నీవొక యానకమై
నాకు సులోచనాలైనపుడు
ప్రపంచాన్ని స్పష్టంగాచూపిస్తావు
దూరమైన లేదా మరీ దగ్గరైన
అస్పష్టమైన బొమ్మలు
సజీవ సాక్ష్యాలుగా నిలబడినప్పుడు
వాటికి జవాబు నేనవ్వడమో,
నేను ప్రశ్నించడమో నాకు
విజ్ఞాన సంతృప్తిని మిగుల్చుతుంది.
చుట్టూ మౌనాన్ని కప్పుకున్నవేళ
పడకకుర్చీలో పుస్తకనేస్తంతో
కుస్తీపట్లు పడుతున్నప్పుడు
ఉత్ప్రేరకానివి నువ్వే.
ఎందరెందరో మహాత్ములు
చరిత్రపుటల్లో ఒదిగిపోయినా
పవిత్ర జన్మస్థలాల్లో
సంజీవనీజ్ఞాపకానివై
స్ఫూర్తిని రగిలిస్తావు.
నీలోంచి దర్శిస్తున్నలోకం
ఆలోచననుంచి సాలోచనయై
నిరాకారపు కల సాకారమవుతుంది.
ఒక నవకవిత్వం సాక్షాత్కారమౌతుంది.
జీవన నేస్తంగా నీవందించిన సహకారానికి
నా జన్మ సార్ధకమవుతుంది!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి