ఏది మిన్న -నందగిరి రామశేషు-కలం స్నేహం
 నగరారణ్యంలో ఎవరికి వారే యమునా తీరే
ఇది పరువులు తీసే పట్టణవాసుల తీరే
పట్టించుకోరు అక్కడ ఎవరిని ఎవరూ
ఉన్న ఊరొదలి పట్నం పోయినవారెవరూ
ఇమడలేరు అంత తేలికగా నగరాలలో 
అడిగేవారుండరు ఆకలేసినా కల్పించుకొని 
తెలిసినా దాహమని తీర్చేవారుండరు ఆర్తిని
అన్నీ తెలిసి అనుభవించినా ఆ జనారణ్యానికి
వలసపోక తప్పదు తమ పొట్టచేత పట్టుకుని
కన్నతల్లి గుర్తొస్తుంది కరకరలాడుతుంటే ఆకలి
నీడనిచ్చే తండ్రి జ్ఞప్తికొస్తాడు నిలువ నీడేలేకుంటే 
మనసును కలచివేస్తాయి బంధువుల ఆప్యాయతలు 
నిలువనీయవు క్షణమైనా భార్య ప్రేమానురాగాలు
ఓడిన తీరుగా ఊరికి పోనివ్వదు ఎద లోపలి సొద
దిగమింగి అన్నిటినీ, రాయి చేసుకొని మనసుని
తిరిగి పోక తప్పదు, వేలాడదీసి ఉట్టి చేతులని
ఊరిలో బంధుమిత్రుల ప్రేమ నిండిన పలకరింపు
ఇస్తుంది మనసుకి హాయి కలిగే ఊరడింపు
అనిపిస్తుంది జనారణ్యం కన్నా వనారణ్యం మిన్న
చేసుకుంటూ తెలిసిన పని తనవారితో కలిసి బ్రతకడం మిన్న.

కామెంట్‌లు