శక్తిగా మారిన వ్యక్తి;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆయన...
తన పుట్టిన రోజుని సెలవుగా ప్రకటించమని చెప్పలేదు...
విచ్చల విడిగా వీధివీధికి
విగ్రహాలను స్థాపించమని చెప్పలేదు...
తన రాతిరాళ్ళకు రంగురంగులా పూలహారాలు అలంకరించమని చెప్పలేదు...
ప్రతి ప్రభుత్వ కార్యలయాలలో తన చిత్ర పటాలు ఉంచమని చెప్పలేదు...
తళుకుల నోట్ల పైన తన మొగమును ముద్రించమని చెప్పలేదు...
కంఠస్వరాలు పగిలేలా, దిక్కులు పెక్కటిల్లెలా, జైహింద్ లు, 
జిందాబాద్ లు, జోహార్లు కొట్టమని చెప్పలేదు...
ఆయన ఎప్పుడూ చెప్పలేదు...
కానీ ఇవ్వన్నీ చేసేస్తున్నాం, పైగా గౌరవం అంటూ పెద్ద పెద్ద కితాబులను ఇచ్చేస్తున్నాం...
నిజానికి,
గాంధీజీ నమ్మిన సిద్దాంతాలతో నడిచిన వ్యక్తి...
యావత్ జగతిని ముందుకు నడిపిన శక్తి...
ఆయన చెప్పలేదు...
జాతిని నీతిని మరువమని
మనలో మనని, శత్రుత్వాన్ని పెంచుకోమని
మనిషిని మనిషి చంపుకోమని
మొత్తంగా మానవత్వానే మరచిపొమ్మని
అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలను మౌనంగా భరించమని...
యువతను బాధ్యత మరిచి బరితెగించమని
మగ అహంకారంతో మానభంగాలు చేయమని... 
మగువలను చిత్రహింసలు పెట్టమని...
సత్యాన్ని, అహింసను ఆయుధాలుగా మలచుకొని 
అసాధ్యమైన పోరాటాలకు పూనుకున్నాడు...
స్వేచ్చా భారతాన్ని కాంక్షించాడు
దేశాభివృద్ధికై  కలలు కన్నాడు
కానీ మనం మాత్రం కన్నీటితో తడిచిన,
రక్తానితో మరిగిన, మహానుభావుల వ్యధలకు,దేశభక్తుల 
త్యాగాల కథలకు ఫలితంగా అందిన స్వతంత్ర భారతదేశంలో
విలువలను మరచిపోతూ, వ్యసనాలకు బందీ అయిపోతూ 
మన స్వతంత్ర దేశంలో మనమే స్వతంత్రాన్ని కోల్పోయి ఇంకా 
బానిసలుగానే బ్రతుకుతున్నాము...
బ్రతికేస్తున్నాము...


కామెంట్‌లు