గుర్తుకొస్తున్నాయి పెళ్ళి పల్లకీలు   ;-  సత్యవాణి కుంటముక్కుల కాకినాడ-58639660866
  నాకు అనేకసార్లు నా చిన్నతనంలో "ఛీ..ఛీ.. అనవసరంగా  ఈ కొంపలో పుట్టాను.ఈ కొంపలో పుట్టకుండా వుండవలసింది.హాయిగా, ఏ గోటేటారింటిలోనో పుట్టివుండవలసింది . "అని ఎందుకు బాధపడేదాన్నో మీకు చెప్పాలి.
      ఎందుకంటే?బ్రాహ్మణ వీధిలో మా ఇల్లు 'ఇష్టంలేకుండా పెళ్ళిచేసుకొంటున్న పెళ్ళికూతురు మొఖం తిప్పుకున్నట్లు,' వీధికడ్డంతిరిగి వుంటుంది అదేమిట!.
పైగా మా ఇంటికి మలుపు తిరిగేటప్పుడు సత్తెంగారి
ధాన్యంగాదె ఒకటి అడ్డంవచ్చి, దారిని కొంచెం ,మరికొంచెం ఇరుకుగాకూడా చేస్తుంది.బండ్లూ,కార్లూ బహుకష్టంమీద వస్తాయిగానీ, కొంచెం నేర్పుగారావాలి.
      అయితే మా ఇంటి పడమటివైపు వైపు వసారాలోని కిటికీనుండి మా బ్రాహ్మణ వీధి మొత్తంగా కనపిస్తుంది, అది కాస్త గుడ్డిలో మెల్ల.మా ఇంట్లోవారమందరం జైలు ఊసలలోంచి దొంగాళ్ళు చూస్తున్నట్లు ఆ కిటికీలోంచే ఆ బ్రాహ్మణవీధినంతాచూడాలి., అప్పుడప్పుడు ఆవీధిచివరను కలిసే పెద్దవీధినుంచి వెళ్ళేవారినీ,వచ్చేవారినీ
 చూస్తూవుంటాము. మా ఇంటికొచ్చిన చుట్టాలు,మా ఇంట్లోవాళ్ళూ ఊరెళుతుంటే, వీధి చివరవరకు వెళ్ళేవరకూ ఆ కిటికీలోంచే మేము చూస్తూంటాం.వెళ్ళేవాళ్ళు వీధిచివరనున్న గోటేటివారిల్లు దాటి పెద్దవీధిలోకి ఎడంవైపుకు  మలుపు తిరిగేముందు, వెనక్కి తిరిగి చేతులు వూపి మరీ వెళ్ళేవారు. మేముకూడా అప్పుడు వారికి చేతులూపి ఊపి ,మరీ ఆత్మీయులైతే కన్నీళ్ళు తుడుచుకొంటూ మరీ వీడ్కోలు చెప్పేవాళ్ళం. అదే మా పిన్ని సుందరమ్మైతే ఇంటికి వచ్చినవారెవరెళ్ళిపోతున్నా, కళ్ళూ,ముక్కు ఎర్రబడేలా ఏడుస్తూ ఆకిటికీలోంచే వీడ్కోలు చెపుతూవుండేది.
      ఈ సోదంతా ఏమిటనుకోకండి.ఆ  బ్రహ్మణవీధి అంటే నాకెందుకంతకోపమంటే ,మాఇంట్లోవాళ్ళలాగా వాళ్ళు దొంగల్లా కిటికీలోచి చుడకుండా,దర్జాగా మహరాజుల్లాఅరుగులమీద కూర్చుని మరీ చూడొచ్చు.మరి నాకు ఆ అరుగులమీద దర్జాగాకూర్చొని చూసేవారంటే అసూయా,కొపాలుండడం సహజమేకదా ఆవయసులో!
     ఇక అసలు విషయానికి వస్తే ,మా ఊళ్ళో వెలమల జనాభా చాలా ఎక్కువ. వాళ్ళ ఇళ్ళల్లో సాధారణంగా ప్రతీ సంవత్సరం పదుల,పాతికల సంఖ్యలో పెళ్ళిళ్ళు ఎక్కువగా అవుతూవుంటాయి. . వారు ఇంచుమించు అందరికందరూ బీరకాయ పీచు చుట్టాలే అయివుండడంవలన,ఐకమత్యంగా,  ఇద్దరు ముగ్గురు,లేదా నలుగురు కలసి ఒకేముహుర్తం,లేదా గంటల తేడాలలో పెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు జరిపింకొంటూంటారు. సాధారణంగా ఊళ్ళో ,ఊళ్ళో సంబంధాలే వారు . చేసుకొంటూటారు. 
   అలా అయిన  పెళ్ళిళ్ళుఅయినజంటలు పెళ్ళిళ్ళుఅయ్యీ అవ్వగానే, చక్కగా అన్ని జంటలూ పల్లకీలలో ఊరేగింపు పెట్టుకొంటారు.  అలా అద్భుతమైన అలంకరణలతో అలంకరించిన ముత్యాల పల్లకీలలో, అందమైన జంటలు ,జంటలు జంటలుగా ఊరేగే దృశ్యం 
నేను దగ్గరగా చూడలేకపోతున్నానన్నదే నా బాధంతా!అందమైన జంటలు అని ఎందుకన్నానంటే మా రౌతులపూడి వెలమలు చాలా అందమైనవారు.పెళ్ళి వయసులోనూ, అలాగే పెళ్ళిసమయంలో వారి అలంకరణలోనూ, వారి అందం మరింత ద్విగుణీకృతమై ,మరింత శోభాయమానంగా  కనిపిస్తారు. ఆ అందాలను మరింత దగ్గరగా, ఆ అందమైన, ముత్యాలపల్లకీలలో వుండగా
 చూడలేకపోతున్నానన్న ఉక్రోషం నన్ను నిలవనిచ్చేది కాదు. కనీసం మా పాలికాపులకు పెళ్ళిళ్ళైనప్పుడు, వాళ్ళ పెళ్ళిళ్ళ పల్లకీలైనా మావీధిలోకి వస్తాయేమోనని వాళ్ళని అడిగేదాన్ని ,మీ పల్లకీనైనా మావీధలోకి మళ్ళించమని.అప్పుడు యువరాజులా అందంగా ,బాహుబలిలా పొడుగ్గా బలంగా వుండే రాజులనే పాలికాపు అసలు విషయం చెప్పాడు. ఎందుకంటే ట,మా నాన్న కరణంగారనీ,మాది బ్రాహ్మల వీధని, అందుకని  పల్లకీలు ఎక్కి మా వీధిలో సవారీచేస్తూ విహరించకూడదనీ ,అందుకని మావీధికి పల్లకీలు రావనీ.ఇకపై మరెప్పుడూ కూడా రావనే విషయాన్ని విప్పి చెప్పేశాడు. (ఇప్పుడెవరూ ఆరోజుల్లో అంటే, 60—70 సంవత్సరాలక్రితం  అలాజరిగేదని ఇప్పుడు తప్పుపట్టకూడదుమరి..ఆ నాడు  జనం బ్రాహ్మణులకు ఇచ్చే గౌరవంగానే భావించగలరు దయచేసి) మరాలాంటప్పుడే నాకనిపించేది . చక్కగా  ఝాం.. ఝామ్మంటూ ,పెద్ద..పెద్ద బ్యాండుమేళాలతో, గోటేటారింటి పక్కనున్న పెద్ద వీధిలోంచి మూడేసి ,నాలుగేసి పల్లకీలు ఒక్కసారిగా, ఒకదాని పక్కనొకటీ, ఒకదానివెనకాలొకటీ హంసల్లా వయ్యారంగా నడచుకొంటూ వెళుతుంటే,ఆ ముత్యాల పల్లకీల వెనుక,రంరంగుల బట్టలు కట్టుకొని,ఆడాళ్ళూ,మగాళ్ళూ,నడచివెళ్ళే ఆ అందాల సుందర దృశ్యాలనేకం నేనుచూడలేకపోతున్నానని, నా మనసు 'అలో'మని ఘోషించేది. మా పడమటపక్కవసారా కిటికీలోంచి చూస్తే, అటువంటి సుందర దృశ్యాలన్నీ చీమ తలకాయలంతంత చిన్నగా కనిపిస్తుంటే "ఛీ...ఛీ.., ఈ కొంపలో పుట్టకుండావుండుంటే,హాయిగా ఆ
 గోటేటివాళ్ళింట్లో పుట్టి వుండుంటే,చక్కగా ఆ వీధిలో వెళ్ళేవీ,వచ్చేవీ ,ఆ అరుగుమీద నుంచుని దర్జాగా చూసివుండేదాన్ని కదా! "అలా అని ఎన్నిసార్లు అనుకొనివుంటావని మాత్రం అడక్కండినన్ను. ఎన్నిసార్లు అనుకొని వుంటానో మటుకు నెేనిప్పుడు లెక్కలు మటుకు చిటుక్కున చెప్పలేనుమరి. నాకు కోపం వచ్చిందంటే రాదామరి? పోనీ అక్కడదాకా వెళ్ళి దగ్గరగా చూద్దా మంటే వయసుకు వస్తున్న ఆడపిల్లలు  ఇల్లుకదలి బయటికెళ్ళకూడదన్న  నియమం ఒకటుందిగామరి ఆరోజుల్లో. .అలా మా బ్రాహ్మణవీధికి రాని,రాలేని ఎన్ని అచ్చట్లు, ముచ్చట్లూ కోల్పోయేనో అని అప్పుడేకాదు ,ఇప్పుడూ అప్పుడప్పుడు బాధపడతాను.  చూడలేకపోయిన ముచ్చట్ల గురించి ఇప్పటికీ బాధపడుతూనే వుంటాను.

       

కామెంట్‌లు