త్రిస్ర గతి ;==తాజా గజల్ ;-ఎం. వి. ఉమాదేవి
అక్షరాలు సరిగరావు అలుకుతాడు కవివరేణ్య 
అద్దెకున్న వాళ్ళదుమ్ము దులుపుతాడు కవివరేణ్య 

ఏళ్ళనాటి పత్రికలను ఏరితెచ్చి కాపిచేయు 
పేరుమటుకు తనదివేసి పెరుగుతాడు కవివరేణ్య 

పత్రికలకి డబ్బుకట్టి పరవశించి నాట్యమాడు 
రోజురోజు మహాకవిగ ఎదుగుతాడు కవివరేణ్య 

సన్మానం బిరుదులిచ్చు సంస్థలనూ వెదుకుచుండు 
శాలువాలు మొమెంటోలు  అమ్ముతాడు కవివరేణ్య

తనకుతాను ఇచ్చుకున్న బిరుదులెన్నొ లెక్కలేదు 
డిజైన్లలో కవితపెట్టి కులుకుతాడు కవివరేణ్య 

విమర్శలకు భయంలేదు విచారమే అసలులేదు 
సీరియలుగ కవిత్వమే ఒలుకుతాడు కవివరేణ్య 

కాస్త మెప్పులున్న చాలు కళ్ల వెంట భాష్పాలోయ్ 
ఒకరినెపుడు మెచ్చకుండ బ్రతుకుతాడు కవివరేణ్య !!


కామెంట్‌లు