జింక విలువ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

  ఆ అడవిలోకి హఠాత్తుగా ఒక జింక ప్రవేశించింది. ఆ జింక రూపం అస్సలు బాగుండదు. దాంతో అడవిలోని జంతువులు దానితో స్నేహం చేయడం లేదు. కొన్ని జంతువులు అయితే దాని రూపంలోని లోపాలను ఎత్తి చూపుతూ హేళన చేయసాగినాయి. ఒకరోజు ఏనుగు ఎదురై జింకతో "నువ్వు ఎవరివి? ఏ అడవి నుంచి వచ్చావు?" అని అడిగింది. "అడవి నుంచి అది రావడం ఏమిటి? అది అసహ్యంగా ఉందని, రోజూ దాని ముఖాన్ని చూడవలసి వస్తుందేమో అనే భయంతో అడవి జీవులే తమ అడవి నుంచి దీన్ని తరిమాయి అనుకుంటా." అన్నది కుందేలు. 
       జింక ఏ జీవితో కలవాలని చూసినా అవి దీన్ని అసహ్యించుకునేవి. జింక తన మానాన తాను బతుకుతుంది. "ఒకరోజు అటుగా వచ్చిన రామచిలుక "బాగున్నావా జింక నేస్తమా? హరితవనాన్ని వదిలి ఇక్కడికి వచ్చావేమిటి?" అంటూ ప్రశ్నించింది. "నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావా?" అని బదులు చెప్పింది జింక. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు జింక. రామచిలుక వెళ్ళిపోయింది. ఇది విన్న నక్క అడవికి రాజైన సింహానికి ఈ విషయం చెప్పింది. "ఏం తప్పు చేసిందో! హరితవనానికి రాజు ఆ అడవి నుంచి బహిష్కరిచింది. ఇంతకీ కురూపి జింక చేసిన తప్పేమిటో అత్యవసరంగా కనుక్కోండి మృగరాజు! లేకపోతే మన అడవి జీవులను అన్నింటినీ ఈ జింక పాడు చేస్తుంది." అన్నది కుందేలు. 
       సింహం ద్వారా విషయం తెలుసుకున్న హరితవనానికి రాజైన మరో సింహం తాను స్వయంగా అక్కడికి వచ్చింది. జింకతో "క్షమించు హరిణ మిత్రమా! నిన్ను అపార్థం చేసుకొని నీ మనసు గాయపడేలా మాట్లాడాను. నీ వంటి మంచి మనసున్న జీవితో స్నేహం చేసే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. దయచేసి మన అడవికి పోదాం. నువ్వు రాకపోతే నేనూ ఇక్కడి నుంచి కదలను. తప్పకుండా నీకు పంచ ప్రాణాలు అయిన మన అడవికి వస్తావని నమ్మకం ఉంది." అని అన్నది. నక్క ఆశ్చర్యపోయింది. అప్పుడు హరితవన రాజు ఇలా అంది. "పేరుకు అడవికి రాజును నేనైనా ఈ జింక అన్ని జీవులనూ ప్రేమిస్తూ వాటికి రాత్రనక, పగలనక సేవలు చేస్తూ, ఎక్కడ ఏ ఆపద వచ్చినా అక్కడ ప్రత్యక్షమై ఆదుకుంటూ నా కంటే గొప్ప పేరు తెచ్చుకుంది. ఇది సహించలేని మా అడవిలోని ఓ గుంటనక్క ఈ జింక రాజ్యకాంక్షతో ఇలా చేస్తుందని జింక మీద నాకు చెడుగా చెప్పింది. అపార్థం చేసుకుని జింకతో గొడవపడి అడవి నుంచి బహిష్కరించాను. ఇది వెళ్ళిన దగ్గర నుంచి అడవి జీవులన్నీ దిగులుతో ఆహారాన్ని మానేసి, ప్రాణాలను విడుస్తున్నాయి. కొన్ని సులభంగా వేటగాళ్ళకు దొరికిపోతున్నాయి. అపార్థంతో ఎంత పని చేశాను?" అన్నది సింహం. నక్క సిగ్గు పడింది. ఆ అడవి జీవులకు ఆపద వచ్చిందనే కలతతో జింక అక్కడ నుంచి హరితవనానికి వెళ్ళింది. తమ అహంకారం మూలంగా ఒక మంచి మనసున్న మృగాన్ని వదులుకున్నందుకు అడవి జీవులు ఎంతో బాధపడ్డాయి. ‌‌  

కామెంట్‌లు