*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(౧౧౬ - 116)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*బ్రహ్మ మనస్సు నుండి ఒక స్త్రీ - ఒక పురుషుడు ప్రకటమగుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా!  సతీదేవి, శివ భగవానుని కీర్తి ఎంతో మధురమైనది. పావనమైనది. ఎవరికీ తెలియనటువంటిది. భగవంతుడు అగు పరమశివుడు, నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార, శక్తిరహిత, చిన్మయ, సత్, అసత్ లకంటే విలక్షణమైన రూపముతో వున్నవాడు. అతనే సగుణుడై, సర్వ శక్తిమంతుడై ఈ మూడు లోకములను ధరించి ఉన్నాడు. ఆతని వెంట భగవతి అయిన ఉమాదేవి కూడా వుంది. వారు ఇరువురు పరాత్పర స్వరూపముతో నిలిచి ఉన్నారు.*
*ఆ పరమశివుని నుండి పుట్టిన బ్రహ్మ నైన నేను సృష్టి కార్యమును, విష్ణువు ఆ సృష్టిని పెంచి పోషించు పనిని, రుద్రుడు సంహారకార్యమును చేస్తున్నాము. శివుడే, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే మూడు రూపాలలో వ్యక్తమై వున్నాడు. బ్రహ్మ నైన నేను శివుని ఆజ్ఞతో, సకల చరాచర సృష్టి చేసాను. నా నుండి మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగీరుడు, క్రతువుడు, వశిష్టుడు, నారదుడు, దక్షుడు, భృగువు మానస పుత్రులుగా పుట్టారు.*
*నా హృదయము నుండి ఒక స్త్రీ, ఎంతో రూపవతి ప్రకటమైంది. ఈమె సర్వాంగ సుందరి. ఈమె పేరు "సంధ్య". పగటి పూట క్షీణిస్తూ, సాయం కాలం వృద్ధి చెందుతుంది. చక్కని రూపవతి అయిన ఆమె, అందమైన కనుబొమలతో, ఎప్పుడూ ఏదో తెలియని మంత్రమును జపిస్తూ వుంటుంది. తరువాత అందమైన అంగములతో, సన్నని నడుము భాగముతో, కమలముల వంటి కన్నులతో, మదించిన ఏనుగు లాగా మంచి గంధపు వాసన వెదజల్లుతూ వున్న ఒక పురుషుడు నా మనసు నుండి పుట్టాడు. ఈ పురుషుడు పూలతో చేయబడిన అయిదు బాణములు పట్టి వున్నాడు. ఈతని సమ్మోహన శక్తికి దేవతలు, మునులు, రుషులు మానవులు అందరూ లొంగి పోవలసిన వారే. వీరందరి మనసులలో ప్రవేశించి, వారి సుఖములకు కారణమై సృష్టి యొక్క సనాతన కార్యము జరిపిస్తూ వుంటాడు. ఈ తడే సృష్టి కి కారణభూతుడు అవుతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు