ఎనభైలోనూ బిజీ రచయిత్రి విమలారమణి!;-- యామిజాల జగదీశ్
 ఆమె పెళ్ళయిన తర్వాతే రాయడం మొదలుపెట్టారు. తొలి రోజుల్లో ఆమె రాసిన కథలలో అనేకం గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేవి. అయినా ఆమె అందుకు డీలా పడలేదు. రాతలో ఎక్కడ లోపముందో వాటిని ఎలా సరిదిద్దాలో ఆలోచించి మళ్ళీ రాసేవారు. ఇలా నిరంతరం రాస్తూ వచ్చిన ఆమె పేరు విమలా రమణి. 1935 ఫిబ్రవరి 5న తమిళనాడులోని దిండుగల్లో జన్మించిన విమలగారి గురించి కొన్ని ముచ్చట్లు.....
1960 దశకం. ఆమె భర్త కోయంబత్తూర్ కాటన్ మిల్స్ లో ఆడిటరుగా పని చేస్తున్న రోజులవి. ఓరోజు ఆయన ఆఫీసుకి వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న వసంతం అనే పత్రికా కార్యాలయానికి ఆమె రాసిన కథ ఇచ్చారు ప్రచురణ నిమిత్తం! ఓ నెల తర్వాత ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ వసంతం పత్రికతో ఇంటికొచ్చి ఆమెకిచ్చారు. ఆ సంచికలో ఆమె కథ అచ్చవడమే కాకుండా కవర్ పేజీలో ఆమె పేరుతోపాటు కథ శీర్షిక కూడా కనిపించడంతో విమలా రమణి ఎంతగానో సంతోషించారు.
ఆమె తల్లి ఆసక్తిగల పాఠకురాలు. పత్రికల్లో వచ్చే సీరియల్సుని  బైండ్ చేసి ఇంట్లో పేర్చేవారు. సెలవు రోజలలో ఈ పుస్తకాలను చదవడంతో ఆమెకూ రాయాలనే ఆలోచన కలిగింది. తమిళంలో శివకామి శపథం విశేష ఆదరణ పొందిన నవల. ఇది చదివిన రోజుల్లో చాలామందికి శివకామి అనే మనిషి నిజంగా ఉండేవారా అనుకునేవారు. వారిలో ఈమె కూడా ఒకరు. ఈ నవలతోనే ఆమెకూ రాయాలనే ఆరాటం కలిగింది.
ఆ తర్వాత ఆమె రచనలు కల్కి, కుముదం, రాణి వంటి పత్రికలలో యాభై ఏళ్ళుగా ఆమె రచనలు వెలువడుతూ పాఠకలోకంలో అభిమానరచయిత్రిగా దగ్గరయ్యారు.
వెయ్యికిపైగా చిన్న కథలు, ఏడు వందల నవలలు రాసిన విమలా రమణి 1935లో జన్మించారు.
కంచి పట్టుచీరలో ఓ అచ్చమైన తమిళ గృహిణిలా కనిపించే ఆమె కలం పట్టిన రోజులలో మహిళలు, అందులోనూ ప్రత్యేకించి సాంప్రదాయక కుటుంబానికి చెందినవారు రాతకోతలకు దూరంగా ఉండాలనే కట్టుబాట్లు ఉన్న కాలమది. అందుకు కారణం, పెద్దగా చదువుసంధ్యలు ఉండేవి లేకపోవడమే. కానీ తర్వాత్తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఆమె గుర్తుచేసుకుంటూతన చుట్టూ జరుగుతున్న సంఘటనలలో నుంచే కథలు సృష్టించారు.
పట్టుదల ఉండి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించవచ్చనే విమలా రమణి తన కథలలోని స్త్రీ పాత్రలలో తాననుకున్న, తాను నమ్మిన పట్టుదలను ప్రతిబించేవారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యవంతంగా ఎలా ఎదుర్కోవాలో తన రచనలద్వారా చూపించేవారు.
మనదుల్ పెయిద మయయై తుళిగల్ (మనసులో కురిసిన వానచినుకులు) ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
ఆమె కథలు పాఠకాదరణ పొందడానికి కారణం - హాస్యం ఉండటం, స్వతంత్రంగా ఆలోచించే పాత్రలను సృష్టించడమే. పాఠకులలో పాజిటివ్ గా ఆలోచించే తత్వాన్ని పెంచడమే తన ప్రధాన ఉద్దేశమంటుంటారు విమలా రమణి. 
తమిళ కథా సాహిత్యంలో మేటి రచయిత్రులుగా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ రచయిత్రులు శివశంకరి, అనూరాధా రమణన్, వాసంతి, ఇందుమతి వంటివారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆమె శివశంకరిగారి అనేక పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనూరాధ మంచి స్నేహితురాలని, తమ కుమార్తె వివాహానికి వచ్చారని విమల తెలిపారు.
ఆమె రాసిన నవల "ఉలా వరుం ఉరవుగల్"ను 1986లో "కన్నే కణియముదే" పేరుతో సినిమాగా తీశారు. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొద్ది మార్పులు చేసినప్పటికీ తనకా సినిమా ఎంతో నచ్చిందన్నారు.
ఆమె ఓ సంఘటనను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 
అదేంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. వాటిలో వస్తువులతోపాటు ఆమె రాసిపెట్టుకున్న కాగితాలూ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె కుముదం అనే వారపత్రికలోని ఓ మిత్రుడికి ఉత్తరం రాశారు. అది ఒరు ఎయుత్తాళరిన్ కన్నీర్ ( ఓ రచయిత్రి కన్నీరు) అనే శీర్షికతో ఆ లేఖ అచ్చయింది. అది చదివి ఎందరో ఆభిమాన పాఠకులు ఆమెకు ఉత్తరాలు రాశారు.
ఓ నెల తర్వాత చోరీకి గురైనవన్నీ దొరికాయట. దొంగలు వాటినేమీ చేయలేకపోవడానికి కారణం అనేక చోట్ల దాదాపుగా అన్ని పత్రికలలో వెలువడటమే  అంటారామె.
కేవలం రాయడానికే పరిమితమవక ఆమె 1960 దశకంలో ఆలిండియా రేడియోలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరుచిరాపల్లి రేడియో స్టేషన్లో అర గంట కార్యక్రమం కోసం ఆమె నాలుగ్గంటలు ప్రయాణం చేసి తిరుచ్చీ చేరుకునేవారు.
ఇక 1970 ప్రారంభంలో ఆమె రేడియో నాటికలూ రాసి విశేష గుర్తింపు పొందారు. 
1978లో ఆమె రాసిన "భగత్ సింగ్" నాటిక అఖిల భారత రేడియో నాటకోత్సవాలకు ఎంపిక చేసి రేడియోవారు పద్నాలుగు భాషలలో అనువాదం చేయించి వివిధ కేంద్రాలలో ప్రసారం చేయడం మరచిపోలేనన్నారు.
కోయంబత్తూరు రేడియోవారి రజతోత్సవాలకూ ఆమె రాసిన నాటిక తిరైగళుక్కు అప్పాల్ కు మంచి ప్రశంసలు లభించాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ అగ్రికల్చరల్ యూనివర్శిటీవారి అన్నా ఆడిటోరియంలో ఈ నాటకం ప్రదర్శించడం, అదేరోజు రాత్రి రేడియోలో ప్రసారమవడం ఓ తీయని అనుభూతిగా ఆమె చెప్పుకున్నారు.
1975 - 1980 మధ్య కాలంలో ఆమె నాటకాలు రాయడమే కాక దర్శకురాలిగా, మేనేజరుగా ఓ సొంత నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందం పేరు నవరత్న. ఆమె రాసిన నాటకాలలో కొన్ని వంద ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఆమె నాటకాన్ని ప్రముఖ సినీ దర్శకుడు కె. బాలచందర్ ప్రత్యేకించి కొనియాడటమే కాకుండా మన్మధలీలై అనే సినిమాలో ఓ పాత్రను విమలారమణి నాటకంలోని ఓ పాత్ర ఆధారంగా సృష్టించడం విశేషం.
చాలా సంవత్సరాల క్రితం ఒక రోజు, ఒక శ్రీలంక వ్యక్తి హఠాత్తుగా ఆమె ఇంటికి వచ్చాడు. అతను తనను తాను పరిచయం చేసుకుని మీ రచనలకు అభిమానని అంటూ ఆమె రచనలపై విశ్లేషించి మాట్లాడాడు. చివరగా  "ఇక్కడికి వస్తుంటే దార్లో తన సంచీ, పర్సు దొంగలు దోచుకున్నారు. మీరు సాయం చేస్తే ఇంటికి వెళ్ళగానే మీ డబ్బు మీకు తిరిగి పంపుతాను" అన్నాడు. అతని మాటలన్నీ విన్న విమలారమణి  బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తూ క్షేమంగా ఇంటికి చఘరుకో అని వీడ్కోలు పలికారు.
"ఎనభై ఏళ్ల వయస్సులోనూ, మీరు ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ఇ-బుక్స్‌లో ఎలా యాక్టివ్‌గా ఉంటారు! " అని అడగగా ఆమె
‘‘ఎప్పటిలాగే పొద్దున్నే లేస్తాను. ఉదయం ఐదు గంటలకు రాయడం మొదలుపెడతాను. ఓ రెండు గంటలపాటు రాయడం అలవాటు. కంప్యూటర్‌లో టైప్ చేస్తాను. వాటిని "ఈ -మెయిల్" లో పంపుతాను. నా కథల కోసం యూ - ట్యూబ్‌లో 'విమలారమణి నవలా రచయిత' అనే ఛానెల్ కూడా ఉంది. అందులో నా కుమార్తె రూపా హరిహరన్ నా కథలను చదువుతుంది. నా రచనలన్నీ అమెజాన్, బుక్స్, నవలా జంక్షన్‌లోని ఈ- బుక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. నన్ను నేనిలా బిజీగా ఉంచుకోవడంవల్లే మనసుకి హాయిగా ఉన్నాను" అన్నారు విమలా రమణి.
కామెంట్‌లు