వంటలూ -వార్పులు !తిండి ---తిప్పలు ....!!-------ప్రొ.నాగపట్ల.భక్తవత్సల రెడ్డి

 సహృదయ సాహితీవేత్తలకు, జానపదవిజ్ఞాన వేత్తలకు, ప్రేమికులకు ఉషోదయ వందనం.
ఈ రోజు వంట - వార్పుల వెనుక ఉన్న మన పెద్దల నమ్మకాలు గురించి ముచ్చటించుకొందాం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జానపదగిరిజన విజ్ఞానపీఠం, 2000 – 01 లో తూర్పు గోదావరి జిల్లా, ఆదుర్రు, పల్లిపాళెం, రమణక్కపేట, తాళ్లూరు, గుర్తూరు గ్రామాల్లో సేకరించిన అంశాలు దీనికి ఆధారం. సేకరణ సిపెచ్ రవికుమార్, కె వి రామకృష్ణ.
వంట, వార్పు, వడ్డన - అసలు వంటిల్లే ఒక కుటీర పరిశ్రమ. వండడానికి ఉపయోగించే వస్తువులు, కాయకూరలు, వాటి కలయిక, వండే విధానం, వాటిని భద్రపర్చడం, దేవునికి అర్పించడం, వడ్డించడం, తినే విధానం, వీటి నేపధ్యం – ప్రతి అంశంలోనూ ఒక వ్యవస్థ, ఒక వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వీటన్నింటిలో పోలికలు ఉన్నా వైవిధ్యం కూడా కనబడుతుంది. ఈ వైవిధ్యమే ఒక  సమూహాన్ని మరో సమూహం నుంచి వేరు చేసి చూపిస్తుంది. అంటే వంట పైకి ఒకటిగానే కనబడుతున్నా దాన్ని వండి వాడుకుంటున్న సమూహాన్ని బట్టి అది అర్థవంతంగా, నేపధ్యానికి తగ్గట్టుగా ఇమిడిపోతుంది. జానపదవిజ్ఞాన సేకరణ, అధ్యయనంలో ఈ సమూహగతమైన విజ్ఞానం – ఎఱుక గుర్తించినపుడే దాని వైశిష్ట్యం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 
మనం తినే తిండి ఆరోగ్య జీవనానికి సహకరించినపుడే అది పౌష్టికాహారం అవుతుంది. అంటే మనం తినే తిండి మీద అవగాహన తప్పనిసరి. ఈ అవగాహన ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా తినాలి ఎలా తినకూడదు, వంట లో ఏది కలపాలి ఏది కలపకూడదు, ఎంత కలపాలి, ఏ సందర్భంలో, ఏ ఋతువులో ఏ తిండి తినాలి, వేడివేడిగా ఏవి తినాలి ఏవి తినకూడదు, ఎవరు తినాలి ఎవరు తినకూడదు – ఇలా గుర్తించుకొంటూపోతే అది ఒక విజ్ఞానసర్వస్వంగా మన ముందు నిలబడుతుంది. 
అల్లం పచ్చడి, నారింజ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పెద్ద ఉసిరికాయ పచ్చడి, నల్లేరుకాడ చారు, మిరియాల చారు, పనసపొట్టు కూర, రేగుపండ్ల వడియాలు లాంటివి పైత్యం తగ్గిస్తాయన్న నమ్మకం తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారంలో ఉంది. ఇందులో నల్లేరుకాడ పచ్చడి వాతాన్ని కూడా తగ్గిస్తుంది. చిత్తారుమాలంవేర్లు నల్లకోడి కలిపి వండిన కూర వల్ల కూడా వాతం తగ్గుతుంది. చలిదన్నం, తర్వానీ అన్నం, సోడి జావ, సోడంబలి, పందిమాంసం కూర, ఎండుసరిగె గుడ్డు ములగకూర తో పాటు పానకం ఒంటికి చల్లదనం కల్గిస్తాయి. 
ఉగాది పచ్చడి, జున్ను, నెదడు (మెదడు) కూర, పొన్నగంటికూర, బొంతరటి కూర, యాట మాంసం చింతచిగురు, మినపరొట్టె తోపాటు సోడంబలి, సోడిపిట్టు ఆరోగ్యానికి మంచిది. చిన్న పిల్లలకు మంచిదని కాకి దొండాకుల కూర, బలం వస్తుందని తాటి పండ్లు, తాటికాయలు, శరీరానికి మంచి రంగు వస్తుందని తాటిసాప, బలమైన ఆహారం అని కుడుములు, సత్తువ అని కర్రపెండలం మీద నమ్మకం.  నిర్దిష్ట ప్రయోజనం మీద అవగాహన లేనపుడు ఇలా సామాన్యీకరణం చూడగలం. ఇంకా కంటికి మంచిదని చిలకతోట కూర తెలగపిండి ములగకూర పొన్నగంటి కూరని, కిడ్నీలకు మంచిదని అరటిపువ్వు కూరని, జీర్ణశక్తి పెరుగుతుందని సోడి తోప సోడి పిట్టు, నీరసం తగ్గుతుందని సోడంబలి, నరాలకు బల్లాన్నిస్తుందని మేకమాంసం, నులుపురుగులు పోతాయని నెల్లికూర తాటిబెల్లం, నోటిపూతకు మంచిదని బొబ్బర పప్పు-జొన్న జావ, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని తాటి సారా, విరేచనాలని తగ్గిస్తుందని బలుసుకూర గంటన్నం, వేడి కల్గించే గోంగూర, వేడిని తగ్గించే కసివిందకూర, సలుపులు తగ్గుతాయని సోడితోప, అట్లతద్దిఅట్లు  మీద నమ్మకం బలంగా ఉంది. 
అరిసెలని, పొంగడాలని గర్భిణీ స్త్రీలు, రజస్వల అయినవారు తినవచ్చు కాని బాలింతకు, కుక్క కరిచిన వారికి పెట్టరు. ఉడుము మాంసం సలుపులు ఉన్న వాళ్లు తింటే మంచిది కాని గర్భిణీ స్త్రీలు తినకూడదు (తింటే నల్లగా ఉండే పిల్లలు పుడతారన్న భయం). తర్వానీ చారు కొత్తకాపురం పెట్టినపుడు చేస్తారు కాని బాలింతకు పుష్పవతికి పెట్టరు. తెలగపిండి-ములగకూర ఆషాఢమాసంలో తినాలి కాని ఇంటి అల్లుడికి పెట్టకూడదు, పురిటాలికి నువ్వుల నూనె తో మేకమాంసం కూర వండి పెడతారు కాని కోడి మాంసం పెట్టరు. కొబ్బరి బూరెలని, మినప సున్నుండలని  కొత్త అల్లుడికి, కొబ్బరి రేకుల్ని గర్భిణీలకు పెడతారు. పూర్వం పెండ్లిండ్లపుడు గుణచారు పెట్టుకునే వారు. గుమ్మడికాయ డప్పలం పెండ్లికి తప్పదు.
కార్తీక మాఘ మాసాల్లో అటుకులు, అట్లతద్ది రోజు తద్దిఅట్లు (అట్లు తిన్నాక అరటి పండు తినడం తప్పనిసరి), పుష్పవతి అయిన అమ్మాయికి  అత్తెసరు పెట్టడంతోపాటు దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా కూడ పెడతారు. ఏకాదశికి అట్ల తద్దికి నీళ్ల ఆరిదిని, వినాయక చవితికి బెల్లంలోయిని, వినాయక చవితికి అట్లతద్దికి పప్పులోయి ని, నాగుల చవితికి నూచిమిడిని, బుర్రగుంజు కూరని, పెళ్లిళ్లలో ఉలవపిండి సున్నుండలు, సదస్యమపుడు ఉక్కారిపొడుం, ఉపవాసం ఉన్నవారు కంద అట్టుని, వినాయక చవితి కి ఉండ్రాళ్ల తద్దికి కుడుములని, సంక్రాంతికి దసరాకు గారెలు, సంక్రాంతికి కార్తీక పౌర్ణమికి బూరెలు,  వ్రతాలు చేసేటపుడు గోధుమ ప్రసాదం, పప్పుజావ, పాలతాలికలు, రథసప్తమికి గోధుమనూక ప్రసాదం, వినాయక చవితికి జిల్లేడుకాయలు, నిశ్చితార్థం రోజు తోప, కొత్త అమావాస్యకు పాల అటుకులు, ఆడబిడ్డ అత్తవారింటికి వెళ్లేటపుడు పాకం సలిమిడి (పోత), కర్మక్రియలకు పాలజావ, రజస్వల సమయంలో పిట్టు, పేరంటాలకు పులగం, పొలాల అమావాస్యకు పొట్టెక్కబుట్టలు, అమ్మోరు పూనిన వారికి బొబ్బరపప్పు-జొన్న జావ, మామిడిటెంకల పండగకి మామిడిటెంకల అంబలి, రజస్వలపుడు మినప అట్లు, ఏకాదశి ఉపవాసమున్నవారు మినపరొట్టె, పెళ్లిళ్లకు, భోగి రోజు మినుప సున్నుండలు, అట్లతద్దికి మినప అట్లు, సంక్రాంతికి మినప్పప్పు కూర, వెదురుకొమ్మల కూర – అలా ఎటు చూసినా వైవిధ్యమే.
వడియాలు, పచ్చళ్లు పెట్టుకోవడంలో కాలానికి, శుచి శుభ్రతకు పెద్దపీట. అరటిదూటి వడియాలు, ఉల్లిపాయ వడియాలు, గోధుమనూక వడియాలు, పనసపొట్టు వడియాలు, పిండి వడియాలు, బూడిదగుమ్మడి వడియాలు, రేగుపండ్ల వడియాలు, సగ్గుబియ్యం వడియాలు – వడియాలు ఏవయినా సరే శుక్రవారం, స్నానం చేసి పెట్టుకుంటారు. పున్నమికి ముందు సోమవారాలలో కీడు జరుగుతుందని వడియాలు పెట్టరు. 
ఈ నమ్మకాలన్నీ అన్ని ఊర్లలో సమానంగా లేవు. కొన్ని పోలికలున్నా కొన్ని ఆయా ఊర్లకే పరిమితం కూడా. సోడంబలి, సోమజావ, సోడిపిట్టు దాదాపు అన్ని ఊర్లలో చేసుకుంటున్నా తాళ్లూరు, రమణక్కపేటలో మాత్రమే సోడిఅట్టు చేసుకుంటున్నారు. బొడ్లంకలో సోడి రొట్టె, ఆదుర్రులో సోమన్నం, తాళ్లూరులో సోమ్పాపిడి చేసుకుంటే పల్లిపాలెం లో  సోడితోప, సోడిపిట్టు, సోడిపోర్లు, సోడి మంగలం పప్పు, సోడి కుడుములు తయారుచేసుకుంటున్నారు. సోమతోప ని ఎసరు కాగినాక సోడిపిండిని వేసి కలుపుతూ చిక్కనైనాక బెల్లం కల్పి దించుతారు. సోడిపిండికి బెల్లం నీళ్లు చిక్కగా కల్పుకొని పెనం మీద పోసి పోర్లు చేసుకుంటారు. బెల్లం, ఉప్పును నీటిలో కలిపి, ఆ నీటితో సోడిపిండిని ముద్దలుగా చేసి, మంగళంలో వేయించి సోడి మంగలం పప్పుని తయారు చేస్తారు. పిట్టు, కుడుములు, జావ, అట్టు తయారీ మామూలే. 
వంటల్లో వైవిధ్యం ఏ కోణంలో చూసినా కనబడుతుంది. మన పెద్దలు ఏ విధంగా చూసినా అవగాహనతో, ఒక నమ్మకంతో, సమయాసమయాలని దృష్టిలో పెట్టుకుని, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి, దానికి ఒక పవిత్ర స్థానం కల్పించి వాడుకున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ విజ్ఞానం నేడు పలుకారణాల వల్ల నగరవాసులకే కాదు గ్రామీణులకు కూడా దూరమవుతుంది. జొమాటో లాంటి కంపెనీలు బలపడుతున్నాయి. మనం ఏం పోగొట్టుకుంటున్నామో ఈ తరం గుర్తించడం లేదు. అనుకరణ మీద మోజు పెరిగి, ఆరోగ్యానికి ఊతమిచ్చిన మన పెద్దలు అనుసరించిన నియమాలకు దూరమై తమ ఆహారపానీయాలని తీసుకుంటున్నారు. ఉత్సాహవంతులైనవారు నడుం బిగిస్తే కొంత వరకైనా వారికి అందుబాటులో ఉన్న వంట – వార్పుల కుటీర పరిశ్రమ వైభవాన్ని, వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని, విజ్ఞానాన్ని తర్వాతి తరానికి అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నిస్తారని ఆశిస్తూ, మరికొన్ని అంశాల్నిజోడించగలరని జానపదవిజ్ఞాన వేత్తలని, ప్రేమికులని కోరుకుంటున్నాను. 
                                 ***
నాగపట్ల భక్తవత్సల రెడ్డి
              తిరుపతి.
కామెంట్‌లు