మధ్యతరగతి కుటుంబం ;-శ్యామ్ కుమార్...> నిజామాబాద్*
 "ఏవండీ వంటింట్లో ఏం చేస్తున్నారు ?"అనుకుంటూ వంటగదిలోపలికి  వచ్చింది శ్రీదేవి.
 "అబ్బే ఏమీ లేదు నువ్వు చిన్న కునుకు తీసుకున్నావు కదా! నేను ఏం చేయాలో తెలియక కాఫీ పెడుతున్నాను మరి ఇద్దరికీ "అన్నాడు నవ్వుతూ తరుణ్.
 ఇద్దరూ కాఫీ తాగుతూ వరండాలో కూర్చొని బయట రోడ్డు వైపు చూస్తున్నారు ."ఏమిటి  ఇంతవరకు లతా రాలేదు రాజు రాలేదు ఏమి అయింది వీళ్ళకి". అంది శ్రీదేవి కొడుకు , కూతురు  గురించి ఎదురు చూస్తూ.  కాసేపటి తర్వాత ఇద్దరూ కాలేజ్ నుంచి  నిమిషాల తేడాతో వచ్చేసారు. 
 "ఏంట్రా ఎందుకింత ఆలస్యం? "అని ఇద్దరి ఉద్దేశించి అడిగింది శ్రీదేవి.
"అవునమ్మా స్నేహితులతో గడిపి  వచ్చాను అందుకే ఆలస్యమైంది "అన్నాడు  రాజు.
 ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది లత.
 "ఏంటమ్మా అలా ఉన్నావ్ ఏమైంది "అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు తరుణ్ తన కూతుర్ని  చూస్తూ.
 "ఏమీ లేదు నాన్నా !కల్చరల్ అసోసియేషన్ మీటింగ్ ఉండింది. అందుకే లేట్ అయింది"
 'కల్చరల్ అసోసియేషన్'  మీటింగ్ అన్న మాట వినేసరికి శ్రీదేవి ఆలోచనలో పడింది .  గతంలో తన కాలేజీ లో జరిగిన కల్చరల్ అసోసియేషన్ మీటింగ్ గురించి నఆలోచన మస్తిష్కంలో మెదల సాగింది. 
          అవి తాను డిగ్రీ కాలేజి మొదటి సంవత్సరం చదువుతున్న రోజులు.
కాలేజీ మెట్లెక్కుతూ కుడివైపున  చూసింది శ్రీదేవి. చాలా డిగ్నిఫైడ్ గా డ్రెస్ వేసుకొని లైట్ కలర్లో షర్ట్ సన్నని  బెల్టు నిగనిగలాడే షూస్ తో హుషారుగా స్నేహితులతో నడిచి వస్తున్నాడు తరుణ్.  'భలే అందంగా ఉన్నాడే  !'అనుకుంది శ్రీదేవి.
 తనను  ఎవరో గమనిస్తున్న టు గా అనిపించి అటువైపుగా సరిగ్గా శ్రీదేవిని చూశాడు తరుణ్ వెంటనే చటుక్కున కళ్ళు దించుకుంది  శ్రీదేవి.
 కాలేజీకి వెళ్లే బస్సులో కూడా దాదాపుగా ఆరు నెలల నుంచి ఇదే జరుగుతోంది.
  
" శ్రీదేవి నన్ను చాలా గమనిస్తూ ఉందిరా:" అనిఒకరోజు ఫ్రెండ్స్ తో చెప్పాడు,తరుణ్.
" ఏడ్చినట్టు ఉంది. అంత అందమైన అమ్మాయి అందులో కాలేజ్ టాపర్ నిన్ను ఎందుకు చూస్తుంది ?ఊరికే  వెర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకోకు!". అని   నవ్వు తో కూడిన హెచ్చరిక చేశారు స్నేహితులు.
 దూరంగా ఫిజిక్స్ ల్యాబ్   కిటికీ లో ఉన్న టెలిస్కోప్ నుంచి తరుణ్ నిచూస్తూ  నవ్వుకుంది శ్రీదేవి.   టెలిస్కోప్ లో  దగ్గరగా అతని నవ్వు అతని  హావభావాలు అన్నీ కూడా  చాలా స్పష్టంగా కనబడుతున్నాయిఆమెకి.
 తరుణ్ ది మధ్యతరగతి కుటుంబం కానీ చాలా  క్రమశిక్షణ ప్రేమతో  పెంచడం వల్ల  అతని మాటల్లో నడవడికలో అన్నిటా మంచి లాలిత్యం గుణం కనిపిస్తూ ఉంటుంది .  
 చదువు అందం ఆకర్షణలో  శ్రీదేవిఏమాత్రం తీసిపోదు.  'ఇలాంటి అమ్మాయి దొరకాలి'  అని  అందరు అబ్బాయిలు అనుకునేవాళ్ళు.
 గాలిలో మల్లెపూల వాసన వచ్చినట్టు మత్తుగా
 అనిపించి చుట్టూ చూశాడు తరుణ్ , అప్పుడే అటుగా వస్తూ కనిపించింది శ్రీదేవి' ఓహో ఇదన్నమాట సంగతి 'అని నవ్వుకున్నాడు.
 అసలు ఎలా మాట్లాడాలి అమ్మాయి తోటి ఏ వంక పెట్టుకుని మాట్లాడాలో తెలియలేదుఅతనికి.  ఒకరోజు మొత్తానికి ఇద్దరూ కోరుకున్నట్టుగానే ఒక అవకాశం దేవుడు కల్పించాడు. 
 కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఒక కమిటీ వేయాలని అందులో కొందరు విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని  నిర్ణయించారు.  అన్నిటా ముందుండే  తరుణ్ తనతోపాటే ఐదుగురు స్నేహితులు  కలిసి   మొదటి సెక్రటరీ సుబ్బారావు గారిని  కలిసేందుకు క్లబ్ రూమ్ లోకి వెళ్లారు.
 అక్కడ  ఇద్దరు అమ్మాయిలతో కలిసి శ్రీదేవి నిలబడి ఉంది.  తరుణ్ మనసు ఆనందరాగాలు  పలికింది.  అంతవరకు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నందుకు తరుణ్ మరియు వేణుగోపాల్ ఇద్దరిని  ఎన్నుకున్నారు.  అమ్మాయిలు తరఫున శ్రీదేవి ఒక్కరిని తీసుకున్నారు. 
 శ్రీదేవి మనసంతా చాలా ఉత్తేజంగా ఉంది.  ఒక వారం తర్వాత కమిటీ మీటింగ్ పెట్టుకుని అందరూ రాబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంచి ప్రోగ్రాం తయారు చేయాలని  నిర్ణయించారు . 
 ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నా శ్రీదేవి,తరుణ్ లు ఒకరికొకరు ఎదురుగా కూర్చుని కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు.   హల్ లో  చాలా మర్యాదగా కూర్చొని ఎక్కడ  తొణక కుండా  నిదానంగా గౌరవంగా సీరియస్ గా
 మాట్లాడుతూ ఉండడం చూసి శ్రీదేవి ఆశ్చర్యపోయింది.'  ఏంటి అసలు ఈ అబ్బాయి  నన్ను చూసి ఎక్క డా  ఆకర్షణకు లోను కాకుండా  ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు .నా అందం పనిచేయట్లేదా !'అనుకుంది.  'కాలేజీ లో టాపర్ అయిన  నన్ను  చూడటానికి లేదా నాతో మాట్లాడడానికి అందరూ వెంపర్లాడుతూ ఉంటే ఏంటి   ఎలాంటి ఫీలింగ్ లేకుండా కూర్చున్నాడుఇతను' అనుకుంది. 
  అంత దగ్గరగా  శ్రీదేవితో కూర్చుని మాట్లాడటం తరుణ్ కి ఎంతో ఇబ్బందిగావుండడమేకాకుండా  ,గుండె వేగంగా కొట్టుకుంటూ కంగారు పెడుతూ వుంది. 
 తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరూ  ఉద్యోగస్తులు.  తరుణ్ కి ఒక చెల్లెలు ఒక అన్నయ్య ఉన్నారు.  అందరూ  చదువుతున్నారు.  ఇంట్లో పరస్పర అవగాహనతో ప్రేమతో ఉండే వాతావరణం  తో కళకళలాడుతుంటుంది.  అందరిలో మధ్యతరగతిలో ఉండే  ప్రేమాభిమానాలు మెండు.  ఇంట్లో లలిత కళలు, విద్య నాట్యమాడుతూ ఉంటాయి 
   సాంస్కృతిక కమిటీ మీటింగ్ అయ్యేసరికి చాలా ఆలస్యమైంది.   బస్సు వచ్చి వెళ్ళిపోయింది . కాలేజ్ నుంచి నడుచుకుంటూ చాలా దూరం వచ్చి రిక్షా ఎక్కింది  శ్రీదేవి.  ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ నాన్నగారు వాకిట్లో నిలబడి ఎదురుచూస్తూ ఉన్నాడు.   భయంతో ఒళ్ళంతా చల్లబడింది శ్రీదేవికి. 
 వాళ్ల ఇంట్లో  పూర్తిగా నాన్నగారి  అజమాయిషీ.   అమ్మ అమాయకురాలు వాళ్ళ నాన్న చెప్పిందే వేదం.  
"ఫిజిక్స్ లో స్పెషల్ క్లాసు తీసుకున్నారు నాన్న అందుకే లేట్ అయింది" అని వాళ్ళ నాన్నగారు   అడగకముందే సంజాయిషీ ఇచ్చుకుంది .
 కాలేజీ లో వివిధ లలితకళ లు,   సాంస్కృతిక కార్యక్రమాల గురించి   తరుణ్ శ్రీదేవి తరచుగా  మాట్లాడుకుంటూ ఉండేవారు. 
 అంతేకాక తరుణ్ స్నేహితులైన   మిగిలిన  నలుగురితో కూడా అభిమానంతో,  స్నేహపూర్వకంగా వ్యవహరించేదిఆమె. 
శ్రీదేవి  ,తన రాకతో వారందరిలో మంచి   ఉత్సాహం సంతోషం వెల్లువెత్తింది అనే విషయం గమనించింది.  కాలేజీలో అమ్మాయిలకు నాయకురాలు అవటం మూలాన ఇంకా కొందరు అమ్మాయిలు కూడా వచ్చి జత కలిశారు వీరితో. 
 ఆ సంవత్సరం రాఖీ పండుగ వచ్చింది.  కాలేజీలో చాలా మంది అమ్మాయిలు తరుణ్ ,  వేణు, వాసులకు రాఖీలు కట్టారు.  కానీ వీరిలో  కామేష్ మాత్రం ఆ రోజు ఎవరికీ దొరకకుండా దాక్కున్నాడు.  ఎట్టిపరిస్థితుల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
 "అది ఏంట్రా అలా చేసావు" అని అందరు అడిగితే "మీకు అందరికీ ఉన్నారుగా చెల్లెళ్ళు! , మీరందరూ కట్టించుకున్నారు గా,అది చాలు! నాకు అవసరం లేదు."  అన్నాడు  నవ్వుతూ.  ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు ఆ అమ్మాయి తన గురించే పుట్టినట్టుగా తనను తప్పని సరిగా ప్రేమిస్తుంది అన్నట్లే ఫీలయ్యేవాడు కామేష్.
 కాలేజీ పక్కన ఉన్న గడ్డి మైదానం లో ఒక చెట్టు కింద కూర్చుని తరుణ్ తన స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు. కాస్త దూరంలో ఉన్న కెమిస్ట్రీ లాబ్ లోంచి వీళ్లను చూస్తోంది శ్రీదేవి.   'ఎప్పుడు చూసినా జోక్స్ ఎప్పుడు చూసినా ముచ్చట్లు , నవ్వులే.  ఈ కాలేజీ  వరకు చదువులో ముందుంటే  చాలు  అదే గొప్పఅని అనుకుంటున్నారు.  వీళ్లు తలుచుకుంటే యూనివర్సిటీ లెవెల్ లో కూడా మంచి ర్యాంకు సంపాదించవచ్చు .కానీ ఏం చేద్దాం    ,వీళ్లకు ఆ ఆలోచన లేదు 'అనుకుంది శ్రీదేవి.  
" ఏమిటి అంత గంభీరంగా ఆలోచిస్తున్నావు దేవి ఏం కావాలి చెప్పు నీకు "  అన్న భర్త మాటతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేసింది శ్రీదేవి. 
