భైరవ కోన .;- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిమీ దూరంలో వున్న 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలున్నాయి. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఒకే కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయి (గ్రానైట్) శిలలను చెక్కి ప్రతిష్ఠించారు.
చరిత్ర.
కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచీ ఉన్నదే. ఆంధ్రప్రదేశ్లో గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం, బొజ్జన్నకొండ, శ్రీపర్వతం, లింగాల మెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది.
పల్లవరాజగు మహేంద్రవర్మ ధాన్యకటకమందు రాజప్రతినిధిగా వున్నప్పుడు గుహాలయ నిర్మాణములను గూర్చి తెలుసుకొని కలప, ఇటుక, లోహనిర్మితములకంటె శాశ్వతమైన వీటి నిర్మాణాలను ఆంధ్రదేశమందు ప్రోత్సహించాడు. ఆ తరువాత పల్లవులు ఓడిపోయి, రాజ్యం పెన్న పరిసర దక్షిణ ప్రాంతములను ఆక్రమించారు. ఆ కాలమున నిర్మించిన పర్వత గుహాలయాలకు భైరవకొండలోని శిల్పములే తార్కాణమని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యం అభిప్రాయపడ్డాడు. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని భావిస్తారు.
ఇచటి దేవాలయమందు భైరవమూర్తి శిల్పమున్నందున ఈ ప్రాంతమునకు భైరవకోన లేక భైరవకొండ అంటారు.
సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూతా కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.
దీనిలో గల భైరవమూర్తి శిల్పము ఇచటి సెలయేటి తూర్పు ఒడ్డున మెతువు (soft schist) శిలయందు నిర్మింపబడినది. దీనిచుట్టూ తరువాతి కాలములో దేవగృహ నిర్మాణము చేశారు. దీనికి దగ్గరలో ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలున్నాయి. వీటిలో దక్షిణ కొనలోని దేవగృహ ద్వారమున కిరువైపులా బ్రహ్మ, నాల్గు చేతుల విష్ణువుల ఆర్ధశిల్పములున్నాయి. ద్వారము పై విభాగమున 'రాజపొరేరి' రాజు కుమార్తెయైన 'గోయింద పొరేరి' మనుమరాలైన 'లోకమ' చే ఈ చిన్న గుహాలయము రూపొందించినట్లు గల శాసనం ప్రకారం సా.శ. 9 వ శతాబ్దమునాటి తెలుగు చోడరాజులకు చెందినదిగా తెలియుచున్నది.
వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఈ గుహాలయాలు రెండు దశలలో నిర్మింపబడినవిగా భావిస్తారు. నిర్మాణరీతి ప్రకారం మొదటి నాలుగు తొలి దశకు. మిగిలిన నాలుగు మలిదశకు చెందినవి. ఒక పెద్ద గుఱ్ఱపునాడా ఆకారంలో గల ఏకశిలా గుట్టమొక్క ఏటవాలు ముఖభాగాన ఇవి వరుసగా నిర్మించారు. పల్లవసాంప్రదాయం ప్రకారం మొదటి గుహ ఉత్తర ముఖమును, మిగిలినవి తూర్పు ముఖమును కలిగియున్నవి. మొదటి నాలుగింటిలో చతురస్రాకార గర్భగృహం వున్నది. దానిలో శివలింగము, పానవట్టమువున్నాయి. వీటి ముందుభాగాన మండపాలు లేవు. వీటి కపోత (దేవాలయంముఖద్వారం పై భాగంలో అలంకరణ) సరిగా రూపొందింపబడలేదు. చివరి నాలుగు గుహలు చతురస్రాకార గర్భగృహతో పాటు మండవ, మండపమందు రెండు కుఢ్యస్తంభాలను రెండు స్తంభాలను, 'కపోత'ను కలిగియున్నవి. వీటికి గల చిన్న ప్రాంగణములందు ఇరువైపుల గణేశ, చండేశుల అర్ధ శిల్పములున్నాయి, ముందు భాగాన నంది ప్రతిమ వుంది.
కొన్ని మండవాలందు ద్వారపాలకులుతో పాటు బ్రహ్మ, విష్ణువుల అర్ధశిల్పాలున్నాయి. కొన్ని స్తంభాల పాదాలందు ఆసీన సింహాలున్నాయి. చండేశ, గణేశ అర్ధశిల్పాలు పల్లవేతర శిల్పప్రభావాన్ని తెలుపుచున్నాయి. ఇచట గుహాలయములన్నిటిలో గల శివలింగములు ఎక్కడినుండో తెచ్చిన నల్లరాతితో చేసి ప్రతిష్టించారు. పానవట్టములు ఇక్కడ కొండరాతితోనే మలచబడినవి. ఇవి 18 అం॥ ఎత్తుతో వుండగా, గుహాలయాలు 6½ అ॥పొడవు. 6 అ॥ ఎత్తు తో వున్నాయి. ముఖ్య దేవగృహ ప్రవేశమార్గమునకు రెండువైపులావున్న వెలుపలి కుఢ్యముపై రెండు చేతులు గల ద్వారపాలక ప్రతిమలు అర్ధశిల్పమున గుహాలయ ఏకశిలయందే మలచబడినవి. తాము ధరించిన పెద్ద 'గదల'పై వారు వాలినట్లు కనిపిస్తారు.  
ఇక్కడ గల ఒక కొండపై ఉన్న 'లింగాలదొరువు'నందు పుట్టిన గంగ భైరవకోనవద్ద జలపాతముగా మారి దుర్గా భైరవాలయమునకు, గుహాలయములకు మధ్య 'సోనవాన' యను పేరుతో ప్రవహిస్తుంది. [1]
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని అమరనాథ్ లో కన్పించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నాగరేశ్వర లింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం), రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.
ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఆశీనమై కనిపిస్తుంది. దీనినే శశినాగ లింగం అనికూడా పిలుస్తారు. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి.
వరసలో కింద ఆలయంలో వెనుకభాగంలో త్రిముఖ దుర్గ అర్ధశిల్పం ముందు భర్గేశ్వర శివలింగం పూజలందుకుంటున్నాయి. ఈ దుర్గ కుడివైపు ముఖం నోట్లోంచి జ్వాల వస్తున్న మహాకాళి, మధ్యన ప్రసన్నవదనంతో మహలక్ష్మి. ఎడమవైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతీదేవి కనిపిస్తారు. దీనికి ఎదురుగా చిన్న కోనేరు వుంది. కార్తీక పౌర్ణమినాడు చంద్రకిరణాలు ఆ నీటిలోపడి ఆ వెలుగు అమ్మవారిమీద పడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన భైరవేశ్వరుని చిన్న ఆలయం వుంది.
చివరిదైన ఎనిమిదో గుహాలయాన్ని అష్టకాల ప్రచండ భైరవ లింగం అని పిలుస్తారు.
ఇక్కడ ఈ గుహాలయాలతోపాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే నడక తప్పనిసరి.
ఈ ప్రాంతం ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.

కామెంట్‌లు