పిరికివాడి మంచితనం ; -శృంగవరపు రచన
  రావి శాస్త్రి గారి రచనలు చదివినా అంతగా గుర్తుండలేదు. కానీ అర్ధం చేసుకునే దశ వచ్చాక చదివితే,ఓ కొత్త సత్యానుభవాన్ని  సాక్షాత్కారింపజేయగల శక్తి ఉన్న రచయిత ఆయన అనడంలో సందేహం లేదు. నేనెందుకు రాసాను? అన్న శీర్షికలో జీవితంలోని ప్రతి దశలో తన రచనా విలువల్ని మార్చుకుంటూ, సమర్థించుకున్న తీరును కూడా స్పష్టం చేసిన ఆయన నిజాయితీ, ఆయనను ప్రభావితం చేసిన రచయితలు, తనను పెదదోవ పట్టించిన రచనలు, అన్నింటి నుండి తానే మంచి చెడు అన్న గీతను నిరంయించుకున్న తీరును చెప్పడం ఆయనకు తాను రాసేసినా వాటిల్లో నచ్చిన,నచ్చని వాటి పట్ల కూడా బాధ్యత వహించడం, తన నిర్లక్ష్యాన్ని, లెక్కలేనితనాన్ని చెప్పుకోవడం ఆయనను రచయితల్లో మహా రచయితను చేయడానికి ఓ పునాది అయ్యిండవచ్చు. ఆయన 'అల్పజీవి' నవల మొదలుపెట్టినప్పుడు ఆయన కేవలం చిన్న చిన్న విషయాలే చిన్నవాళ్లకు మహా సమస్యలుగా ఎలా తయారువుతాయో అనే అంశం గురించి మాత్రమే రాద్దామనుకుని మొదలుపెట్టానని చెప్పినా ఆ నవల్లో ఆ చిన్న వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించే పయనంలో అది ఓ స్థాయి మనోవిశ్లేషణ నవలగా కూడా రూపొందింది.
        ఈ నవలలో ముఖ్య పాత్ర సుబ్బయ్య. అతను సుందరుడు కాడు, ధైర్యవంతుడు కాడు, ప్రతి దానికి భయపడే వాడు. ఈ నవల చివరిలో రచయిత ఓ మాట అంటారు. అన్ని సద్గుణాల్లో ప్రథమమైంది ధైర్యం అని, అది ఉంటేనే మిగిలినవి అలవడుతాయని ఈ మాట చెప్పిన సామ్యూల్ జాన్సన్ ను ఆయన ప్రస్తావించారు. పిరికివాడు అయినా సుబ్బయ్య జీవితంలో ఎలా ఓ వ్యక్తిత్వం లేకుండా చివరి వరకు మిగిలిపోయాడో అన్న అంశాన్ని ధృఢపరచడానికి రచయిత సుబ్బయ్య లాంటి పరిస్థితులే ఎదురైన వెంకట్రావు, గవరయ్య లాంటి పాత్రలను కూడా సమంతారంగా నిర్మించారు. అంటే ఒకే నేపథ్యం వల్ల ఎన్ని రకాల వ్యక్తులు రూపొందుతారో కూడా రచయిత చెప్పే ప్రయత్నం చేసారు.
       
     సుబ్బయ్యలో పిరికితనం ఏర్పడటానికి ఇదే కారణం అని చెప్పకపోయినా అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి రచయిత చెప్తాడు.అతను పుట్టడంతోనే తల్లి మరణించింది.ఆ తర్వాత అతని తండ్రి ఇంకో స్త్రీని వివాహం చేసుకోవడం ఆమె వల్ల ఓ సంవత్సరం బాధలు పడటం ఆ తర్వాత తండ్రిని వదిలి ఆమె వెళ్లిపోవడం, ఆ తర్వాత ఓ సారి తండ్రితో కలిసి వెళ్తున్నప్పుడు తండ్రిని కొందరూ కొట్టడం వంటి సంఘటనలను రచయిత చెప్పి సుబ్బయ్య మనస్తత్వానికి ఇవి కూడా కారణం అయిఉండవచ్చని సూచిస్తాడు కానీ ఇవే అని గట్టిగా చెప్పడు.
      ఇకపోతే ఈ కథలో ఇంకో ముఖ్యపాత్ర వెంకట్రావు. జమీందారీ కుటుంబంలో జన్మించినా తండ్రి హయాంకు వచ్చేటప్పటికి అన్ని వ్యసనాల వల్ల కరిగిపోయాయి.వెంకట్రావును మేనమామ అక్కడ వ్యవహారాలు చూస్తున్న వానితో కలిసి మోసం చేయడంతో అతను బికారిగా మారిపోయాడు. కానీ ఈ అనుభవాలతో గట్టిపడ్డాడు. తన చెల్లెలు సావిత్రిని సుబ్బయ్యకు ఇచ్చి వివాహం చేశాడు. సుబ్బయ్యకు సావిత్రి అంటే దగ్గరితనం లేదు ఇద్దరు పిల్లలు పుట్టినా సరే. ఆమె గొప్ప కుటుంబానికి చెందిన స్త్రీ మరియు గొప్ప అందమైన మహిళ అని అటువంటి ఆమెకు తాను తగను అనే భావనతో ఆమెకు దూరంగా భక్తితో భయంగా మసలుతూ ఉంటాడు.
     ఈ కథలో ఇంకో ముఖ్య పాత్ర గురవయ్య.గురవయ్య తండ్రి వదిలేసాక తల్లి వేశ్య వృత్తిలో ఉంటూనే కుటుంబాన్ని సాకింది.రామాయమ్మకు ఇచ్చి పెళ్ళి చేసింది. ఎంతో అమాయకంగా ఉండే వెంకట్రావుకు స్నేహితుడు ఉద్యోగం ఇప్పించాడు.పై అధికారి తన భార్యతో సంబంధం పెట్టుకోవడం ఆ తర్వాత భార్య వెళ్లిపోవడంతో అతను పూర్తిగా కరడు గట్టిన కాంట్రాక్టరుగా మారిపోతాడు. డబ్బులు బాగా సంపాదించాడు.
       ఇకపోతే ముఖ్య కథలోకి వస్తే చిన్న గుమాస్తాగా పని చేస్తున్న సుబ్బయ్యకు లంచాలు తీసుకునే చొరవ లేకపోవడం ప్రతి దానికి భయపడే వాడు కావడం వల్ల అతన్ని డిస్పాచ్ సెక్షన్ నుండి అకౌంట్స్ సెక్షన్ కు వేస్తాడు ఆ పై అధికారి. కానీ వెంకట్రావు తనకు ఐదు వందలు అవసరం పడిందని గురవయ్య ఫైల్స్ అతని దగ్గరే ఉన్నాయి కనుక ఆ డబ్బు అడగమని చెప్తే భయపడినా వెంకట్రావు అంటే ఉన్న భయంతో చేస్తాడు. గురవయ్య ఇస్తాడు. సుబ్బయ్య అలా తీసుకున్న విషయం తెలిసిపోవడంతో అతన్ని మళ్ళీ డిస్పాచ్ కు వెయ్యడంతో గురవయ్య ఆ డబ్బు తిరిగి ఇమ్మని బెదిరిస్తాడు.
     వెంకట్రావు ఆ డబ్బు ఇవ్వడానికి సుముఖంగా ఉండడు అంత డబ్బు తెచ్చే తాహతు శుభబయ్యకు లేదు. సుబ్బయ్యకు స్కూల్ టీచర్ మనోరమ పరిచయం అవుతుంది. ఆమె ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత గురవయ్య డబ్బు కోసం సుబ్బయ్యను బెదిరించి వెయ్యి రూపాయలకు నోటు రాయించుకుంటాడు. ఆ సమయంలో ఈ సమస్య గురించి మనోరమకు, వెంకట్రావుకు, తన ఆఫీసులో అవధానులకు చెప్పుకుంటాడు సుబ్బయ్య. మనోరమ తనకు గురవయ్య అంతకు ముందు తెలుసని చెప్పి  అతనితో మాట్లాడతానని చెప్తుంది. మాట ప్రకారం అతనితో మాట్లాడుతుంది. ఆ ఐదు వందలు తానే కడతానని చెప్తుంది. వెంకట్రావు ఉంచుకున్న స్త్రీ గురించి అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆమె రామాయమ్మ అన్న విషయం అందరికి చెప్తానని బెదిరిస్తాడు వెంకట్రావు. అవధానులు కూడా అతని బిల్స్ పాస్ అవ్వనివ్వనని చెప్తాడు. ఇలా నాలుగు వైపుల నుండి వచ్చిన ఒత్తిడి వల్ల మొత్తానికి ఆ నోటు సుబ్బయ్య చేతికి వస్తుంది. అలా ఆ సమస్య నుండి గట్టెక్కిన సుబ్బయ్య మనోరమను బీచ్ లో కలుసుకుంటాడు.
       ఇక్కడితో నవల ముగుస్తుంది. ఇక్కడ సుబ్బయ్యకు తాను తెచ్చిపెట్టుకున్న చిన్న అంశం కూడా ఎలా ప్రాణంతకం అయ్యిందో చెప్పే ప్రయత్నమే కథ అయినప్పటికీ అందులో సుబ్బయ్యకు మిగిలిన ముఖ్య పాత్రలు వెంకట్రావు, గురవయ్య చెడ్డవారు అయినప్పటికీ వారి ధైర్యమే వారి పట్ల ఓ మంచి అభిప్రాయం పాఠకులకు కలిగేలా చేస్తుంది.
     మనిషికి ఉండాల్సిన మొదటిసారి సద్గుణం ధైర్యం అని, అది ఉంటే మిగిలిన సద్గుణాలు అవే వస్తాయని అన్న  జాన్సన్ వాక్యాన్ని రావిశాస్త్రి గారు చెప్పినా, ధైర్యవంతులే మంచో చెడ్డో ఏదో ఒకటి చేయగలుగుతారని పిరికి వారు మంచివారైనా ఉపయోగం లేదనే భావనను ఈ 'అల్పజీవి' ద్వారా బలపరిచారు. ఈ చిన్న నవలలో కొంత మంచి చెడుల కన్నా ధైర్యమే మనిషికి ఈ సమాజంలో ఓ స్థానాన్ని, స్థాయిని ఆపాదిస్తుందని అందుకే సుబ్బయ్య మంచివాడైనా పిరికివాడు కావడం వల్ల అతను పని చేసే ఆఫీసులో లంచాలు తీసుకునే అధికారి తన లంచాలకు అడ్డు రాకుండా ఉండేందుకు సుబ్బయ్యను కించపరిచాడు అని రచయిత రాసారు. మనిషిలోని పిరికితనం నుండి వచ్చే మంచితనం కన్నా ధైర్యం నుండి వచ్చే చెడ్డతనమే మేలేమో అన్న భావన కూడా ఈ నవల చదివితే కలుగక మానదు.
      *      *     *

కామెంట్‌లు