మిగిలిపోయె మదిలో మాయనిబాధ!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మల్లెపువ్వులా
పరిమళమును
వెదజల్లలేను

కోకిలలా
గళమెత్తిగానము
చేయలేను

మామిడిచెట్టులా
మధురఫలాలను
అందించలేను

నెమలిలా
పురివిప్పినాట్యమాడి
చూపరులను రంజింపజేయలేను

చంద్రునిలా
చల్లనివెన్నెలను
ప్రసరించలేను

సూర్యునిలా
వెలుగులుచిమ్మి
చీకటినిపారద్రోలలేను

మేఘంలా
వానజల్లులను
కురిపించలేను

కనులుండీకూడా 
అక్రమాలను అఘాయిత్యాలను
అరికట్టలేను

నోరుండీకూడా
నిజాలను నిర్భయంగా 
చెప్పలేను

గొప్పకవిలా
కవితలనువ్రాసి
కుతూహలపరచలేను

మనిషిలా
మానవత్వాన్ని
చాటలేకున్నాను

చెట్లు పువ్వులు పక్షులుకన్నా
చంద్రుడు సూర్యుడు మేఘాలుకన్నా
జంతువులు కవులు తోటిమనుషులుకన్నా
అధముడననేబాధ మనసులో మిగిలెనుకదా


కామెంట్‌లు