శివాజీ గణేశన్ ముచ్చట్లు;;-- యామిజాల జగదీశ్
 శివాజీ గణేశన్....భారతీయ చలనచిత్రానికి ఓ విశ్వవిద్యాలయమని చెప్పుకునే వారున్నారు. అందరు నటులకూ అభిమానులుంటారు. కానీ అందరు నటులూ ఈయన అభిమానులే. ఆ కళాసాగరుడి గురించి కొన్ని ముచ్చట్లు....
చత్రపతి శివాజీ పాత్రలో నటించిన వి.సి. గణేశన్ ని వేదిక కింద నుంచి చూసిన తందై పెరియార్ "ఇక ఇతనే శివాజీ" అన్నారు. అదే ఇప్పటికీ అందరూ చెప్పుకునే పేరై స్థిరపడింది...."శివాజీ" అని.
నడిగర్ తిలకం శివాజీ మొట్టమొదటిసారిగా వేసిన పాత్ర "స్త్రీ పాత్ర". రాముడ్ని చూసే సీత పాత్రలో తొలిసారిగా నటించారు శివాజీ!
1952లో నేషనల్ పిక్చర్స్ వారి "పరాశక్తి" సినిమాలో గుణశేఖరన్ పాత్రలో శివాజీని కథానాయకుడిగా పరిచయం చేయాలని నిర్మాత పి.ఎ. పెరుమాళ్ నిర్ణయించుకున్నప్పుడు పలువురు విభేదించారు. కానీ ఎవరి మాటా తలకెక్కించుకోక శివాజీని హీరోగా పరిచయం చేసిన ఘనత పెరుమాళ్ కు దక్కింది.
సిన్సియారిటీ, క్రమశిక్షణ, చెప్పిన టైముకి రావడం వంటివాటికి శివాజీ ఓ ఉదాహరణ. 
ఏడున్నరకు షూటింగ్ అంటే ఓ అర గంట ముందరే సెట్ లో కనిపించేవారు శివాజీ. తన నట జీవితంలో ఏ ఒక్క రోజూ షూటింగుకి ఆలస్యంగా వెళ్ళారన్న మాటే లేదు.
కళ్ళైంజ్ఞర్ కరుణానిధిని "మూనా కానా" అనీ, ఎంజిఆర్ ని "అన్నన్" అనీ, జయలలితను "అమ్ము" అని పిలిచేవారు శివాజీ!
వీరపాండ్య కట్టబొమ్మన్, భారతియార్, వ.ఉ.చిదంబరం పిళ్ళై, భగత్ సింగ్, తిరుప్పూర్ కుమరన్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలన్నింటినీ పోషించారు శివాజీ!
 
తనను పరాశక్తి సినిమాకు పరిచయం చేసిన నిర్మాత పి.ఎ. పెరుమాళ్ ఇంటికి ప్రతి పొంగల్ పండుగ రోజూ వెళ్ళి ఆయన దగ్గర ఆశీస్సులు పొందడం ఆయన అలవాటు.
తిరుపతికి, తిరువానైక్కా, తంజై మారియమ్మన్ ఆలయాలకు ఏనుగులను కానుకగా ఇచ్చారు.
తమిళ సినిమా ప్రపంచంలో మొదటిసారిగా భారీ కటౌట్ పెట్టడం అనేది శివాజీ సినిమాకే. 1957లో విడుదలైన వనంగాముడి అనే సినిమాకు శివాజీ కటౌట్ ని భారీ స్థాయిలో ప్రదర్శించారు.
శివాజీ తన నటన కోసం పొందిన మొదటి బహుమతి ఓ వెండి పళ్ళెం. మనోహరా నాటకాన్ని చూసిన కేరళ కొల్లంగాడు మహారాజా ఈ కానుక ఇచ్చారు.
తన అన్నయ్య తంగవేలు, తమ్ముడు షణ్ముగం తదితరులతో ఉమ్మడి కుటుంబంగా కడదాకా గడిపారు. శివాజీ కాల్షీట్ అన్నింటినీ ఎప్పటికప్పుడు చూసేది తమ్ముడు షణ్ముగమే.
శివాజీ నటించిన మొత్తం సినిమాలు 301. వీటిలో తమిళ సినిమాలు 270. తెలుగు 9. హిందీ ఒకటి. మలయాళం ఒకటి. గౌరవనటుడిగా నటించిన సినిమాలు 19.
ప్రతి ఏడాదీ కుటుంబంతో కలిసి తన సొంత ఊరు సూరకోటలో పొంగల్ పండుగ జరుపుకునేవారు. ఈ వేడుకలలో అనేక మంది సినీప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొనేవారు.
శివాజీ వినాయకుడి భక్తుడు. వెండితో తయారుచేసిన ఓ చిన్న వినాయకుడి ప్రతిమను తన దగ్గరే ఉంచుకునేవారు.
శివాజీకి సిగరెట్ అలవాటుండేది. పరాశక్తి సినిమా దర్శకులు కృష్ణన. - పంజు ముందు మాత్రం ఆయన సిగరెట్ తాగేవారు కాదు.
రక్త తిలకం సినిమాలో ఈయన నటనను చూసి ప్రశంసించి చెన్నై సినిమా అభిమానుల సంఘం ఆయనకు అందజేసిన కానుక - ఒక తుపాకీ!
 
సినిమా షూటింగ్ సమయంలో తనకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించని వేళల్లో ఇతరుల నటనను తదేకంగా గమనించేవారు. ఎవరైనా అడిగితే కొన్ని సూచనలు చేసేవారు. సలహాలిచ్చేవారు. 
శివాజీ - ఎంజిఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా - గూండుక్కిళి.
రకరకాల వాచీలను పెట్టుకోవడం ఆయనకిష్టం. ఒమేగా, రోలక్స్ వంటి వాచీలెన్నో కొన్నారాయన.
తల్లి రాజామణి కోసం శివాజీ తన గార్డెన్ లో ఓ విగ్రహం చేయించి ఉంచారు. ఈ విగ్రహాన్ని ఎంజిఆర్ తో ప్రారంభింపచేశారు.
స్టేనిస్ లా వోస్కీ థియరి అనే నటనా కళాశాల విద్యార్థులకోసం రూపొందించిన పాఠ్యపుస్తకంలో శివాజీకి చెందిన 64 ముఖకవళికలు ప్రతిబింబించే ఫోటోలను ఉదహరించారు. 
ఆయనకో కోరిక ఉండేది. తందై పెరియార్ పాత్రలో నటించాలని. కానీ ఆ కోరిక తీరనేలేదు.
ప్రముఖ తవిల్ (డోలు) విద్వాంసుడు వలయపట్టి తమిళ సినిమాకు మీరే రోల్ మోడల్ అని చెప్పినప్పుడు "టి.ఎస్. బాలయ్య, ఎం.ఆర్. రాధా తర్వాతే తను మూడో స్థానంలో ఉంటానని వినమ్రతతో చెప్పారు శివాజీ.
కామరాజర్ అంటే శివాజీకి ఎంతో అభిమానం. గౌరవం. ఆ శివకామి సుపుత్రులైన కామరాజర్ అభిమాన సేవకుడు ఈ రాజామణి కొడుకు అని తన గురించి వినయంగా చెప్పుకునే వారు శివాజీ.
ఆయనకెంతో ఇష్టమైన ఆటలు - క్రికెట్. క్యారంబోర్డు.కామెంట్‌లు