భక్తే ప్రధానం;-- సి.హెచ్.ప్రతాప్
 1915 సంవత్సరంలో గోవింద మాన్ కర్ అనువాడు శిరిడీలో తన తండ్రికి సంవత్సరీకం చేయదలచి ఆత్మారాం తార్ఖడ్ అనే సాటి భక్తుని ఇంటికి వచ్చి శిరిడీ వెళ్తున్న సంగతి తెలియజేసాడు. శ్రీమతి తార్ఖడ్ ఇల్లంతా గాలించగా ఒక కోవా బిళ్ళ (అది కూడా ఇంతకు ముందు శ్రీ సాయికి నైవేద్యం గా అర్పింప బడినది)  దొరికింది.చేసేది లేక ఆ బిళ్ళనే మాన్ కర్ కు ఇచ్చి సాయికి నివేదించమని శ్రీమతి తార్ఖడ్ కోరింది.
 శిరిడీ చేరాక విధి కర్మలను పూర్తి చేసాక మాన్ కర్ సాయిని దర్శించాడు. వెంటనే సాయి “నా కోసం ఏమి తెచ్చావు?” అని అడిగారు. తండ్రి మరణించినందున పుట్టెడు దు:ఖం లో వున్న మాన్ కర్ తాను ఏమీ తేలేకపోయానని విన్నవించుకున్నాడు. అప్పటికి సాయి ఊరుకున్నారు కానీ మళ్ళీ మళ్ళీ అడుగనారంభించారు. ప్రతీసారి మాన్ కర్ నుండి ఒకటే సమాధానం ఎదురయ్యింది. 
ఛివరకు శ్రీ సాయి “ఆత్మారాం భార్య నా కోసం ఎంతో ప్రేమతో పంపిన కోవా బిళ్ళ నీ దగ్గర వుంది కదా ! వెంటనే వెళ్ళి దానిని తీసుకురా !” అని ఆజ్ఞాపించారు. మాన్ కర్ అసలు సంగతి గుర్తుకు తెచ్చుకొని బసకు వెళ్ళి ఆ కోవా బిళ్ళను తీసుకు వచ్చి శ్రీ సాయికి సమర్పించగా శ్రీ సాయి ఎంతో ఆత్రంగా దానిని తిని “ నా భక్తులు నన్ను ఎట్లు భావించెదరో, నేను వారిని అదే విధం గా అనుగ్రహిస్తాను. మీరు చేసే ఆడంబరమైన అర్చనలతో నాకు పని లేదు.నాకు కావలసింది ప్రేమమయమైన భక్తి మాత్రమే. మీరి నన్ను ఏయే విధాలుగా భావించి ప్రార్ధిస్తారో, నేను ఆయా విధాలుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను. నాకు భక్తే ప్రధానం. ఎలాంటి సంశయాలు లేకుండా, భగవంతుడే అన్నీ చేస్తాడన్న ధృఢ విశ్వాసంతో నన్ను ప్రార్ధించేవారిని పూర్ణంగా అనుగ్రహించి వారిని చివరికంటా కాపాడి గమ్యం చేరుస్తాను.” అని పలికారు. ఆత్మారాం భార్య బాబాకు కోవా బిళ్ళ సమర్పించాలనుకొని, ఆ తర్వాత మరిచిపోతే శ్రీ సాయి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నైవేద్యాన్ని రప్పించుకొని స్వీకరించిన వైనం పరమాద్భుతం” 
ఈ కధ మనకు నిత్య జీవితం లో మార్గదర్శకాలు కావాలి ! భగవంతునికి కావలసింది వైభోవపేతం గా చేసే పూజలు,ఖరీదైన ప్రసాదాలు, పూజా మండపాల డెకరేషన్లు కాదు.పవిత్రమైన హృదయం, అకుంఠిత భక్తి, సేవా తత్పరత. వీటితో మంచి నీటిని సమర్పించినా ఎంతో సంతోషంగా స్వీకరించి ఆశీర్వదిస్తారు. ప్రేమ, భక్తి లేని పూజలు ఫలించవు. డబ్బు,సమయం వృధా తప్ప ఫలితం శూన్యం. అందుకే చిన్నప్పటి నుండి మనం నమ్మిన దైవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం.ఆనన్య భక్తితో భగవంతుని ఆరాధించి, ఆయన కృపకు పాత్రులయ్యెందుకు మనం చెయ్యాలి.సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు