కవితా పారాయణం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 వారు కవులు కారు 
శాంతి కపోతాలు...
రగులుతున్న జ్వాలావేశాలపై
కళ్లాపి చల్లుతూ కురుక్షేత్ర సంగ్రామానికి 
అడుగడుగునా అడ్డుపడుతున్నారు...
రక్తపు నేలపై తెల్లని 
దివాచీని పరచి స్నేహ పరిమళాల 
అక్షరాలను గుప్పుమనిపిస్తున్నారు...
స్వేచ్ఛా భారతాన్ని 
కాంక్షిస్తూ, సమసమాజ నిర్మాణానికై ఉద్యమిస్తున్నారు...
లక్ష్యం ఒకటిగా,
మార్గాలు వేరుగా,
మాటల బాణాలను సంధిస్తూ,
మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు...
దారి తప్పిన వ్యవస్థలలోని లోపాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు...
పరిష్కార మార్గాలను 
అన్వేషిస్తూ
సామాజిక కథనాల పై
స్పందనలనందిస్తున్నారు...
పెడదారి పడుతున్న భావితరాలకు
బాధ్యతలను గుర్తుచేస్తున్నారు...
పర్యావరణ పరిరక్షణలో భాగంగా 
కాలుష్యపు పొరలను 
తొలగించే పనిలో పడ్డారు....
వేల మైళ్ల ఆలోచనలను 
చేసి కొన్ని కోట్ల
క్షణాలను వెచ్చిస్తున్నారు....
మణిపూసల వంటి మాటలతో మలిన పడిన 
మనసులను శుద్ధి చేస్తూ, అంతా కాకపోయినా 
ఎంతో కొంత లాభపడుతున్నారు...
కలాన్ని పట్టి
కవితా పారాయణ చేస్తూ
ప్రపంచశాంతికై శ్రమిస్తున్నారు...


కామెంట్‌లు