*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౬ - 76)*
 *నారదుడు కోపముతో విష్ణుభగవానుని దూషించి శపించుట - శివమాయ నుండి విడివడి నారాయణుని పాదముల మీద పడుట - మనసును శుద్ధి చేసుకునే ఉపాయము అడుగుట - శివ మాహాత్మ్యము ను తెలుసుకొనుటకు బ్రహ్మ వద్దకు వెళ్ళమని ఆదేశించి, శివుని భజించు ఉపదోశము నొసగుట*
* శివ మాయ నుండి బయటపడిన నారదమహర్షి కి "శివనామ" విశిష్టత గురించి ఇంకా ఈ విధంగా చెపుతున్నారు నారాయణుడు.*
*శివ నామము అనే పడవలో కూర్చుని ప్రయాణము చేసేవారు, సంసార దుఃఖాలను, భవ సాగరాలనే కాకుండా వైతరణీనదిని కూడా సునాయాసంగా దాటి ముక్తి ధామానికి చేరగలుగుతారు. శివ నామము పట్టుకుని వున్న వారి అన్ని పాపాలు నిస్సందేహంగా కొట్టివేయ బడతాయి. శివ నామము అనే గొడ్డలి చేత అన్ని పాపాకార్యాలకు మూలమైన పాతక వృక్షాన్ని నరికివేయ వచ్చు.*
శ్లో:
*శివనామతరీం ప్రాప్య సంసారాబ్ధిం తరంతి తే!*
*సంసార మూలపాపాని తేషాం నశ్యంత్యసంశయం!*
*సంసారమూలభూతానాం పాతకానాం మహామునే!*
*శివనామకుఠారేణ వినాశో జాయతే ధృవమ్!!*
                                         (శి.పు.రు.సృ. 4/51,52)
*పాపములు అనే అగ్ని తో మండుతున్నవారు, శివనామ అమృతము తాగడంవల్లనే శాంతి పొంద గలుగు తారు. పరమాత్మడు అయిన శివుని పూజ మాత్రమే పరమోత్తమ సాధనము. సంసార బంధనాలనుండి ముక్తి ప్రసాదించగల ఒకే ఒక్క మార్గము శివపూజ. అన్ని వేదములు, ధర్మ శాస్త్రములు పరిశీలించి పండితులు చెప్పిన మాట ఇది.*
*నారదా! ఈ రోజు నుండి శివపూజా విధి తెలుసుకుని, సావధాన మనస్సుతో, అంబా సమేతుడైన ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ, పూజచేయి. ఆ స్వామి కథలను పదే పదే విని, గానము చేయుము. ప్రతి క్షణమూ, ప్రతి రోజు నీవు గానము చేస్తూ అందరి చేతా చేయించు. హృదయములో ఎంతో గొప్పవైన శివపాదుకలను నిలుపుకుని అన్ని శివ క్షేత్రములను దర్శించుము. శంకరుని మాహాత్మ్యము ను విశ్వమంతటిలో తిలకించి, చిట్ట చివరకు ఆనందవనమైన కాశీనగరాన్ని చేరి అన్నపూర్ణా, విశాలాక్షి, కాశీవిశ్వేశ్వరుల దర్శనం చేసుకుని పూజచేయి. అప్పుడు, నా ఆజ్ఞను అనుసరించి, నిర్వికల్పుడవు, సంశయ రహితుడవు అయిన నీవు, భక్తిపూర్వకముగా నీ మనోసిద్ధి కొరకు బ్రహ్మలోకానికి వెళ్ళు.*
*బ్రహ్మ దేవుని చక్కగా నుతి చేసి, భక్తి నిండిన హృదయముతో శివ నామ మహిమల గురించి చెప్పమని పదే పదే నీ తండ్రి ని అడగుము. బ్రహ్మ శివభక్తులలో శ్రేష్టుడు.  అటువంటి బ్రహ్మ నీకు శంకరుని మాహాత్మ్యము మరియు శతనామ స్తోత్రము చెప్తాడు. నారదా! ఈ రోజు నుండి నీవు శివభక్తుడవు అయ్యి, విశేష రూపముతో మోక్షమునకు అర్హత సంపాదించు కొనుము. భగవంతుడు అగు శివుడు నీకు ఎల్లప్పుడూ మేలు చేయు గాక! అని నారదముని కి ప్రేమతో కూడిన వాత్సల్యంతో విష్ణుమూర్తి తన అనుగ్రహాన్ని అందిస్తాడు.*
*ఈ విధంగా విష్ణుమూర్తి అనుజ్ఞ పొంది, శివనామ మహిమామృతము తాగుతూ, నామ స్మరణ చేస్తూ, నమస్కారములు చేస్తూ విష్ణు లోకం నుండి అంతర్ధానం అయి శివ సన్నిధికి ప్రయాణం మొదలు పెడతాడు, నారదముని!*
                   
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు