ఏకనాధుని దివ్యోపదేశం; -(ఆధ్యాత్మిక కధ):- సి.హెచ్.ప్రతాప్
 మహారాష్ట్రలో 16 వ శతాబ్దం లో (1533-1599) అవతరించి లక్షలాది మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ధర్మ సంస్థాపన గావించిన ఏకనాధుని జీవితం లో జరిగిన ఒక అపురూప సంఘటనను ఇప్పుడు స్మరించుకుందాం. తద్వారా ఆ మహనీయుని దివ్య ఆశీస్సులు, అనుగ్రహానికి పాత్రులౌదాం.
అరిషడ్వర్గములు అతి చిన్న వయస్సులోనే లోబర్చుకున్న ఏకనాధుడు సహనానికి ప్రతీక. ఆధ్యాత్మిక బోధనలు చేసే సంధర్భం లో నాస్తికులు, ఇతర మతస్థులు అతనిని చుట్టు ముట్టి ఎంతగా విసిగించినా, దుర్భాషలాడినా ఏ మాత్రం సహనం కోల్పోయేవాడు కాదు. చెక్కు చెదరని చిరునవ్వే అన్నింటికీ సమాధానం గా వుండేది.
ఒక సందర్భం లో నాస్తికులందరూ ఒక చోట సమావేశమై ఏకనాధునికి తపోభంగం కలిగించి అతనిలో అశాంతినీ, అలజడులను లేపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఒక కిరాతకునికి కొంత ధనం అప్పజెప్పి ఏకనాధుని మీదకు అతనిని వదిలారు.
ఏకనాధుడు ప్రతీ ఉదయం గోదావరి నదికి వెళ్లి స్నానం చేసి, గాయత్రి మంత జపం, సంధ్యా వందనము లను ఆచరించి తిరిగి తన ఇంటికి వచ్చేవాడు. అప్పటి వరకు పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. పాండురంగ విఠలుని అక్కలంక భక్తుడైన ఏకనాధునికి ఆ స్వామి దర్శనం తరచుగా లభించేదని అందరూ చెప్పుకునేవారు.
ఒక ఉదయం యధావిధిగా ఏకనాధుడు స్నానం చేసి అనుష్టానం చేసుకుంటూ వుండగా ఆ కిరాతకుడు వచ్చి ఏకనాధుని ముఖంపై ఉమ్మి వేసాడు. సత్యం, ధర్మం, శాంతి, క్షమ లకు ప్రతిరూపమైన ఏకనాధుడు  మారు మాట్లాడక తిరిగి స్నానం చేసి అనుష్టానం ప్రారంభించాడు. ఆ కిరాతకుడు వెంటనే వచ్చి మళ్ళీ ఏకనాధునిపై ఉమ్మి వేయగా ఏకనాధుడు  తిరిగి స్నానం చేసాడు.
ఈ తంతు ఒకటి..రెండు..మూడు.. చివరకు నూట ఎనిమిది సార్లు జరిగింది. ఏకనాధునిపై కసిగా ఉమ్మి వెస్తున్న ఆ కిరాతకుడు అలిసి,సొలసి పోయాడు కాని ఏకనాధుడు మాత్రం అదే వినయ విధేయతలతో, శ్రద్ధతో, నిష్టగా గోదావరీ నదిలో స్నానం చేస్తునే వున్నాడు. ఆ మహనీయుని శ్రద్ధ, విశ్వాసం, సహనం, ఓర్పులకు ముదమొందిన ఆ కిరాతకుడు తక్షణం ఏకనాధుని పాదాలపై పడి భోరు భోరున విలపించాడు.
"స్వామీ ! దయ చెసి నా యీ అపరాధాన్ని మన్నించు. అజ్ఞానం, అవివేకం,మూర్ఖత్వం ల వలన ఆ నాస్తికులు ఇచ్చిన ధనానికి ఆశపడి ఇంతటి నీచమైన పనికి ఒడిగట్టాను. నిత్యం ధూమపానం,మద్య, మాంసాదుల తో అపవిత్రం అయిన నా యీ నోటితో మీపై ఏకంగా నూట ఎనిమిది సార్లు ఉమ్మి ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను.నాకు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. దయచేసి నన్ను క్షమించి, ఆశీర్వదించండి. నాకు హిత బోధ చేసి నన్ను సన్మార్గం లో నడిపించండి." అని ఆ కిరాతకుడు అతి దీనంగా ప్రార్ధించాడు.
"నాయనా ! నేను క్షమించల్సినంత తప్పు పని నువ్వేం చేసావు? నిజానికి నేనే నీకు ఎంతో రుణపడి వున్నాను.మాతృ సమానురాలైన గోదావరి నదిలో ఒక్కసారి స్నానమాచరించి నంతనే వేల జన్మల పాపాలు పటా పంచలు అయిపోతాయి. అటువంటిది నేను నీ దయ వలన ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా నూట ఎనిమిది సార్లు స్నానం చేసి అమితమైన పుణ్యం మూట కట్టుకున్నాను. ఈ రోజుతో నా జన్మ ధయమయ్యింది.అయితే నా సాధనకు , తపస్సుకు భంగం కలిగించినందున నీకి మేలు జరిగితే మొదటిసారే నేను నా అనుష్టానన్ని విరమించుకునే వాడిని.నీకు నూట ఏడు సార్లు నాపై ఉమ్మి వేసే కష్టం కలిగించే వాడినే కాదు.సత్యం,ధర్మం, దయ,జాలి,ఓర్పు, సహనం,దానం,మృదు భాషణం వంటి సద్గుణాలను అలవర్చుకొని సన్మార్గం లో జీవిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి తప్పక పాత్రుడవౌతావు. ధనం కోసం నమ్మిన సిద్ధాంతాలను,నైతిక విలువలను ఏనాడు విసర్జించ వద్దు"అని మృదు మధురంగా పలికారు మహా తపస్వి, బ్రహ్మ జ్ఞాని  అయిన సంత్ ఏకనాధులు.
ఆయన అమృత తుల్యమైన పలుకులు ఆ కిరాతకుని హృదయంలో అజ్ఞానంధకారములను పటాపంచలు చేసి జ్ఞాన జ్యోతులను వెలిగించాయి. ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
ఏకనాధ మహర్షి చేసిన ఈ అద్భుతమైన, అసామాన్యమైన ఉపదేశం మనందరికీ శిరోధార్యం, సదా అనుసరణీయం !
సర్వే జనా సుఖినోభవంతు


కామెంట్‌లు