మానవ సంబంధాలు;- : సి.హెచ్. ప్రతాప్
 రామాపురానికి భద్రం అనే ఒక యువకుడు తల్లితో కలిసి పొట్ట చేతపట్టుకొని బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. అతనికి పదిహేను ఏళ్ళు వుంటాయి. పొరుగూరిలో తండ్రి అకస్మాతుగా మరణించడంతో అప్పులవాళ్ళు మీద పడి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక కట్టుబట్టలతో ఇద్దరూ రామాపురం వచ్చారు.
వచ్చిన కొంతకాలానికి ఆ ఊరి పెద్ద సలహాతో భద్రం కొంత మొత్తం అప్పు తీసుకొని చిన్న ఫలహారశాల ప్రారంభించాడు. తక్కువ లాభాలకు కల్తీ లేకుండా నాణ్యమైన ఫలహారాలను అందించసాగారు. వంట అంతా తల్లి చూసుకుంటుండగా, హొతల్ నిర్వహన భద్రం చూసుకోసాగాడు.
కొంతకాలానికి సీతయ్య అనే మధ్యవయస్కుడు ఆ ఊరికి బతుకుతెరువు కోసం వచ్చాడు. భద్రాన్ని కలిసి హోటల్ నిర్వహణలో సహాయం చేస్తానని, రెండుపూటలా భోజనం, వుండడనికి కాస్త వసతి ఇస్తే చాలునని కోరాడు. అతడిలో నిజాయితీ,మగ దిక్కు ఆవశ్యకతను గుర్తించిన భద్రం తల్లి సంతొషం గ ఒప్పుకుంది.
సీతయ్యకు కష్టించి పని చేసే స్వభావం  తో పాటు అపారమైన తెలివితేటలు, లోక జ్ఞానం వున్నాయి.  హోటల్ నిర్వహణలో తల్లి కొడుకులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండసాగాడు.
అతడి సలహలను తు చ తప్పక పాటించడం వలన ఆ హోటల్ దినదినాభివృద్ధి చెందసాగింది. అచిరకాలంలోనే పెద్ద హోటల్ గా అభివృద్ధి చెందడంతో పాటు పొరుగు ఉళ్ళలొ కూడా బ్రాంచిలు తెరవబడ్డాయి. ఇప్పుడు భద్రానికి వద్దంటే డబ్బు. పొద్దున నుండి  రాత్రి వరకు హోటళ్లు ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై దృష్టి అంతా ఉండేది.  
కొంతకాలానికి భద్రానికి లక్ష్మితో  అనే అందమైన అమ్మాయితో పెళ్ళి అయ్యింది. అత్తారింటికి అడుగుపెట్టిన లక్ష్మి సర్వసౌఖ్యాలు  అనుభవించసాగింది.
అయితే  తమ వ్యాపారంలో సీతయ్య చీటికీ మాటికీ కల్పించుకోవడం నచ్చేది కాదు. కొంతకాలం తర్వాత , భర్త మెతకదనాన్ని అలుసుగా చేసుకొని వ్యాపారంలో , లాభాల్లో కాని వాటా అడుగుతాడేమోనని భయపడింది. ఎలాగైనా అతడిని తరిమేయాలని నిర్ణయించుకుంది.
అతడిపై చిలవలు, పలవలు కల్పించి భర్తకు చెప్పడం మొదలెట్టింది. మొదట్లో భార్య మాటలు నమ్మకపోయినా, తర్వాతర్వాత ఆ మాటలు అమృతతుల్యం గా అనిపించి భద్రం పై పని చెయ్యడం మొదలెట్టాయి.
ఒక రోజు భార్య ప్రోద్బలంతో కొంత డబ్బు ఒక సంచిలో పెట్టి తీసుకెళ్ళి సీతయ్యకు ఇచ్చాడు భద్రం." ఈ రోజు నుండి మీ సేవలు నాకు అక్కర్లేదు. ఇంత కాలం నాతో వుండి నాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఈ డబ్బు ఇస్తున్నాను. ఇది తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా ఉండండి" అని నిక్కచ్చిగా చెప్పాడు.
ఆ మాటలకు సీతయ్య నవ్వి " నా సేవలకు విలువ కట్టినందుకు ధన్యవాదాలు. కాని ఈ డబ్బు నేను తీసుకోలేను. నన్ను క్షమించండి" డబ్బు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు.
చిత్రంగా అనాటి నుండి భద్రం వ్యాపారంలో తిరోగమనం మొదలయ్యింది. లాభాలు క్షీణించి సాగాయి. మరి ఆరు నెలలకు పొరుగూరిలో వున్న హోటళ్ళు నష్టాల కారణంగా మూసేయాల్సి వచ్చింది.
స్వంత ఊరిలో ఉన్న హోటల్ పరిస్థితి రేపో మాపో అన్నట్టు అయ్యింది.
ఏం చెయ్యాలో అర్ధం కాక తల్లిని సలహా అడిగాడు భద్రం.
"నాయనా. మన వ్యాపారానికి మూల స్తంభం అయిన సీతయ్య గారిని అకారణంగా పంపించేయడం వలనే ఈ పరిస్థితి మనకు వచ్చింది. ఆయన ఏదో ఆశించి నీతో కలిసి పని చెయ్యలేదు.కష్ట సమయంలో ఆదుకున్నావన్న కృతజ్ఞతతో తన మేధస్సు అంతా ఉపయోగించి వ్యాపార మెళకువలను నీకు చెప్పి వ్యాపార అభివృద్ధికి దోహదపడ్డాడు. మన వ్యాపారం మూఊ పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందడానికి కారణం నీ స్వంత ప్రతిభ అనుకొని భ్రమలో పడ్డావు.  నీ భార్య మాటలు విని అకారణంగా అతడిని పంపించేసావు. అతను నీపై వాత్సల్యం, ప్రేమను పెంచుకున్నాడు. నీ నుండి ఏనాడూ ఒక పైసా ఆశించలేదు. కాని నువ్వు అతడిని వాడుకునన్నాళ్ళు వాడుకొని తర్వాత వదిలేసావు. మనుష్యుల్ని ప్రేమించాలి కాని వాడుకొని వదిలేయకూడదు. మానవ సంబంధాలు చాలా  సున్నితమైనవి. మొక్కలకు నీళ్ళు పోసి,కలుపు తీసి పెంచినట్లు పెంచాలి.వాటిని ఆర్థిక సంబంధాలుగా మార్చేయడం చాలా తప్పు.' అని చెప్పి నిట్టూర్చింది ఆవిడ.
ఆ మాటలతో భద్రానికి తన తప్పు తెలిసివచ్చింది. పనికిమాలిన సలహా ఇచ్చినందుకు భార్య చెంప చెళ్ళుమనిపించి సీతయ్యను వెదకడానికి స్వయంగా బయలుదేరాడు.

కామెంట్‌లు