లిఫ్ట్ కథాకమామీషు; -- యామిజాల జగదీశ్
 నేను సహజంగా ఎవరినీ లిఫ్ట్ అడగను. అందులోనూ ద్విచక్రవాహనదారులనైతే అస్సలు అడగను. ఎందుకంటే ద్విక్రవాహనదారులు వేగంగా డ్రైవ్ చేస్తారని నా అభిప్రాయం. ఆ వేగం పడదు కనుక వారి బండీ ఎక్కే అవకాశమే ఉండదు. అలాగే అపరిచితుల బండీ ఎక్కే ప్రసక్తే లేదు. నాకు బాగా పరిచితులై వారంతట వారు రమ్మని అంటే వెళ్ళిన సందర్భాలు లేకపోలేదు. అయితే నిన్నొక సంఘటన జరిగింది....
సుచిత్రా ఎక్స్ రోడ్డు నుంచి ఓ పావు గంటకు పైగా నడిస్తే దండమూడి ఎంక్లేవ్ ఉంది. ఈ ఎంక్లేవ్ లోపలికి మరో పది నిముషాలపైనే నడిస్తే నా  బాల్యమిత్రుడు మోచర్ల ప్రభాకర్ ఉంటాడు. అతనిని కలుద్దామని హరి నాగభూషణ శాస్త్రి, పిల్లలమర్రి శివప్రసాద్ చెప్పగా సరేనని నేనూ వెళ్ళాను. వాసిలి వసంతకుమార్ తన కారులో శివప్రసాదుని ప్రభాకర్ ఇంటికి తీసుకొచ్చాడు. హరి ఖైరతాబాద్ నుంచి కారులో వచ్చాడు. నేనేమో ఈసిఐఎల్ లో బస్సెక్కి సుచిత్రాలో దిగాను. అక్కడి నుంచి హరి నన్ను తన కారులో పికప్ చేసుకుని వెళ్ళేవాడు. ఎప్పుడూ జరిగేదే ఇది. కానీ ఈసారి కుదరలేదు. దాంతో నేను నా దారిన ప్రభాకర్ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. 
నిజానికి సుచిత్రా సిగ్నల్ నుంచి షేర్ ఆటోలున్నాయి. కానీ నా దగ్గరున్న డబ్బులు డెబ్బై రూపాయలే. అవికూడా బస్ ఛార్జీకి సరిపడా ఉంచుకున్నా. కనుక షేర్ ఆటో ఎక్కే వీలులేదు. 
మరి ప్రభాకర్ ఇంటికి నేను నడుచుకుంటూ పోవడమే తప్ప మరో దారి లేదు. నాకు నడవటం పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ ఓ రెండేళ్ళుగా మోకాలినొప్పుల వల్ల ఎక్కువ దూరం నడవటం అనేది ఒకింత శ్రమతో కూడుకున్నదే. అయినా కాళ్ళకు మనసులో ధైర్యం చెప్పుకుని నడిచేస్తుంటాను. అట్టాగే నినన ఠూడా నడిచాను. సిగ్నల్ దగ్గర బస్సు దిగి ఓ అయిదు అడుగులు కూడా వేసుండను. కానీ టీవీఎస్ వాహనంపై వచ్చినతను నా ముందు బండి ఆపి ఎక్కండి సార్ అన్నాడు. అడిగినందుకు థాంక్సండీ...వద్దులెండి...నేను నడుచుకుంటూ పోతానండి అన్నాను నెమ్మదిగా. కానీ అతను ఆగలేదు.
"మీరు రోడ్డు దాటొచ్చినప్పుడే చూసారు. మీకు మోకాలి నొప్పిలా ఉంది. అందుకే మిమ్మల్ని నేను డ్రాప్ చేయాలనుకున్నాను. ఎక్కండి అంకుల్. పెద్దవారు మీరు" అన్నాడతను. 
అయినా నేను వద్దుసార్...నా మానాన నన్ను నడవనివ్వండి అన్నాను. కానీ అతను బలవంతం చేయడంతో ఇంతలా అడుగుతున్నాడే అనుకుని సరేనని ఎక్కాను. అతని బండి ఎక్కి కూర్చునేలోపు  నా మనసిలా అనుకుంది. ఎంత మంచీ యువకుడు. నేనేమీ లిఫ్ట్ అడగలేదు. అయినా నా కాలినొప్పిని గ్రహించి అతనంతట అతనే నేను వెళ్ళవలసిన చోట దింపుతానన్నాడే...అనుకుని లోలోపల సంతోషించాను. ఫాస్టుగా డ్రైవ్ చేయకండి...నెమ్మదిగా నడపండి అని బండెక్కి కూర్చున్నానో లేదో స్టార్ట్ చేస్తూ అంకుల్ దిగే చోట యిభై రూపాయలివ్వండి అన్నాడు. 
ఆ మాటతో కంగుతిన్నాను. నేను డెబ్బై రూపాయలతో బయలుదేరాను. ఈసిఐఎల్ నుంచీ సుచిత్రాకి ముప్పై రూపాయలు బస్ టిక్కెట్ పోగా ఇంకా నా దగ్గరున్నవి నలబై రూపాయలు. ఆ నలభైలోనూ ఓ ముప్పై తిరుగు ప్రయాణానికి ఖర్చుపెట్టాలి. అది పోను నా దగ్గర మిగిలేది ఓ పది రూపాయల నోటు. కనుక అతనికి యాభై రూపాయలు ఇచ్చేంత డబ్బులు నా జేబులో లేవు. అతను ఎప్పుడైతే యాభై రూపాయలన్నాడో వెంటనే బండి ఆపమన్నాను. ఆపాడు. మీరు అడిగినంత ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను దిగిపోతాను. నన్నొదిలేయండిక్కడ అంటూ దిగిపోయాను. నానంతట నేను మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు. మీ అంతట మీరే వచ్చి నన్నెక్కమని అడిగారు. మీరేదో నా నడక అవస్థ గమనించి మంచి మనసుతో సాయం చేస్తున్నారనుకున్నాను. కానీ బండీ ఎక్కడంతోనే యాభై రూపాయలివ్వండంటే నేనేం చెయ్యాలి. నా దగ్గర డబ్బుల్లేవు అని చెప్పాను. 
నా మాటలన్నీ విన్న ఆ మనిషి సరే సార్ మీరేమీ ఇవ్వక్కర్లేదండి...ఎక్కండి ...మీరు వెళ్ళే రూట్లోనే నేను వెళ్ళాలి. మీరు వెళ్ళవలసిన చోట దిగిపొండి అంకుల్ అన్నాడు. 
కానీ నాకెందుకో భయమేసింది. తీరా దిగిన చోట గొడవపెట్టుకుంటాడేమో అని ఆలోచించి వద్దు నాయనా నన్నొదిలేసే.. నేను నడుచుకుంటూ పోతానని ముందుకి అడుగులేశాను. 
"నేనేదో సాయం చేద్దామనుకుంటే మీరు రానంటున్నారు...మీ ఇష్టం" అంటూ అతను వేగంగా వెళ్ళిపోయాడు బండిమీద.
అతను సాయం చేస్తానంటే నేనొద్దన్నానా, ఏమో...కావచ్చు...ఇదొక పాఠం... ఇంకెప్పుడు ఓ అపరిచిత మనిషి లిఫ్ట్ ఇస్తానంటే ఆశపడి ఎక్కకూడదని తెలిసొచ్చింది. 


కామెంట్‌లు