింగం తన కొడుకు సుకుమార్ ని స్కూల్లో చేల్చేటప్పుడు ఓ వేడుక జరిపారు. అందులో భాగవతారు పాల్గొని పాటలు పాడారు. భాగవతారుకి తన వంతుగా సాయం చేయాలనుకున్న మహాలింగం వెయ్యి రూపాయలు ఇచ్చారు. 
అయితే భాగవతార్ సుకుమార్ ని దగ్గరకు పిలిచి ఆ వెయ్యి రూపాయలకు మరొక్క రూపాయి కలిపి ఇచ్చేశారు. ఇప్పుడు తను ఇంతే ఇవ్వగలనని చెప్పారట భాగవతారు. బాగా చదువుకోమని దీవించారట. 
తమిళనాట ప్రముఖ సంగీత విమర్శకుడిగా గుర్తింపు పొందిన సుబ్బుడు భాగవతార్ పాడిన పాటలు వింటుంటే ఈకాలం పాటలు వింటుంటే ఆవేదన కలుగుతోందని రాశారు 
 
భాగవతార్ గురించి ఎం.జి.ఆర్ మాటల్లో చూద్దాం...
"ఒక కచ్చేరీలో ప్రముఖ గాయకుడు చిదంబరం జయరామన్ పాడుతున్నారు. ఇంతలో ఉన్నట్టుండి సభలో చప్పట్లు. అవును. భాగవతార్ సభలోకి వస్తుండటాన్ని గమనించి ఆయనకు స్వాగతించారు. వేదికకు దగ్గర్లో ఆయనకో కుర్చీ కేటాయించారు. జయరామన్ పాట కొనసాగుతోంది. భాగవతార్ ఎక్కడల్లా జయరామన్ పాటను కొనియాడారో చూసి ప్రేక్షకులుకూడా చప్పట్లు చరిచారు. భాగవతారు ఓ రెండు పాటలు విని ప్రజల రద్దీ నుంచి బయటపడటం కోసం లేచి నిల్చున్నారు. అప్పుడు నేనేమనుకున్నానో అది అక్షరాలా రాస్తున్నానిక్కడ. అక్కడ ఎన్నో కుర్చీలు ఉన్నప్పటికీ భాగవతార్ లేచి వెళ్ళాక ఆ చోట చీకటి కమ్ముకున్నట్లయ్యింది."
హత్య కేసులో విడుదలైన తర్వాత భాగవతార్ రాజముక్తి అనే సినిమాను సొంతంగా తీశారు. ఈ సినిమాలో ఎం.జి.ఆర్, భానుమతి, వి.ఎన్. జానకి, ఎం.జి. చక్రపాణి తదితరులు నటించారు. మరే కారణంగానో ఎన్. ఎస్. కృష్ణన్, టి.ఎ. మధురం ఈ సినిమాలో నటించలేదు. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. అనంతరం ఆయన అమరకవి, పుదు వాయ్వు, శివకామి తదితర చిత్రాలలో నటించారు. 1959 నవంబర్ ఒకటో తేదీన ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి  సంగిలియిన. పురంలో ఉన్న ఆయన తండ్రిగారి సమాధి సమీపంలోనే అంత్యక్రియలు చేసారు.

కామెంట్‌లు