పోటీ; - : సి.హెచ్.ప్రతాప్
 రామాపురం శివార్లలో చిదానందుడు అనే మహర్షి ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు.ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేదశాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దబడి దేశంలో వివిధ ప్రాంతాలలో మంచి కొలువులలో స్థిరపడ్డారు.
ఒకసారి రామశర్మ అనే యువకుడు చిదానందుడు వారి దగ్గర విద్యాభ్యాసం కోసం వచ్చాడు. తొలినాటి నుండి రామశర్మకు చదువుపై దృష్టి లగ్నమయ్యేది కాదు. గురువు విద్య బోధిస్తుంటే దానిపై దృష్టి పెట్టకుండా సాటి విద్యార్ధులనో, ఆశ్రమ ప్రాంగణంలో తిరగాడే పశువులను, ఎగిరే పక్షులను చూస్తూ కాలం గడిపేవాడు. ఫలితంగా మూడేళ్ళు గడిచినా రామశర్మకు చదువు ఏమాత్రం వంటబట్టలేదు. సాటి విద్యార్ధులు మాత్రం ఈ మూడేళ్ళ కాలంలో చక్కన ప్రగతి సాధించి గురువు గారి మన్ననలు అందుకున్నారు.
ఒకరోజు విరక్తితో రామశర్మ గురువుగాఉ ఏకాంతంలో వున్నప్పుడు వెళ్ళి తన మనసులోని బాధనంతా చెప్పుకున్నాడు. ఎంత కష్టపడినా చదువుపై దృష్టి లగ్నం కావడం  లేదని, ఈ సమస్య నుండి బయట పడేందుకు ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. తానేమో చదువులో వెనుకబడిపోతున్నాడు, మిగితావారు ముందుకు దూసుకువెళ్తున్నారు అన్న ఆలోచన కారణంగా సాటి విద్యార్ధులపై ఈర్ష, అసూయలు పెంచుకున్నాడు. రాత్రింబవళ్ళు ప్రతికూల ఆలోచనల కారణం గా రామశర్మ తిండ్రి, నిద్రకు కూడా దూరమయ్యాడు.
అప్పుడు చిదానందుల వారు ప్రశాంత వదనంతో " గురువు విద్యాబోధన చేస్తున్నప్పుడు  ప్రయత్నపూర్వకంగా నైనా ఆయన చెప్పే మాటలపై మనసు లగ్నం చేయాలి. అప్పుడు ఆ మాటలలో కొంత శాతమైనా నీ చెవికి ఎక్కుతుంది. నువ్వు ఆ ప్రయత్నం కొంచెం కూడా  చేయడం లేదు. నీ ఇంద్రియాలు ఎటువైపు వెళితే అటే నీ మనస్సుని కూడా పోనిస్తున్నావు. యుక్త వయస్సులో పంచేంద్రియాలు విచలితం కావడం, వాటి వెనుకే మనస్సు కూడా పరుగులు తీయడం సహజం. అయితే మొక్కవోని దీక్షతో, అకుంఠిత దీక్షతో మనసును ప్రయత్న పూర్వకంగా వెనుకకు లాగుతూ, ఆధీనంలో పెట్టుకోవడం చాలా అవసరం.
నువ్వు చదువుకునే సమయంలో నీ సాటి విధ్యార్ధులవైపు పోటీ భావంతో  చూస్తున్నావు. ఆ పోటీని అందుకోలేకపోతే వారి పట్ల ఈర్షా అసూయాద్వేషాలు పెంపొందించుకుంటున్నావు. నువ్వు ముందు ఇతరులతో పోటీ పడడం మానుకొని, నీతో పోటీ పడడం నేర్చుకో. నిన్నటి కంటె బాగా చదవాలని, గ్రహణ శక్తి పెంచుకోవాలని అనుకో. చదువు,లలిత కళలు, ఉద్యోగ ధర్మం అన్నింటిలో కుడా ఉన్నత శిఖరాలను అందుకునేందుకు ఈ నియమం ఉపయోగపడుతుంది.”
గురువుగారి హితబోధతో రామశర్మకు జ్ఞానోదయ మయ్యింది.ఆ రోజు నుండి గురువు గారి సూచనలను ఆచరణలో పెట్టి విద్యాభ్యాసంలో మంచి ప్రగతి సాధించాడు.
సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు