|| ముక్కు పుడక ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
తొంగి చూసిన తొలకరి చినుకొకటి
నింగినుంచి జాలువారి
నల్లని కురులను మెల్ల మెల్లగా హత్తుకొనుచు
సింధూరపు సిగ అంచును తాకుతూ
ముదిత నాసిక కొసలను ముద్దాడి
అటు తిరిగి ఇటు తిరిగి
మురిసిపోయిన మెఱుపు తీగలా
ముక్కు పుడకను చేరిన చినుకుదెంత భాగ్యమో 

చిరు జల్లుల సవ్వడికి చిందులేసింది పుడక
మెఱిసిపోతున్న తన అందాన్ని చూసుకుని మైమరిచిపోతూ

గాలికి ఈలపాట తోడైనట్లు
నేలను పచ్చదనం పరుచుకున్నట్లు 
ఆకాశానికి వర్ణాలు స్వర్ణాలై అమరినట్లు
పడతి మోముకు పచ్చల హారమై 
పసిడి చాయలో చినుకు మునక
ప్రణయగీతాలు ఆలపిస్తుంది పుడక

చెమరించని అందంతో చెవిపోగులు చేసుకున్నవి
చెప్పలేని బాసలెన్నో
గ్రహచారమదేమొ గాని
కురులు కప్పిన అందాలతో మరులు చిలుకుటెట్లు
మసకబారిన వెలుతురులో మబ్బులు కమ్మినట్లు

గలగలల కాలి అందియలు ఘల్లు ఘల్లుమంటాయని
గగన వీధులన్ని తిరిగి చెప్పుకొచ్చింది కాని
కట్టుకున్న చీర మాటున కనపడని అందమై
మలుపు తలుపులలో చిక్కి 
ముఖము నలుపు చేసుకుందదేమిటో... 

ముక్కు పుడకకెంత పొగరో కదా... 
ఇంతి సొగసులన్ని నా ఒంటి మెఱుపులంది
కాంతి రేఖనై అందాన్ని చిత్రించు కుంచె నేనంది
నవ్వు నేనంది.. నీ లవ్వు నేనంది.. 

______


కామెంట్‌లు