|| బతుకు పంచాంగం ||; -మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
కుడిఎడమలు ఎంతెంతగా ధగాచేసినా
రాశులన్నిగూడి లాభనష్టాలను కుప్పలుగా పోసినా
అవమానాలు పెనుభారమై అవహేళన చేసినా
రాజపూజ్యాలు రాజ్యాలేలజూసినా
బడుగు జీవికెప్పుడూ బ్రతుకు కత్తిమీద సామే

బ్రతుకు పంజరంలో చిక్కిన చిలకజోస్యం జీవితం తనది
నమ్మకానికి నగిషీలు చెక్కుతూ
కన్నుగీటుతున్న కాలం కనుసన్నలలో 
నేడును ఒరుసుకుంటూ
రేపన్నది తెలియదంటూ
బ్రతుకుతున్న మిణుగురు పురుగుల వెలుతురు తనది

అద్దుకున్న రంగు 
అంటీ అంటనట్లుగా ఒంటికి మెరుస్తూ మురుస్తూంటే
గాలివాటుకు రాలిపడే జీవితాలు
ముంచుకు వచ్చే రోజునే చూస్తుంటాయి
స్థితిగతులు మారని జీవితాలను
తిథివార నక్షత్రాలు ఆశ్చర్యంగా గమనిస్తుంటాయి

తీపి చేదు కలయికే జీవితమని
ప్రతియేడూ పచ్చడై ప్రణమిల్లుతూ చెబుతుంది
తలరాతను తారుమారుచేసే పంచాంగం ఇంతవరకూ తటస్థపడలేదు

బ్రతుకు పుస్తకంలో 
అన్నీ అర్థంకాని ప్రశ్నలే 
సంతృప్తిపరచాలనే పంచాంగాలు
సమాధానం చెబుతాయని ఆశపడుతుంటాం
బతుకు పంచాంగంలో
తెలియని మలుపులెన్నో
నేడు మనిషిని వింతగా చూస్తున్నాయి.. 

_____


కామెంట్‌లు