శ్రీ తులసి ; -సమ్మోహనం (878-888)-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
శ్రీ తులసి ప్రియతులసి 
ప్రియమైన శుభతులసి 
శుభమిచ్చు సౌభాగ్య కోటలో ఓ వనజ !

ఉభయ సంధ్యలందు 
సంధ్యజోత పొందు 
పొందు గూటిన ప్రమిద వెలగాలి ఓ వనజ !

పసుపు కుంకుమ పూసి 
పూసి పూలను కోసి 
కోసి తులసికి బెట్ట కనువిందు ఓ వనజ !

చిన్ని చెంబున నీరు 
నీరు పోసిన తీరు 
తీరునే ప్రియతులసి కరుణించు ఓ వనజ !

కోటలో తులసమ్మ 
తులసి కళకళలమ్మ 
కళగాను ఇంటికే క్రిమినాశి ఓ వనజ !

నాల్గు ఆకులు లోన
లోన ఔషధమౌన
ఔషధపు గుణములే తులసిలో ఓ వనజ !

శీతలము తొలగించు 
తొలగించి అలరించు 
అలరించి చురుకుదన మిచ్చులే   ఓ వనజ !

తులసి టీ అద్భుతము 
అద్భుత ఉప శమనము 
శమనాన్ని కలిగించు జలుబులో ఓ వనజ !

దంత వ్యాధులు తొలగు 
తొలగులే నులి పురుగు
పురుగుపుట్రలు రాని ఆ గాలి ఓ వనజ !

నిత్య దీపము పెట్టు 
పెట్టగా కనిపెట్టు 
కనిపెట్టి ఆ తల్లి దీవించు ఓ వనజ !

కామెంట్‌లు