"జై సేన";-ఎం బిందుమాధవి
    ( The power of youth)
2020 జూన్ లో విడుదలయిన "జై సేన" చిత్రాన్ని  "శివ మహా తేజ ఫిల్మ్స్" బ్యానర్ లో అరుణ్ కుమార్ వంకదారి నిర్మించారు. వి సముద్ర దర్శకత్వం వహించారు.
శ్రీకాంత్ CBI Officer గా అతిధి పాత్రలో, సునీల్ ముఖ్యమైన ACP పాత్రలో నటించారు. నందమూరి తారకరత్న, శ్రీరాంశ్రీ, సత్యం రాజేష్ (లెక్చరర్)  మరికొంత మంది ముఖ్య పాత్రల్లో నటించారు.
తొలిసారిగా పరిచయమవుతున్న ప్రవీణ్,  విశ్వ కార్తికేయ, హరీష్ గౌతం, అభినవ్ మణి కంఠ, ప్రీతి శర్మ, మనో చిత్ర , ఆరాధ్య, నీతూ గౌడ, ...తిరుమల శెట్టి కిరణ్ లు విద్యార్ధులు..వారి గర్ల్ ఫ్రెండ్స్ గా నటించారు.
మంత్రిగా మధుసూధన్ రావు నటించారు.
పార్వతి చందు సంభాషణలనందించారు.
"ఏ దేశ ప్రగతికైనా... భవిష్యత్తుకైనా యువతే ముఖ్యం..వారే ఆధారం, వారే బలం...వివేకానందుడి లాంటి వ్యక్తులు నేటికీ మన దేశంలో ఉన్నారు... వారు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు... కాలంతో పోరాడగలరు...ఆకాశానికి నిచ్చెన వెయ్యగలరు... నేటి యువత మార్పుని కోరుకుంటున్నది" అని ఉత్తేజపరిచే మాటలతో టైటిల్స్ వస్తాయి.
గాయపడిన ఒక యువకుడు నెత్తురోడుతూ అడవి దారిలో పరుగెత్తుతూ "గాడ్సే" (శ్రీకాంత్) అనే ఒక CBI Officer  కారు కింద పడటంతో చిత్రం మొదలవుతుంది.
కారణం అడిగిన ఆఫీసర్ తో తను, తన ఫ్రెండ్స్ మరో ముగ్గురు కలిసి ప్రజానాయకుడు..మంత్రి అయిన వ్యక్తిని మోసం చేశామని, అతను తమని కిడ్నాప్ చేసి హింసిస్తుంటే తను పారిపోయివచ్చానని చెబుతాడు.
మూల కధలో కి వెళితే... మిత్రులు నలుగురు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. అందులో ఒకతను దగ్గరలో ఉన్న ఒక పల్లెలో రైతు కొడుకు. వారి మాటల్లో అతను తమ పల్లెలో రైతులు జరుగుబాటు లేక తరచు ఆత్మ హత్యలు చేసుకుంటూ ఉంటారు అని చెబుతాడు. అప్పుడే ఆ సమస్యకి తమ వంతుగా ఏదో ఒకటి చెయ్యాలి అని నలుగురూ తీర్మానించుకుంటారు.
రైతుల బతుకులు దీనంగా ఉండటానికి కారణం....పొలాలకి నీటి సరఫరా ఉండదు.  దానికి పరిష్కారంగా ఆ ఊరికి కొంత దూరంలో ఉన్న గోదావరి నించి రివర్స్ పంపింపింగ్ విధానంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించాలని నిపుణులు చెబుతారు. అది ఎప్పుడూ ప్రణాళికలు..ఆలోచనల స్థాయిలోనే ఆగిపోతున్నదని, ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా ఏదో విధంగా పాలకులు దాటేస్తున్నారని ఆ ఊరికి చెందిన విద్యార్ధి చెబుతాడు.  ప్రాజెక్ట్ వస్తే తమ బతుకులు బాగుపడతాయని అంటాడు.
రైతు బతుకు దుర్భరం కాబట్టి,  బస్తీకెళ్ళి కూలో నాలో చేసుకు బతుకుదామని విసిగిపోయిన ఆ విద్యార్ధి తల్లి తన భర్త  అయిన రైతుతో అంటుంది.
పదెకరాలున్న రైతు పదిళ్ళల్లో పాచి పని చేసుకు బ్రతికే స్థితికి దిగజారటానికి ప్రభుత్వాలు, ప్రకృతే కారణమని ఆ రైతు ఆవేదన పడతాడు.
అర్జీ సమర్పించుకోవటానికి వచ్చిన ఆ ఊరి ప్రజలకి చేస్తాను, చూస్తాను అని చెబుతూ..తనతో మాట్లాడటానికి వచ్చిన మరొక రాజకీయ నాయకుడితో, ఆ ఊరి వాళ్ళు తనని మూడు సార్లు ఓడించి ఒక్కసారి మాత్రమే గెలిపించారని, అక్కడ ఉండేది  3000 జనాభా... వారి  కోసం పదిమైళ్ళ దూరంలో ఉన్న గోదావరి నీటిని రివర్స్
పంపింగ్ విధానం ద్వారా తేవాలంటే షుమారు 200 కోట్లు ఖర్చు అవుతుందని, ఒక సారి ఆ ప్రాజెక్ట్ పూర్తయి వారి జీవితాలు బాగుపడితే వాళ్ళు తమకి ఓట్లు వెయ్యరు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అలా అడిగే స్థితిలో ఉండాలని వ్యవసాయ మంత్రి సగటు రాజకీయ నాయకుడిలాగా దుర్మార్గంగా మాట్లాడతాడు. మిగిలిన రైతుమిత్రులని బయట వదిలి అర్జీ ఇవ్వటానికి ఇంటి లోపలికి వెళ్ళిన ఆఊరి వ్యక్తి ఆ మాటలు విన్నాడని చూసి అక్కడికక్కడే చంపిస్తాడు.
వాళ్ళ కాలేజి ప్రిన్సిపల్ (పృధ్వి రాజ్) స్టూడెంట్స్ కి వడ్డీకి అప్పులిస్తూ ఉంటాడు. నలుగురు విద్యార్ధుల్లో రైతు కొడుకు  అయిన విద్యార్ధి ఫీజు కట్టే డబ్బు లేక ఆయన దగ్గర అప్పు తీసుకుంటాడు.
వడ్డీ సరిగా కట్టకపోతే వారి సర్టిఫికెట్స్ ఇవ్వనని బెదిరిస్తాడు.
ఇక అక్కడి నించి అందుబాటులో ఉన్న సాంకేతికతని ఉపయోగించి ఆ ప్రిన్సిపల్ వ్యక్తిగత రహస్యాలు తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వక్కరలేకుండా అతన్ని ఈ నలుగురు విద్యార్ధులు లొంగతీసుకుంటారు.
చిత్రం తరువాతి భాగంలో... ప్రాజెక్ట్ వచ్చే ఆశ లేక, ఆత్మ హత్య చేసుకుంటే పరిహారం కింద ప్రభుత్వం 5.50 లక్షలు ఇస్తుందని, అది తన కొడుకు చదువుకి ఉపయోగ పడుతుందని..మిగిలిన కుటుంబ సభ్యుల జీవితాలకి ఆధారం దొరుకుతుందని...  సదరు రైతు పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకుంటాడు. 
అప్పుడు ఈ విద్యార్ధులు నలుగురు ఆ మంత్రి గారిని కలిసి ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్టుగా అతనితో మాట్లాడుతూ పెన్ కెమేరాలతో అతని అసలు స్వరూపాన్ని, ఆంతర్యాన్ని విడియో తీస్తారు.
ఒక సాంకేతిక నిపుణుడి సహాయంతో ఆ మంత్రి గారి బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో నించి డబ్బు డ్రా చేసి, ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు.
విద్యార్ధులు ఈ పనులన్నీ చెయ్యటం నిశ్శబ్దంగా ఒక పోలీస్ అధికారి గమనిస్తూ, ఇది ఒక మంచి పని అని...దానికి ఆ మంత్రి తాలూకు వాళ్ళు వీళ్ళకి అడ్డం రాకుండా తనదైన శైలిలో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. తరువాత ఆ విద్యార్ధులని కలిసి వాళ్ళు చేసింది మంచి పనే అయినా...అకౌంట్స్ హ్యాక్ చెయ్యటం నేరమని, చట్టానికి లొంగి పొమ్మని, తను వారిని చట్టపరంగా కాపాడతానని హామీ ఇస్తాడు.
కానీ ఆలోపే మంత్రి గారు ఆ పోలీసు ఆఫీసర్ ని చంపిస్తాడు.
అలా కోర్ట్ లో లొంగిపోయిన ఒక విద్యార్ధి పూర్తి సాక్ష్యాలతో ఆ మంత్రి చేసిన దుర్మార్గాలు, హత్యలు జడ్జికి చూపిస్తాడు.
మంత్రిగారికి కోర్టులో శిక్ష పడినా, తన పవర్ తో బయటకు రాగలడు కనుక అలా బయటికి వచ్చి ....ఆ నలుగురు విద్యార్ధులని కిడ్నాప్ చేసి హింసించి చంపే ప్రయత్నం చేస్తూ ఉండగా ఒకతను తప్పించుకుని CBI Officer రక్షణలోకి వెళతాడు.
ఆ CBI Officer మంత్రి గారి బృందాన్ని మట్టు పెట్టటంతో చిత్రం ముగుస్తుంది.
కాలేజి లో ఉండే ప్రేమలు, విద్యార్ధులు లెక్చరర్లతో చేసే చిన్న చిన్న ఆకతాయి పనులు షరా మామూలుగా చూపించారు.
ప్రిన్సిపల్ విద్యార్ధుల అవసరాలని ఆసరాగా తీసుకుని వడ్డీ వ్యాపారం చెయ్యటం ఆ పాత్రకి అంత హుందాగా లేదు.
యువత తలచుకుంటే ఏదయినా సాధించగలరు. వారి శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధికి ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించచ్చు అని ఈ చిత్రం ద్వారా చెప్పారు.
ఎన్నో అనుమతులు పొందుతూ, ఎంతోమంది శ్రామికులు మరెన్నో యంత్రాలు పని చెయ్యవలసినవి కోట్ల రూపాయలప్రాజెక్ట్స్ పూర్తి చెయ్యటం చిత్రంలో చూపించినట్లు అంత తేలికగా, అంత తక్కువ సమయంలో అసాధ్యం! ఆశయం మంచిదైనా అది కొంత అసహజంగా ఉంది.
అలాగే రాజకీయ నాయకులు కుటిలత్వానికి, స్వార్ధానికి, హత్య రాజకీయాలకి పాల్పడుతూ తమకి ఎదురొచ్చే వారిని బతకనివ్వరు అని పదే పదే చూపిస్తుంటే చదువు అయిపోయిన యువత...బతికి బట్ట కట్టాలంటే దేశం వదిలిపోవటమే మార్గం అని ఆలోచించటం సరైనదే అనే భావన కలుగుతుంది.
రాజకీయ నాయకులు హత్యా రాజకీయాలకి దూరంగా ఉంటూ యువ శక్తితో అద్భుతాలు చేసి ప్రజల మన్ననలు పొందచ్చు అనే కధలు వస్తే యువత దేశాన్ని కొత్తగా అభివృద్ధి పధంలో నడిపించగలరు అని, కొత్తభారతాన్ని ఆవిష్కరించగలరని నిరూపిస్తారు.
మేధో వలసలు తగ్గచ్చు.
రోజూ మనం చూస్తున్న, వింటున్న అకౌంట్స్ హ్యాకింగ్...డబ్బు నేరస్థుల పాలవ్వటం అనే అదే సాంకేతికతని సానుకూల అంశాలకి వాడుకోవచ్చు అని చూపించటం ప్రశంసనీయం.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు...విద్యార్ధి శక్తిని, సాంకేతికతని ఉపయోగించి చిత్త శుద్ధితో పని చేస్తే అద్భుతాలు సాధించచ్చు అనే సందేశం ఇచ్చారు.
"రైతు చెయ్యి మట్టిలోకెళితేనే మన చెయ్యి నోట్లోకెళుతుంది"
"కుర్రాళ్ళు ఫేస్ బుక్ లో లైకులు కొట్టించుకోవాలి కానీ, ఫేసుల మీద దెబ్బలు కాదు"
"తోటి ఫ్రెండ్ దొరికితే పబ్బులకెళ్ళాలి ...గర్ల్ ఫ్రెండ్ దొరికితే పార్కులకెళ్ళాలి..కానీ రైతుల వెంట పొలాల్లో తిరగటం చూస్తే ఆశ్చర్యం. అందరూ అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటుంటే మీరు మాత్రం అన్నదాత సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్స్ పూర్తవ్వాలి, పొలాలకి నీరందాలి. రైతు బావుండాలి. ఒక మంచి ఫ్రెండ్ తోడుంటే ప్రపంచాన్ని జయించచ్చు" లాంటి పవర్ఫుల్ సంభాషణలు ఆలోచింపజేస్తాయి.
రవితేజ నటించిన భగీరధ చిత్రంలో కూడా ఆలోచన, ప్రణాళిక ఉంటే సాంకేతికతని ఏస్థాయిలోనైనా ఉపయోగించచ్చు అని నిరూపించారు.

కామెంట్‌లు