సంక్రాంతిముగ్గులు-----; -సత్యవాణి కుంటముక్కుల  86 39 66 05 66
 మాధవి తెల్లవారుఝామున అలవాటుగా నిద్రలేచి,ముగ్గుగిన్ని పట్టుకు వీధిలోకి నడవబోతుంటే,వాళ్ళమ్మ విమల "అదేమిటే!పండగెళ్ళిపోయిందిగదా! ముగ్గుగిన్నిపట్టుకుతయారయ్యావు?పనిమనిషి పైడమ్మ  రథంముగ్గేసి సాయంత్రమే ఈడ్చేసింది.వెళ్ళికాస్సేపు పడుకో!రేపటినుంచి మళ్ళీ,కాలేజీ ,పరీక్షలహడావిడేకదా!"అంది కూతుర్ని ఆప్యాయంగాచూస్తూ.మాధవి "మరచిపోయేనమ్మా! నెల్లాళ్ళనుండీ అలవాటైపోయిందికదా!"అంటూ బెడ్ రూములోకిదారితీసి పడకెక్కి దుప్పటి ముసుగేసింది.
               విమలకి ముగ్గులువేయడమంటే మహాఇష్టం.ఇప్పుడైతే వంగుంటే లెవలేకపోవడం వలన ముగ్గేయలేకపోతోంది.అందుకనే కూతురుకి బ్రతిమాలీ బామాలీ ముగ్గులేయడం నేర్పించింది.ముందు ముగ్గులు నేర్చుకోవడానికి మాధవి గునిసినా,ఆ చుక్కలనుకలిపి,అందమైన చిత్రంలా మార్చే విధానంతెలిసేకా మాధవి మరింతశ్రధ్ధగా తల్లిదగ్గర క్రొత్త క్రొత్తముగ్గులునేర్చుకొని మరీ ప్రతిసంవత్సరం పోటీలోనెగ్గి బహుమతులుగెలవడం అలవాటైైపోయింది.విమల కూడా కాస్త ఖాళీ దొరికితే,క్రొత్త క్రొత్త ముగ్గులు కనిపెట్టి,నెలగంటపెట్టగానే వివిధపత్రికలకు ముగ్గులు  పంపించి బహుమతులు గెలుస్తూవుంటుంది.అసలు ముగ్గులు పెట్టడం అన్నది ఒక ప్రొప్షెన్ లాగ తీసుకుందని చెప్పవచ్చు విమల.
  ముగ్గులఅభ్యాసం విమలకి వాళ్ళనాయనమ్మనుంచివచ్చింది.ఆవిడ విరిగిపోయిన రాచ్చిప్పముక్కతో గచ్చునడవంతా నిండిపోయేలా చుక్కలుపెట్టి,ముగ్గులు కలుపుతూనేవుండేది. మద్యమద్యన "ఒసేయ్ విమలా! పదిహేడుచుక్కలనుంచి ఐదుచుక్కలదాకా రెండుప్రక్కలా చుక్కలు పెట్టిపోవే,నేనుముగ్గుకలుపుతానుఅని,చుక్కకీ చుక్కకీ మద్యన చుక్కలుపెట్టించి ,ఆచుక్కలను అందమైన పూలలతల్లా,తులసికోటల్లా, తామరపువ్వుల్లా రకరకాల ఆకారాల్లో తీర్చిదిద్దుతుంటే విమల చక్రాలంతకళ్ళతో చూస్తూ ,ముగ్గులమీదమమకారంపెంచుకొంది.నాయనమ్మదగ్గర, రకరకాలముగ్గులు వేయడం నేర్చుకొంది. ఆ వయసప్పుడే నాయనమ్మతోకలసి క్రొత్తక్రొత్తముగ్గులు పెట్టడానికి  శ్రీకారంచుట్టింది.దానికోసం ఇంట్లోవాళ్ళకితెలియకుండా ఒకటిరెండు రాచ్చిప్పలను ముక్కలుచేసి,ఆరాచ్చిప్పముక్కలను ,"ముగ్గులువేయడంనేర్చుకోండే!" అంటూ తనస్నేహితురాళ్ళకు పంచేదికూడాను.విమలకి అప్పుడేకాదు ఇప్పటికీ ఆశ్చర్యమే! 'నల్లటి రాచ్చిప్పముక్క ,తెల్లగా సుద్దముక్కలా' అలా ఎలారాస్తుందాఅని.?
ఆవిధంగా మొదలైన ముగ్గులపైన ఇష్టం, సంక్రాంతికి నెలగంట పెట్టెసరికి 
మరింతపెరిగేది.ఎప్పుడెప్పుడు నెలగంట పెడతారా !ఎప్పుడెప్పుడు ముగ్గులప్రదర్శన మొదలెడదామా అని వువ్విళ్ళువూరిపోయేది.
                       ఇక నెలగంటపెట్టేసేకా రాత్రంతానిద్రలోనే చుక్కలముగ్గులు అందంగా కలుపుతూనేవుండేది.అమ్మ ముగ్గులు వేయడంకోసం కోసం ,నూకలు,బియ్యం మెత్తని పిండిగా దంపించేది. అలాపిండిదంపించటం ముక్కనుమలోపల మూడుసార్లుజరిగేది.
అలా బియ్యంపిండితో ముగ్గులు పెడితే,చీమలూ మొదలైనకీటకాలకు మనం ఏడాదికి సరిపడే ఆహారం ఇచ్చినట్లే అనేది బామ్మ.సరే మళ్ళీ ముగ్గులోకి వచ్చేద్దాం.
                           ఎప్పుడు తెల్లవారుఝామౌతుందా? ఎప్పుడెప్పుడు లేచి ముగ్గులేద్దామా అనే యావతో పడుకొనేదేమో, గంటగంటకీ మెలకువవచ్చేసేది. ఆమె అవస్తగమనిస్తున్న నాన్న "అమ్మా! నేనులేపుతానులేరా! హాయిగాపడుకో"
 అనేవారు."లేపాలినాన్నా!లేకుంటే సీతారామయ్యతాతగారి రత్నం,అమ్మల్సు నన్ను ఓడించేస్తారు "అంటూ అయిష్టంగానే పక్కమీదచేరినా,
ఎవరూలేపకుండానే సమయానికి ముగ్గుగిన్నెపుచ్చుకొని వీధిలోకి చేరిపోయేది."నెత్తీమీద ఏదైనాకప్పుకో మంచుపడుతోంది! "అన్న అమ్మ హెచ్చరికను ఈచెవినుండి ఆ చెవికి వదిలిపెట్ఠేసి ,ముగ్గులమీద మనసునులగ్నంచేసేది. 
                          ఇక్కడ విమలలాగే,పక్కింట్లోంచి రత్నం,అమ్మల్సు,రామక్కయ్య ముగ్గుగిన్నెలతో రడీఅయ్యేవారు.ఆయింటి వీధీ ,ఈ ఇంటివీధీ ముగ్గులతో కలసిపోయేవి.అలాగే కుడిప్రక్క వీధిలో లక్ష్మీపతిమావయ్యగారిభాను,ఆవీధినుంచి సత్యంగారింటినుంచి ,చిన్నా,లక్షణమ్మ,సుబ్బలక్ష్మి,,పాపా ముగ్గులు కలిపేస్తే,చిట్టివెంకటరావుమామయ్యగారింట్లోంచి తాయారు అందుకొనేది. వీర్రాజుమామయ్యగారింటిలోంచి వల్లభరావుపెళ్ళాం సావిత్రక్కఅందుకొనేది.అక్కడనుంచి బుచ్చిరాజుతాతగారింటిముందు కామేశ్వరీ ,నరసమ్మ ముగ్గులను గోటేటారింటి వీధిదాకా కలిపేవారు.అక్కడనుంచివాళ్ళింట్లొంచి రాజేశ్వరి,భానూ, రాంబాయి సరస్వతి అందుకొని ముగ్గులతో వీధి విధంతా నింపేసేవారు.అలా బ్రాహ్మణవీధి, వీదంతా ముగ్గులతో నిండిపోయి రత్నకంబళ్ళు పరచినట్లుండేది.
                   ఇక్కడమరిన్ని విషయాలుమాట్లాడుకోవాలి. ముగ్గులుపెట్టేటప్పుడు వీధమ్మట లక్షింపతిమావయ్యగారి నూతికి నీళ్ళకొచ్చే వెలమ ఆడంగులంతా, నెత్తిమీదకుండ పెట్టుకొని, బుగ్గలమీదవ్రేలేసుకొని మేం ముగ్గులువేయడం  ఆశ్చర్యంగాచూస్తూ, అలా చెక్కినశిల్పాల్లావుండిపోయేవారు. నిజంగాకూడా,క్షణంకూడా తీరికలేకుండా పనిపాటలు చేసే మా వెలమలింటి ఆడపిల్లలు బాపూ బొమ్మల్లా అందంగా వుండేవారు.
     వీధమ్మట పొలాలకెళ్ళే రైతులు ముగ్గులు చూస్తూనే "పాపగారూ! నడవడానికి కాస్త జాగావదలండమ్మా!"అనివేడుకొనేవారు.పండగ వెళ్ళేదాకా,పశువులు ప్రక్కవీధమ్మటవెళ్ళాల్సిందే.దీనిని బట్టే తెలుస్తుంది మా ముగ్గులమురిపం ఎంతటిదో,  ఏమిటో!
అన్నయ్యకానీ ఏడిపించడానికి ముగ్గులోంచి సైకిల్ కానీనడిపించేడా,నాచాడీలువిన్న నాన్న అన్నయ్య చెవిని  మెలేసేవారన్నమాటే.
అలాగే "నేనూ ముగ్గులుపెట్టగలను .""అంటూ ముగ్గుగిన్ని పట్టుకొచ్చి,తప్పులుతో ముగ్గేసినా అయిపోయేడన్నమాటే.
అలా             ముక్కనుము దాకా ముగ్గులతో ముంగిలినింపిన తరువాత చుక్కలరథం ,ఒకఇంటి రథంతో ,మరొక ఇంటిరథాన్ని కలుపుతూ ,త్రాడులా ముగ్గుతో గీసేసిన తరువాత మనసంతా చిన్నపోయేది.గుమ్మంలోకొచ్చిన ముత్యాలపల్లకీలో పెళ్ళి ఊరేగింపుగా వచ్చిన పెళ్ళిపల్లకీ వెళ్ళిపోయినప్పుటిలా.
                 అయితే ఇప్పట్లా ఎవరూ పోటీలుపెట్టి ,ముగ్గులకు బహుమతులిచ్చేవారు ఆనాడులేరు.దారెమ్మట ముగ్గులుచూస్తూ వెళ్ళేవాళ్ళే న్యాయనిర్ణేతలు.ఆవీధిలోఆముగ్గుబాగుంది, ఈవీధిలో ఈముగ్గుబాగుందంటూ వెళ్ళేవారు. ఆమాటలే మాకు బహుమతులు,ప్రోత్సాకాలు,ప్రశంసాపత్రాలు.
               మధ్యలో కొన్నాళ్ళు అమ్మళ్ళు ముగ్గులు పెట్టడం మరిచిపోయినా ,మళ్ళీ ఈనాడు ఇంటిముందు చేరెడు స్థలమున్నా, సిమెంటు రోడ్డైనా,రెట్టింపు ఉత్సాహంతో 'కలంకారీ'కళలా ముంగిళ్ళు మగ్గులతో కళకళ్ళాడిస్తూ వుండ

డం విమలకు చాలాఆనందంగావుంది.అందులో తనకూతురు ,ముగ్గులపోటీలో బహుమతులు పొందుతుండడం మరింత ఆనందంగావుంది. అలా పత్రికలవాళ్ళు తనముగ్గులకు బహుమతులిచ్చినప్పుడూ, ముగ్గులపోటీలలో తనకూతురు బహుమతులు తెచ్చినప్పుడూ, విమల తననాయనమ్మను తలచుకొని,
"నీ ముగ్గులవారసత్వంపోనీలేదులే బామ్మా!"అంటూ  పైకిఒకసారిచూస్తుంది. నాయనమ్మరూపాన్ని ఎర్రెర్రని మేఘాలలోచూసుకొంటుంది విమల. నాయనమ్మ శహబాష్ అని మెచ్చుకొన్నట్లనిపిస్తుంది విమలకు
                     
కామెంట్‌లు