అన్నమయ్య - పాదార్చన; -" కావ్యసుధ "" సాహిత్య శిరోమణి " హయాత్ నగర్9247313488
 సంసారం ఒక వృక్షమైతే, అందులో సత్ సాహిత్యం, సత్ సాంగత్యం అనేవి రెండు అమృత ఫలాలంటారు జ్ఞానులు, అనుభవజ్ఞులు. పదకవుల సంకీర్తనా వృక్షం నిండుగా అమృతఫలాలే ఉన్నాయి. ఆ సుమధుర ఫలాలను ఆరగించడానికి అలవాటు పడిన మనసుకు మరెందులోనూ తృప్తి, ఉపశమనం లభించదు. అంతటి శక్తిమంతమైనవి సంకీర్తనలు. వాటి నిశ్చలమైన మనస్సుతో వింటే, యుగయుగాలనాటి ఆ శ్రీహరి లీలల్ని ప్రత్యక్షంగా చూస్తున్న దివ్యానుభూతి కలుగుతుంది. చుట్టూ అలముకొన్న భయంకరమైన సమస్యల చీకట్లన్నీ పటాపంచలై జ్ఞానజ్యోతితో గమ్యాన్ని దర్శిస్తున్న స్ఫూర్తి కలుగుతుంటుంది.పదకవితా పితామహుడైన అన్నమయ్య అందించిన గానామృత ఝరి కలియుగ ప్రత్యక్షదైవాన్నే కదిలించింది. కరిగించింది. మృదుమధురమైన పదజాలంతో మాటల్నే పాటలుగా మలచి, తనదైన వాణిలో, బాణిలో ఏడుకొండలవాడిని మెప్పించిన గడసరి అన్నమయ్య ఒక చోట పరబ్రహ్మ, ఒకనోట కోనేటిరాయడు, -మరోచోట చిన్నికృష్ణుడు ఇలా వేవేల రూపాలలో ఆ స్వామిని దర్శించి దర్శింపజేసి తరింపచేసిన పదకవితా సమ్రాట్ అన్నమయ్య.

కామెంట్‌లు