" ఏమీ లేదండీ. కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి అంతే!"  అని నవ్వేసింది.
(2.)
 రెండు గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ  కూర్చుంది శ్రీదేవి.  సోఫాలో కూర్చుని 'గాన్ విత్ ద విండ్ 'నవల చదువుతున్నాడు తరుణ్. 
" ఏవండీ  !  లత కు ఇంజనీరింగ్   అయిపోతుంది,  ఎంటెక్ ,ఎక్కడ సీటు దొరుకుతుందో ఏమిటో  అంటూ భర్త కేసి చూసింది. " దానికి ఏం ప్రాబ్లం లేదు .తెలివైనది. ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది  . దాని గురించి కంగారు పడకు"అన్నాడు
 ఇంతలో వర్షం లో సగం తడుస్తూ లోపలికి పరిగెత్తుకొచ్చింది లత.  వస్తూ వస్తూనే తన కాళ్ల  కు వున్న చెప్పుల్ని పక్కకు గిరాటేస్తు " మమ్మీ రేపు అర్జెంట్గా నాకు కొత్త చెప్పులు కొనాలి .ఇదిగో ఈ వర్షంలో  ఇవితెగిపోయాయి "అంది.
 "మొన్నీమధ్యనే కొన్నాను  కదే ?ఎలా  తెగిపోయాయి ?" అని అడిగింది శ్రీదేవి.
" ఈ వర్షానికి బస్సులు ఆటోలు ఏమీ దొరకలేదు. నడుచుకుంటూ వచ్చాను .ఈ  వర్షపు నీళ్లకు అనుకుంటాను మధ్యలో తెగిపోయింది."అంది
 రాత్రి భోజనాలు అయిన తర్వాత,  బెడ్ రూం లోకి వచ్చింది  శ్రీదేవి.  అప్పటికే పుస్తకం పట్టుకొని బెడ్ వెనకాతల ఉన్న లైట్ వేసుకొని చదువుతున్నాడు తరుణ్. 
" ఏంటి దేవీ ఇంతసేపు ? .ప్రతిరోజు చూస్తాను, ఓ పట్టాన ఆ వంటింట్లోంచి రావు కదా. త్వరగారా  అని ప్రతి రోజు చెప్తాను ,అయినా  ఇదే టైం అవుతుంది నీకు "అన్నాడు గోడ  గడియారం చూస్తూ. 
 "సరే లెండి "అనుకుంటూ  తరుణ్ భుజం మీద తలవాల్చి,  చెయ్యిని  తన మెడ చుట్టూ తిప్పుకొని   తెగిన చెప్పు విషయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
  తను డిగ్రీ మూడవ సంవత్సరం లో అడుగు పెట్టిన కొత్త రోజులు.
ఒకరోజు కుండపోతగా వర్షం కురిసింది.  కాలేజీలో విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నారు.  బస్సులో రాగలిగిన వాళ్ళు మాత్రమే కాలేజీలో కనిపిస్తున్నారు.  క్లాసుకు ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే చూసిన  లెక్చరర్  పాఠాలు చెప్పడానికి  వెనుకంజ వేశారు.  ఒక గంట గడిచిన తర్వాత లాభం లేదు అనుకొని కాలేజీ కి సెలవు ప్రకటించేశారు. 
 కాలినడకన మరి మోటార్ సైకిల్ మీద వచ్చే వారు ఎవరూ కూడా కాలేజీకి రాలేదు.
 కాలేజీ నుంచి తిరిగి టౌన్ లోకి వెళ్ళటానికి అక్కడ ఎటువంటి సదుపాయం లేదు. బస్సు కూడా వెళ్లి పోవడం మూలాన అందరూ కబుర్లు చెప్పుకుంటూ  సంతోషంగా  కాలినడకన తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు.  అకస్మాత్తుగా కాలేజీకి సెలవిస్తే అందులో ఉండే ఆనందం మరెక్కడా ఉండదు. 
 తరుణ్ తన స్నేహితులతో కలిసి  నడుచుకుంటూ దాదాపు తన ఇంటి వరకు వచ్చేశాడు.  కాస్త ముందుగా వెళుతున్న అమ్మాయిల గుంపులో శ్రీదేవి కూడా ఉంది.  వారిలో శ్రీదేవి చాలా  ఇబ్బందిగా నడుస్తున్నట్టుగా   అనిపించింది   తరుణ్ కు. 
 గమనించి చూస్తే ఒక చెప్పు తెగిపోయినట్లు గా ఉంది దాన్ని లాగుతూ అలాగే నడుస్తు వుంది .
 తన స్నేహితులైన వేణు కు వాసు కు  ఆ విషయం చెప్పాడు .
 "సరేలే .ఆ విషయం మనకెందుకు  ఏదో ఒక రిక్షా   తీసుకొని వెళ్ళి  పోతుందిలే "అన్నారువాల్లు
" అయినా అవన్నీ   నీకెందుకు?"  అన్నాడు  తరుణ్ మొహాన్ని గమనిస్తూ,  చిరునవ్వుతో వాసు.
 "అలా  కాదు,  పాపం ఎలా నడుస్తుంది .?"
" అది సరే .నిజమే. కాని మనం ఏం చేస్తాం" అన్నాడు కామేశ్ .
సమాధానం చెప్పకుండా  తరుణ్ వడివడిగా ముందుకు అడుగులు  వేసి" శ్రీదేవి గారు!
 మీ చెప్పు తెగిపోయినట్లు గా ఉంది. ఈ పక్క నే  మా ఇల్లు .మీరు మా ఇంటికి వచ్చి, అమ్మ చెప్పులు వేసుకుని వెళ్ళండి " అన్నాడు
 శ్రీదేవి కి ఏం చేయాలో తెలియక  అ
యోమయంలో నిలబడి ఆలోచిస్తోంది.
" పర్వాలేదండి రండి ఇక్కడే కదా"  అని కామేష్ వాసు  వేణు కూడా స్నేహం తో  అర్థించారు. తన చురుకైన కళ్ళతో అందరి మొహాలను  పరికించి చూసి   ' 'సరే పదండి " అంది శ్రీదేవి.
 మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ చాలా  పొందికగా అన్ని సౌకర్యాలతో  అందంగా ఉంది తరుణ్ ఇల్లు.  ఎదురుగా హాల్లో కూర్చున్న అమ్మానాన్నలకు పరిచయం చేశాడు   తరుణ్.
 " రావమ్మా !!రారా కూర్చో "అని  సాదరంగా  ఆహ్వానించారు ఇద్దరూ.  వారి కళ్ళల్లో ప్రేమ వారి ఆదరణ లో ఉన్న స్నేహపూర్వకమైన భావాలను చూసి శ్రీదేవి మనసుకి ఎంతో  హాయిగా అనిపించింది. 
 "మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మీరు ఎంతమంది?"  లాంటి కుశల ప్రశ్నలు వేశారు.  మమ్మల్ని చూపించి "ఏంటమ్మా వీళ్ళందరూ కాలేజీలో ఎలా ఉంటారు? బాగా చదువుతున్నారా లేదా వెధవలు !!" అని నవ్వేశారు. 
 తరుణ్, స్నేహితులు , అమ్మానాన్న  చెప్పే విషయాలు విశేషాలు  వింటూ  ఉంటే చాలాసేపు  సమయం తెలియకుండా గడిచిపోయింది శ్రీదేవికి.  
"ఇంతకీ అందరూ ఏమి తాగుతారు కాఫీనా?   టీ యా " అంటూ అడిగింది   తరుణ్ చెల్లెలు లత. 
  "నేను  కూడా  సహాయం చేయనా ?"  అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది శ్రీదేవి.
 వెంటనే మా అందరి కళ్ళలోకి చూసి,  తరుణ్ కళ్ళలోకి ప్రశ్నార్థకంగా  చూసి గుంభనంగా నవ్వాడు కామేష్ .
 "కోటలో పాగాఅంటే ఇదే అన్నమాట!" అంటూ పక పకా నవ్వాడు వాసు ఎప్పటిలాగే. ప్రతి విషయాన్ని నవ్విస్తు  నవ్వటం   వాడి ప్రత్యేకత.  హాస్య ప్రియత్వం మే కాకుండాఅతను భోజనప్రియుడు కూడా.
 కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమలు అభిమానాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తరుణ్ ఇంట్లో  వీక్షించింది శ్రీదేవి. 
 తన ఇంట్లో పరిస్థితులు వేరు. నాన్నగారు చండశాసనుడు.  క్రమశిక్షణా రాహిత్యాన్ని అసలు సహించడు.    విద్యార్జన మాత్రమే పరమావధి.  అమ్మ అమాయకురాలు, లౌక్యం అసలు తెలియదు.   కట్టుబాట్లు  దాటితే  ఏమాత్రము సహించని తండ్రి.  
  తరుణ్ కు  తన తల్లిదండ్రుల పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్లు  అర్థమైంది.  'తల్లిని ప్రేమించే కొడుకు  పెళ్లి అయిన తర్వాత భార్యను కూడా బాగా ప్రేమిస్తాడు 'అనే నానుడి ఎక్కడో విన్నది శ్రీదేవి.
 సమయం సందర్భానికి తగినట్లుగా సుమతి శతకాలు చిన్నప్పుడు చదివిన  కబీర్ పద్యాలు  ఎప్పుడో చదివి మర్చిపోయిన  ఇంగ్లీష   రచయితల కవితలు  చెబుతూ పోయాడు  తరుణ్.  
 అందరూ  పంక్తి  భోజనాలు  చేసేశారు.  ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగే ఆలస్యమైపోయింది.  శ్రీదేవికి.   ఇంట్లోకి వెళ్ళగానే నాన్నకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ వెళ్ళింది శ్రీదేవి.   అయితే  ఆ రోజు  ప్రతిసారి కి భిన్నంగా వాళ్ళ నాన్నగారు ఏమీ అడగలేదు.   ఉండబట్టలేక "నాన్న!  ప్రాక్టికల్స్ క్లాస్ లేట్ అయింది ,పైగా బస్సు కూడా రాలేదు .అందుకే ఆలస్యం అయ్యింది ."అని  సంజాయిషీ ఇచ్చుకుంది.  నాన్నకు నిజం చెప్పలేక పోవడం తో మనసంతా చాలా బాధగా ఉంది శ్రీదేవికి. 
 "మొహమంతా చాలా నీరసంగా ఉందమ్మా. ఎందుకలా ? ముందు కాస్త మొహం కడుక్కొని ఏమైనా తిను "అని ప్రేమగా కూతుర్ని చూస్తూ అన్నారుశ్రీదేవి  నాన్న.   దాంతో  బాధ   ఇంకాఎక్కువై కళ్లలో నీళ్లు తిరిగాయి శ్రీదేవికి.
 'చ !చ!..  ఇలా చేయకూడదు .నాన్నకి ఇంకోసారి నిజం దాచి పెట్టకూడదు'. అనుకుంది .
 కల్మషం లేని నిర్మలమైన మనస్సు గల ఈ ఐదుగురు స్నేహితులు అంటే శ్రీదేవికి  సాన్నిహిత్యం కుదిరింది.  
  వీరితో స్నేహం పెరిగిన తర్వాత అబ్బాయిల నుంచి దొంగ చూపులు ,వెంటపడడం దాదాపుగా పూర్తిగా  ఫు ల్ స్టాప్ పడిందనే చెప్పాలి. 
 ఆ విధంగా మొదలైన స్నేహం  ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు సంపాదించుకుని జీవితంలో స్థిరపడ్డాక పెద్దల అనుమతితో వారిద్దరి వివాహం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. 
 "హ్యాపీ మ్యారేజ్ డే దేవి గారు  "అన్నాడు తరుణ్  శ్రీదేవి ని తన  చేతుల్లోకి తీసుకుని.
  "మీకు కూడా  " అంది శ్రీదేవి  గుండెల మీద తలవాల్చి. 
" ఎన్ని సంవత్సరాలయిందో య్ మన పెళ్లి అయ్యి "అన్నాడు.
 'పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది 'అనుకుంటూ ఆలోచిస్తుంది దేవి.
 "ఏంటి ఆలోచిస్తున్నావు దేవి.   త్వరగా రెడీ అవ్వు గుడికి వెళ్లి వచ్చేద్దాం .ఈరోజు వాసు కామేష్ ,వేణు   మన ఇంటికి వస్తున్నారు.భోజనానికి ఏర్పాట్లు చేయాలి.  బయట నుంచి మిఠాయి లు  ఏమైనా తీసుకురావాలా" అని  అడిగాడు తరుణ్.
 "ఎందుకు  బయట నుంచి తేవడం? నేను అన్నీ చేసేస్తాను కదా" అంది శ్రీదేవి.
 మధ్యాహ్నం అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉండగా కామేష్ అడిగాడు
 "అసలు, శ్రీదేవి! నీకు వీడంటే ఎందుకు కాలేజీలో అంత ఇష్టం కలిగింది?" అని.
 "అదేం ప్రశ్న .ఇంతకంటే మంచి వాడు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాడు  శ్రీదేవికి" అని పకపకా నవ్వాడు వాసు.
" ఆ ..మరె   "అంటూ వెక్కిరించింది శ్రీదేవి.
 "ఒరేయ్ జోకులు  తర్వాత  ముందు తినండి రా" అన్నాడు తరుణ్. 
 "అసలు ఆరోజు చెప్పు తెగకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు;" అన్నాడు వేణు.
" చెప్పు తెగింది అనుకో  వీడిని వద్దురా  వద్దురా! బాబు!! అంటుంటే పరిగెత్తుకెళ్లి నిన్ను  ఇంటికి ఇన్వైట్ చేసాడు " అంటూ తరుణ్ వైపు చూశారు కామేష్.
 నవ్వుకుంటూ లేచి చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాడు తరుణ్.
 "మీకందరికీ ఒక విషయం చెప్పనా ?"అని చిలిపిగా నవ్వుతూ చూసింది శ్రీదేవి.  ఆ నవ్వు చాలా గమ్మత్తుగా ఉంది అందులో అర్థం ఏమిటో తాను చెప్పబోయే సస్పెన్స్ ఏమిటో  ఎవరికి అర్థం కాలేదు.
 "చెప్పు త్వరగా ,దానికి    ఇంత ఉపోద్ఘాతం నసా ఎందుకు" అన్నాడు వాసు పకపకా నవ్వుతూ ఎప్పటిలాగే.
 "అయితే వినండి .చెబుతాను. ఈ విషయం మళ్లీ మళ్లీ నన్ను మీరు ఎత్తి  చూ ప కూడదు."
" సరే తల్లీ అది ఏంటో చెప్పు తొందరగా "అన్నాడు వాసు. 
 "ఆ రోజు అసలు చెప్పు తెగనే లేదు .నేనే చెప్పు     తెగినట్లుగా నటించి చూశాను.  నేను అర్థం   చేసుకున్నంతవరకు   ఆ పరిస్థితిలో తప్పనిసరిగా తరుణ్ నన్ను వాళ్ళ ఇంటికి పిలుస్తాడు  అని అంచనా వేసాను.  మీకు  తనకు ఉన్న తేడా అది.  ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఇచ్చిన చెప్పులు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి నేను   ఆయన ఇంటికి వచ్చాను. మనమందరం మళ్ళీ  కలిసాము. 
 ఆ తర్వాత జరిగింది  ఏమిటో మీకు తెలుసు" అంది పకపకా నవ్వుతూ.  స్నేహితులు అందరూ తెల్లబోయారు. 
aftermath. ( ఆ తరువాత. )
 ఇంతలో  నవ్వుతూ వచ్చాడు  తరుణ్  "  నాకు తెలుసు !!మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పులు నీకు ఇచ్చేటప్పుడు నేను  అనుకోకుండా  చెప్పులు గమనించాను    బాగానే ఉన్నాయి అని  తెలిసింది .  నాకు విషయం అర్థంఅయింది. "    అంటూ ప్రేమగా అభిమానంగా కళ్ళతో నవ్వుతూ  తన భార్య శ్రీదేవిని , మమ్మల్ని  చూశాడు.


కామెంట్‌లు
Shyam kumar చెప్పారు…
Thank you suri garu
Shyam kumar చెప్పారు…
Thank you suri garu
Goura adinarayana చెప్పారు…
బాగా వ్రాసారు. కానీ ఇంత సక్సెస్ ఫుల్ అందరికి ఉండదు. వున్నవారెవరో అదృష్టవంతుడు