చెంబై వైద్యనాథ భాగవతార్ ముచ్చట్లు - యామిజాల జగదీశ్
 కర్నాటక సంగీత ప్రపంచంలో ఏడు దశాబ్దాలపాటు రాజ్యమేలిన చెంబై వైద్యనాథ భాగవతార్ గారి గురించి కొన్ని సంగతులు.....
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడు సమీపాన ఉన్న కుగ్రామమైన చెంబైలో 1896 ఆగస్టు 28వ తేదీన ఆనంద భాగవతార్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించారు చెంబై వైద్యనాథ భాగవతార్. 
ఆయన తండ్రి, తాత, ముత్తాతలు శాస్త్రీయ సంగీతంలో విద్వాంసులే. సంగీతం వీరి వంశపారంపర్యగా వస్తున్నదే.
తండ్రి దగ్గర మూడో ఏట సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టిన  చెంబై సోదరుడు సుబ్రమణ్య భాగవతారుతో కలిసి ఒట్టపాలం కృష్ణాలయంలో మొదటిసారిగా వేదిక ఎక్కి కచేరీ చేశారు. అప్పుడు చెంబై వయస్సు ఎనిమిదేళ్ళు. వీరిద్దరూ కలిసి 
అనేక కచేరీలూ చేస్తూ వచ్చారు. 1914లో చెంబై ఏకాదశి సంగీత ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాలు ఇప్పటికీ క్రమం తప్పక కొనసాగుతున్నాయి.
హరికథలో సుప్రసిద్ధులైన 
నటేశ శాస్త్రిగారు చెంబై సోదరుల గాత్రానికి ముగ్ధులై వారిని తమిళనాడుకు ఆహ్వానించి తాను హరికథ చెప్పే వేదికలపై 
కథకు తగ్గట్లు సోదరులిద్దరితో పాడిస్తూ వచ్చారు. ఈ సంగీత కార్యక్రమాలకు విశేష ఆదరణ లభించేది.
తంజావూరు సంగీత ఉత్సవం, కరూర్ సంగీత ఉత్సవం అంటూ తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో 
చెంబై సోదరులకు కచేరీ చేసే అవకాశం వచ్చింది. వీరి గాత్రం గ్రాంఫోన్ రికార్డులగానూ వచ్చాయి.
చెంబై వైద్యనాథ భాగవతార్ కంఠానికో ప్రత్యేకత ఉండేది. తమిళనాడులోఎక్కువ అవకాశాలు రావడంతో మద్రాసులోని 
శాంథోంలో స్థిరపడ్డారు.
గురువాయూర్ ఏకాదశి రోజున 
శిష్యులతో కలిసి అక్కడ కచేరీ చేసేవారు. ఆయన గాత్రం గంభీరంగా ఉండేది. ఆయన పాట మొదలుపెట్టడంతోనే ప్రేక్షకులు మైమరచిపోయేవారు. మైకులు లేని కాలమది. అయినా ఈయన పాడుతుంటే చివరి వరుసలో ఉన్నవారికి సైతం స్పష్టంగా వినిపించేది 
 
 ఔత్సాహిక యువకులను ప్రోత్సహించడంలో ముందుండే వారు. వారిలో తాము కూడా రాణించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవారు. కచేరీలలో తమకు సహకరించే వాయిద్య కళాకారులతో సర్దుకుపోతుండేవారు. వాయిద్యకళాకారులు కూడా తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి అవకాశమిచ్చేవారు.
ఓమారు కంఠంలో సమస్య తలెత్తినప్పుడు 
ఆయన పాడలేకపోయారు. ఏ చికిత్సా ఫలితాన్నివ్వలేదు. అప్పుడొకరోజు గురువాయూర్ సన్నిధిలో 
మనసారా వేడుకున్న మరుక్షణమే గొంతు సరై కచేరీ చేసి అందరినీ అలరించారని ప్రేక్షకులు చెప్పుకునేవారు. అంతా ఆ స్వామి దయే అని   చెంబై వైద్యనాథ భాగవతార్ అన్నారు.
ఓమారు ఆయన వేదికపై నాదస్వర వాయిద్య కళాకారుడిని వాయిద్య సహకారాన్ని అందించమని చెప్పి అందుకు అనుగుణంగా చెంబై పాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. దీనిని బట్టీ ఆయన కంఠం ఎంత గంభీరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 
రక్షమాం, వాతాపి 
గణపతిం, పావన గురువంటి కీర్తనలను పాడితే చెంబై వైద్యనాథ భాగవతారే పాడాలన్నంతగా పాడి ప్రశంసలందుకున్నారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈయనకు బోలెడు మంది శిష్యులున్నారు. జయన్ , విజయన్ అనే కవలలు, కె.జె. జేసుదాస్, టి వి. గోపాలకృష్ణన్, వి.వి. సుబ్రమణ్యం, పి. లీల తదితరులు ఈయన శిష్యులే. కర్నాటక సంగీతంలో "చెంబై"  అనే ప్రసిద్ధులయ్యారు.
గాయన గంధర్వ, సంగీత కళానిధి, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు పొందిన చెంబై వైద్యనాథ భాగవతార్ 1974 అక్టోబర్ 16న కాలధర్మం చేశారు. అప్పుడు ఆయన వయస్సు 78 ఏళ్ళు.
ఆయన శతజయంతిని పురస్కరించుకుని 1996 ఆగస్టు 28న భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.
గురువాయూర్ కృష్ణాలయంలో ప్రతి ఏటా సంగీత కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఒకరిని ఉత్తమ కళాకారుడిగా ఎంపిక చేసి "చెంబై" అవార్డుతో సత్కరిస్తుండటం ఆనవాయితీ. అవార్డుతోపాటు 50,001 రూపాయలు, గురువాయూరప్పన్ లాకెట్టు, ప్రశంసాపత్రం ఇచ్చి శాలువ కప్పుతారు. చెంబై పేరిట ఇస్తున్న ఈ పురస్కారాన్ని పొందిన వారిలో గాత్ర, వాయిద్య విద్వాంసుడు టివి. గోపాలకృష్ణన్, వయోలిన్ విద్వాంసుడు 
ఎం.ఎస్. గోపాలకృష్ణన్, బాలమురళీ కృష్ణ, మృదంగ విద్వాంసుడు మావేలిక్కర్ వేలుకుట్టినాయర్, గాయకుడు పి. పొన్నమ్మాళ్, వీణ విద్వాంసుడు అనంత పద్మనాభన్, సాక్సోఫోన్ కళాకారుడు కదిరి గోపాలకృష్ణన్ తదితరులున్నారు.


కామెంట్‌లు