కలసి ఉంటే కలదు సుఖము;-ఎస్. ఎల్ రాజేష్;-కలం స్నేహం
చిన్న వయసు లో పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు
బరువుగా మారుతున్న సంసారాలు.. 
ఇంటి పెద్ద పోషణ కోసం భారంగా 
దూరమెళ్ళిన వేళ
కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టు 
భత్రత గా పెంచడం తల్లికి మరింత కష్టమే.

ఎంతైనా ఆడపిల్లకు తండ్రి మీద 
మమకారం ఎక్కువే.
అమ్మానాన్న కలసి ఉంటే
పసి హృదయాలకు మరింత సంబరమే.
నలుగురు కూడిన వేళ వారింట పండగే మరి.
ఆ చిన్న ఇల్లే రాజ సౌధం అవుతుంది.
దూరం గా వెళ్లిన భర్త తిరిగి వచ్చేవరకు 
ఆ ఇల్లాలికి నిత్యం అగ్ని పరీక్షే.

ఆమె మనసు ఆందోళన ఆవేదన
మధ్య నలుగుతూనే ఉంటుంది.
ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ
పిల్లల కోసం తానూ పసిపాపై ఆడిస్తుంది.
తండ్రి బాధ్యత కూడా తానే మోస్తుంది.
ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.

మరోవైపు ఎదుగుతున్న ఆడపిల్లల్ని
ఈ కుటిల సమాజంలో ఎలా పెంచాలనే
భయం వేధిస్తుంది.
లోకులు కాకులై కారు కూతలు
కూస్తుంటే అల్లాడిపోతుంది.

ఒకరికి ఒకరు దూరమై ఎంత
సంపాదించినా సుఖశాంతులు
లేని సంసారం వ్యర్ధమే కదా.
నలుగురు కలిసి గంజి నీళ్ళు
తాగినా అది ఆ చక్కని సంసారానికి
అమృతమే కాదా..


కామెంట్‌లు