సమస్య వస్తే...;-- యామిజాల జగదీశ్
 సమస్య ఎదురైతే పక్కన పడేయాలి, అప్పుడు పరిస్థితులు తానుగా చక్కబడతాయి.
ఓరోజు టీచర్ తరగతి గదిలోకి ఓ గాజు గ్లాసుతో ప్రవేశించారు. 
గుడ్ మార్నింగులయ్యాక టీచర్ ఆ గాజు గ్లాసుని తీసుకుని విద్యార్థులందరికీ  చూపించారు.
"ఈ గ్లాసు బరువెంతో చెప్పండి చూద్దాం?" అని అడిగారు టీచర్.
ఒక్కో విద్యార్థి ఒక్కో జవాబు చెప్పారు. ఒకరు వంద గ్రాములంటే ఒకరు యాభై గ్రాములని రకరకాల జవాబులు చెప్పారు.
అయితే టీచర్ "నిజానికి దీని కచ్చితమైన బరువు నాకూ తెలీదు. కానీ నేను చెప్పబోయేది వేరు...." అంటూ తన మాటలు కొనసాగించారు.
"ఇలాగే నేను దీనిని చేతిలో ఉంచుకుని ముందుకు చాస్తే ఏమవుతుంది?" అని అడిగారు. 
"ఏమీ అవదు టీచర్" అన్నాడొక విద్యార్థి.
"గుడ్. కానీ ఓ గంట సేపు అలాగే చెయ్యి చాచి ఉంచితే ఏమవుతుంది" అని టీచర్ ప్రశ్నించారు.
”మీ చేయి నొప్పెడుతుంది" అన్నారు విద్యార్థులు.
“ఒకరోజంతా అలాగే ఉంచితే ఏమవుతుంది?" అని టీచర్ అడిగారు.
"చేయి మొద్దుబారిపోతుందండి" చెప్పారు విద్యార్థులు.
"వెరి గుడ్. ఒక గంటకైతే నా చేయి నొప్పెడుతుంది. ఓ రోజంతా అయితే చేయి మొద్దుబారిపోతుంది. ఈ రెండు స్థితులకూ కారణం ఈ గ్లాసేనా? అంటే గంట గడిచేకొద్దీ గ్లాసు బరువు పెరుగుతుందా?" 
“లేదు టీచర్....గ్లాసు బరువులో తేడా ఉండదండీ" అన్నారు విద్యార్థులు ముక్తకంఠంతో.
"సరే కానీ, నాకు చేయి నొప్పెట్టకుండా ఉండటానికీ, చేయి మొద్దుబారకుండా ఉండటానికీ నేనేం చేయాలీ?" అడిగారు టీచరు.
గ్లాసుని పక్కన పెట్టెయ్యాలండీ" చెప్పారు విద్యార్థులు.
"కరెక్టుగా చెప్పారు. అంటే సమస్య ఉత్పన్నమయ్యేది గ్లాసుతోనే. సమస్య ఎదురైనప్పుడు దానిని బుర్రలోకి పోనిచ్చి ఓ గంటసేపు అలానే ఉంచుకుంటే తలనొప్పెడుతుంది. రోజంతా ఉంచుకుంటే బుర్ర పని చేయదు. మెదడు మొద్దుబారుతుంది. కనుక మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని తీసి ఓ పక్కన పెట్టెయ్యాలి. పరిష్కరించుకోగలమనే నమ్మకం ఉండి సవ్యంగా ఆలోచిస్తే ఫలితముంటుంది. అంతేతప్ప సమస్య వచ్చేసిందే అని క్షణక్షణం దాని గురించే ఆలోచిస్తూ ఉంటే సమస్య పరిష్కారం కాకపోగా ఆందోళనకు గురవుతాం. ఒత్తిడి ఎక్కువవుతుంది. ఏం చేయాలో తెలియక నలిగిపోతాం. కనుక సమస్యను పక్కన పెట్టెయ్యాలి...." అన్నారు టీచర్.
ఇదే మానసిక రీతిలో సమస్యకు తెరదించడమంటే. మనసుని దెబ్బ తీసే సమస్యల విషయంలో చాలా జాగర్తగా ఉండాలి.
తెలుసుకుందాం. తెలియపరచుదాం.
మంచిదే తలుద్దాం. మంచే జరుగుతుంది.
ఇది తమిళంలో చదివాను. రచయిత ఎవరో తెలీదు. నాకు వాట్సప్ లో వస్తే రాసానిక్కడ.

కామెంట్‌లు