హరికథల కమలా మూర్తి!;-- యామిజాల జగదీశ్
తమిళంలో హరికథనే కథాకాలక్షేపమని అంటారు. మన తెలుగులో ఆదిభట్ల నారాయణ దాసుగారిని హరికథా పితామహుడిగా.చెప్పుకుంటే తమిళంలో  తంజావూరు కృష్ణభాగవతారుని ఈ 
 కళకు పితామహుడిగా గౌరవంగా చెప్పుకుంటారు. ఆయన తరానికి ముందు భక్తి కథలను పౌరాణిక ఉపన్యాసాలుగా చెప్పేవారు. ఇవి మరాఠావారి హరికథా సంప్రదాయానికి అనుగుణంగా ఉండేవి. ఇందులో సంగీత అంశాలనూ జోడిస్తూ వచ్చారు. ఇందులో వచనం, నటన, సంగీతం, తాత్విక ఆలోచనలు కలిసుంటాయి.
తమిళంలో దీర్ఘకాలం హరికథలు చెప్పిన వారిలో కమలామూర్తి ఒకరు. 
 
1932లో చిదంబరం సమీపంలోని లక్ష్మీకుడి గ్రామంలో రామచంద్ర అయ్యర్, సీతాలక్ష్మి అమ్మాళ్ దంపతులకు కమల జన్మించారు  ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కుటుంబానికి చెందిన ఈమెకు చిన్నప్పటి నుండీ గాత్రం, సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. 
ఆమె అసలు పేరు కమలాంబ. తాతయ్య చిన్నవయస్సులోనే ఆమెను చిదంబరానికి తీసుకుపోయారు.
చిదంబరంలో రాజా భాగవతార్ అనే ఆయన ప్రత్యేకించి పిల్లలకు భజనలు నేర్పుతుండేవారు. అయితే కమలలోని సంగీత ప్రతిభను గుర్తించిన ఆయన కథాకాలక్షేపం ఎలా చెప్పలో నేర్పించారు.
ఆమె తొమ్మిదో ఏట. చిదంబరంలో 'వత్సలా కళ్యాణం' కథతో హరికథ కళలో రంగప్రవేశం చేసారు.
గురువు మరణానంతరం వీరి కుటుంబం తంజావూరు జిల్లాలోని తిరువయ్యార్‌లో స్థిరపడింది. అప్పట్లో ప్రసిద్ధులైన తిరువయ్యారు అన్నాసామి భాగవతార్ దగ్గర శిష్యరికం చేస్తూనే వేదికలపై హరికథలు చెప్తుండేవారు. పదహారో ఏట త్యాగరాజు ఆరాధనోత్సవంలో భాగంగా బెంగళూరు నాగరత్నమ్మ సమక్షంలో హరికథ చెప్పారు.
ఇద్దరు గురువుల దగ్గర చదువుకున్న అనుభవంతో కమల హరికథను అద్భుతంగా చెప్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 
ఆమె ప్రావీణ్యాన్ని గుర్తించిన హరికథా కళాకారిణులు సి. సరస్వతీ బాయి, ఇళయనర్వేలూరు శారదాంబాళ్ ఆశీర్వదించి బంగారు భవిష్యత్తుందని ప్రకటించారు.
ఆమెకు 1948లో కృష్ణమూర్తితో వివాహమైంది. భార్య ప్రతిభను తెలుసుకుని ఆయన మరింత ప్రోత్సహించారు. 
ఎంబార్ ఎస్. విజయరాఘవాచార్యార్, మేధావులు వెంకటసుబ్రమణ్య శాస్త్రి, స్వామనాథ ఆత్రేయల నుంచి హరికథలు చెప్పడంలో మరిన్ని మెళకువలు తెలుసుకున్న కమల మూలకథతోపాటు హాస్యపూరిత పిట్టకథలనూ చెప్పి ప్రేక్షకులను నవ్వించేవారు.
కమలా మూర్తి తమిళనాడులోని నలుమూలలకి వెళ్లి హరికథ చెప్పడమే కాకుండా  రేడియో, టెలివిజన్లలోనూ ఆమె అనేక కార్యక్రమాలతో  మంచి ఆదరణే పొందారు.
శ్రీలంక, సింగపూర్, మలేషియాలలోనూ హరికథలు చెప్పిన కమలా మూర్తి 80 ఏళ్ళు దాటిన తర్వాతకూడా ఎంతో ఉత్సాహంతో హరికథలు చెప్పిన సంఘటనలున్నాయి.
పెళ్ళిళ్ళు, ఆలయ ఉత్సవాలు, ఇతర శుభకార్యాలలో ఆమె హరికథ తప్పనిసరిగా ఉండేది.
కేదారగౌళ, సురట్టి, సహానా, నాటకురుంజి వంటి రాగాలలో దిట్టయిన కమల వివిధ భాషలలో పాడుతూ ఎక్కడికక్కడ అర్థాలు చెప్పి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేవారు. కార్యక్రమం అయిపోయేవరకు చిడతల సవ్వడి వినిపిస్తూనే ఉండేది.
వత్సలా కళ్యాణం, మామ గానం  (దుర్యోధనుడు శకునికి చెప్పిన విషయం), చిరుతొండ నాయనర్ చరిత్ర, సతీ సులోచన, నీలకంఠ నాయనర్, కన్నప్ప నాయనార్ వంటి కథలు ఆమెకు మంచి పేరు సంపాదించిపెట్టాయి.
 
మనవరాలు సుచిత్రా బాలసుబ్రమణియన్ కూడా  ఆమె అడుగుజాడలలో నడిచి గొప్ప హరికథా నిపుణురాలిగా ఎదగడం ముదావహం.
రాష్ట్రప్రభుత్వం కలైమామణి అవార్డుతో ఆమెను సత్కరించింది. 
2018 డిసెంబర్ పదో తేదీన ఆమె తుదిశ్వాసవిడిచారు.కామెంట్‌లు