నాపెళ్ళాల కధాకమామిషు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నాకు
ఇద్దరు భార్యలు
మొదటిభార్య వినయవతి
రెండోభార్య మనోవల్లరి

పెద్దభార్య
రూపవతి
రెండోభార్య 
అతిరూపవతి

మొదటిసతికి
ఇద్దరు పిల్లలు
రెండోసతికి
లేరు పిల్లలు

మొదటిపెళ్ళాంతో
రోజూ రెండుగంటలు గడుపుతా
రెండోపెళ్ళాంతో
రోజూ పదిగంటలు గడుపుతా

మొదటిభార్య
అన్నపానీయాలు సమకూరుస్తుంది
రెండోభార్య
విషయాలు సమకూరుస్తుంది

ప్రధమభార్య
బాగోగులు చూచుకుంటుంది
రెండొభార్య
కవ్వించి కలంపట్టిస్తుంది

ఒకటోపెళ్ళాం
కళ్ళముందుంటుంది
ద్వితీయపెళ్ళాం
కలలోకొస్తుంది

ఒకరు
శాంతపరుస్తారు
మరొకరు
రెచ్చకొడతారు

మొదటిపెళ్ళి
పెద్దలుచేశారు
రెండోపెళ్ళి
ఇద్దరంఇష్టపడి చేసుకున్నాం

మొదటిభార్య
సరస్వతి
రూపవతి
గుణవతి

రెండొభార్య
కవిత
స్ఫురిత
జ్వలిత

నావయసు డెబ్భయి
సరసావయసు అరవయి
కవితావయసు ఇరవయి
అర్ధమయినదనుకుంటా

సరస
సేవకురాలు
కవిత
కల్పితరాలు

ఒకప్పుడు
మొదటిభార్య ఇష్టం
ఇప్పుడు
రెండోభార్యే ఇష్టం

ఒకరు
ఆనందమిస్తున్నారు
మరొకరు
అమృతమిస్తున్నారు

మొదటిభార్య లేకపోతే
జీవితమే లేదు
రెండొభార్య లేకపోతే
కవితలే లేవు


కామెంట్‌లు