ఎవరు పిచ్చోడు?;-- యామిజాల జగదీశ్
 అతనొక పిచ్చివాడు. 
ఓచోట అతనికి విలువైన వజ్రం లభించింది. కానీ అతనికి అది వజ్రం అనో దాని విలువ చాలా ఎక్కువనీ తెలీదు. ఆ వజ్రాన్ని అతను తన గాడిద చెవికి ఓ దారంతో కట్టి వేలాడదీశాడు.
ఇదంతా చూస్తున్న ఒక వ్యాపారి కాస్సేపైన తర్వాత అతని దగ్గరకు వెళ్ళాడు. 
” ఈ రాయి నాకిస్తే నీకు డబ్బులిస్తా. నీకెంత కావాలో అడుగు" అంటాడు.
వెంటనే పిచ్చోడు "అలాగైతే ఓ రూపాయి ఇచ్చి ఈ రాయి తీసుకో" అన్నాడు.
అయితే వ్యాపారి ఇంకా కూడా తక్కువ ఇచ్చి ఆ వజ్రాన్ని కొట్టెయ్యాలనే ఉద్దేశంతో రూపాయి చాలా ఎక్కువ. నీకు యాభై పైసలిస్తాను. నువ్వది తీసుకోనంటే నాకీ రాయీ అక్కర్లేదు" అంటాడు.
పిచ్చివాడు "నీకక్కర్లేదంటే ఆ రాయి నా గాడిద చెవికే ఉండనీ. నువ్వెళ్ళు" అని గాడిదను తోలుకెళ్ళాడు ముందుకి.
కానీ వ్యాపారికి ఎలాగైనా అది కొట్టెయ్యాలనుకున్నాడు. యాభై పైసలిచ్చి తీసేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు.
ఇంతలో అక్కడికి మరొక వ్యాపారి వచ్చాడు. ఈ రెండో వ్యాపారి ఓ వంద రూపాయలు పిచ్చివాడికిచ్చి ఆ వజ్రాన్ని తీసుకుంటాడు.
ఇలా జరుగుతుందని ఊహించని మొధటి వ్యాపారి కంగుతింటాడు. పిచ్చివాడి దగ్గరకెళ్ళి "నువ్వొట్టి మూర్ఖుడివి. కోటి రూపాయలు ఖరీదు చేసే వజ్రాన్ని వంద రూపాయలకే అతనికిచ్చేసి ఆనందంగా పోతున్నావుగా. నువ్వు నిజంగా పిచ్చోడివే" అన్నాడు.
అప్పుడా పిచ్చోడు పెద్దగా నవ్వి "ఎవరు మూర్ఖుడు? నాకు దాని విలువంటూ తెలిస్తే కదా అది కోటి రూపాయలో ఒక రూపాయోనని. అందుకే వాడికి ఇచ్చేశాను" అన్నాడు.
అయినా నాకిదే చాలా ఎక్కువ. అందంగా అతనిచ్చిన వంద రూపాయల కాగితం తీసుకున్నాను. దాని విలువ తెలిసీ యాభై పైసలే ఇస్తానన్న నువ్వే పిచ్చోడివి. బుర్రలేనివాడివి. నువ్వే నాకంటే పెద్ద మూర్ఖుడివి" అంటాడు పిచ్చోడు. 
తానెంత తెలివైనవాడిననుకున్న వ్యాపారి పిచ్చోడి మాటలతో మరి నోరెత్తలేదు. యాభై పైసలకు కొట్టెద్దామనుకున్న వజ్రంకాస్తా చేజారిపోయిందేనని ఎంతో బాధపడ్డాడు.


కామెంట్‌లు