*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 013*
 *చంపకమాల:*
*తరణికులేశ నానుడులఁ | దప్పులు గల్గిన నీదు నామ స*
*ద్విరచితమైన కావ్యము ప | విత్రముగాదె? వియన్నదీ జలం*
*బరగుచు వంకయైన మలి | నాకృతిఁబారినఁదన్మహత్వమున్*
*దరమె గణింప నెవ్వరికి | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
రఘువంశ తిలకా, కరుణా సముద్రము వంటి వాడవు,దశరధరామా! సూర్యవంశమునందు పుట్టిన రాజులలో నువ్వ ఎంతో గొప్పవాడివి. ఆకాశము నుండి నేలకు దిగిన గంగ, నదులలో, చెరువులలో చేరి వేరు వేరు రూపాలతో పారినా, కలుషితమైన నీటితో కలసినా గంగా దేవి ప్రభావము తగ్గదు. ఆ ప్రాభవాన్ని, ప్రభావాన్ని పొగడటం ఎవరి వల్లా కాదు. అలాగే, నా మాటలలో తప్పులు దొర్లినా, నీ పేరు మీద, నీ గురించి రాసిన కావ్యము పవిత్రమైనదే అవుతుంది కదా! ........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"నామ" ప్రాభవం చాటి చెప్పడం ఎవరి వల్ల అవుతుంది. "శివ", "రామ", " విష్ణు " ఏ పేరు పెట్టి పిలిచినా పలికేది పరాత్పరుడే కదా! నామ బేధాలు, రూప బేధాలు మనకే కానీ, పరమేశ్వరుని కి లేవు కదా! "వేయీనామాల వాడ వేంకటేశుడా!" అన్నా, "సద్యోజాతం ప్రపద్యామి" అన్నా, "హిర్ణ్మయీ లక్ష్మీ" అన్నా, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడే కదా పలికేది. ఈ అభేదాన్ని తెలుసుకుని, అర్థం చేసుకుని, "కలౌ నామస్మరణే ధన్యోపాయం" అనే పెద్దల మాటను సద్ది మూటగా భుజాని కెత్తుకుని, నిత్యం ఆ స్వామి సన్నధికి దగ్గరలో వుండేలా అనుగ్రహించాలని ఆ పరంధామునే వేడుకుందాము......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు