మాయలోకం: అంతుచిక్కని అదృశ్యం!;-- యామిజాల జగదీశ్
 ఓరోజు అగాథా క్రిస్టీ కనిపించకుండా పోయారు. ఇల్లంతా గాలించారు. మిత్రులను, బంధువులనూ కలిసి అడిగారు, ఎక్కడైనా చూసేరా అని! ఫలితం లేకపోవడంతో పోలీసుల దగ్గరకు వెళ్ళారు.
ఉదయం నుంచి  అగాథా కనిపించలేదు...మీరెట్టాగైనా ఆచూకీ తెలుసుకోవాలి అని విన్నవించారు.
ఇంతకూ అగాథా ఎవరు? వయస్సెంత?  ఏం చేస్తారు? ఎలా ఉంటారు? ఇలా రకరకాల ప్రశ్నలన్నీ వేసిన పోలీసులు ఆ తర్వాత వెతకడం మొదలుపెట్టారు. 
ఈ గాలింపులో మొదటగా బయటపడింది అగాథా కారు. కానీ కారు లోపల అగాథా లేరు. అగాథా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అనే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. 
ఇంట్లో నుంచి కారు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి కారుని మాత్రం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళివుంటారు అని పోలీసులు ఆలోచనలో పడ్డారు. 
కారు ఆగి ఉన్న ప్రదేశానికి సమీపంలోనే ఓ  రైల్వే స్టేషన్ ఉంది. బహుశా కారు అక్కడ ఆపి స్టేషన్ కి వెళ్ళి టిక్కెట్టు కొనుక్కుని ఎటో వెళ్ళి ఉంటారు అగాథా అని అనుకున్నారు పోలీసులు. 
ఓ మ్యాప్ తీసుకుని ఆ దిశలోనే ఆలోచించారు. ఇక్కడి నుంచి ఒకరు రైలెక్కితే ఎక్కడెక్కడికల్లా వెళ్ళి ఉండొచ్చు అని ఆలోచించారు. ఓ పట్టిక తయారుచేశారు. 
అనంతరం అన్ని చోట్లా గాలించారు. అగాథా ఆచూకీ కోసం వెతకడం మొదలు పెట్టినప్పుడు నలుగురైదుగురే రంగంలో దిగారు. ఆ తర్వాత ఈ సంఖ్య కొన్ని వందలకు చేరింది.
ఆగాథా ఫోటోను వారి ఇంట్లో నుంచి తీసుకున్నారు. దానికొత్త అనేక ప్రతులు తీసి పలు చోట్ల అతికించారు "కనపడుట లేదు" అని.
అంతేకాకుండా ఆ ఫోటోను చూపించి ఈ మహిళను ఎక్కడైనా చూసేరా అని పోలీసులు ఎందరినో ప్రశ్నించారు. లేదని అందరూ చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.
రోజులు గడుస్తూనే ఉన్నాయి.
 
శిక్షణ పొందిన జాగిలాలను బరిలోకి దింపారు. అవి అగాథా ఇంటి నుంచీ బయలుదేరి అనేక ప్రాంతాలకు వెళ్ళాయి. మరోవైపు ఇరుగుపొరుగు ఇళ్ళవాళ్ళు తమవంతుగా అక్కడక్కడా వెతికారు. అగాథాను కనుక్కోవడం కోసం ఇంగ్లండుకు చెందిన ఓ రహస్య బృందం ప్రత్యేకించి అన్వేషించింది. అయినా ఇంతమంది గాలిస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో ఏం జరిగి ఉంటుంది అని అందరి ప్రశ్నా! 
ఎటు పోయుంటారు? గాలిలో గాలిగా కలిసిపోయుంటారా అని కూడా అనుమానించారు. 
అయినా అది సాధ్యమా? 
కాస్త ఆగండి....
అగాథా క్రిస్టీ నవలలో ఇలాటి ఆశ్చర్యాలూ,  ఊహకందని విషయాలూ పాఠకులను అయోమయంలో పడేస్తాయి. ఏవేవో ఆలోచనలలో కూరుకుపోతారు. ఆ తర్వాత ఏమైంది అని తమకు తాము ప్రశ్నించుకుంటారు. చదువుతున్న పుస్తకంలోని పేజీలను చకచకమని చదువుకుంటూపోతారు. ఆఖరి పేజీలో చివరి వాక్యంలో పాఠకుడి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.
అమ్మయ్యా అదా సంగతి అనుకుంటారు!
తీరా అంతటి సస్పెన్సుతో కథలు నడిపించిన అగాథా క్రిస్టీయే ఇప్పుడు కనిపించకుండా పోయారు. మరిప్పుడు ఏం చేయాలి? 
సరిగ్గా పదో రోజున అగాథా క్రిస్టీ ఆచూకీ తెలిసింది. 
కారుని ఓ చోట ఆపి రైలెక్కి ఓ ఊళ్ళో దిగి ఓ హోటల్లో ఉండి పేరు మార్చుకున్న విషయం తెలియవచ్చింది.
"ఇక్కడేం చేస్తున్నారు?" అని అడిగినందుకు అగాథా ఇలా జవాబిచ్చారు...
"పాటలు విన్నాను. అవీ ఇవీ చదివాను. నిద్రపోయాను. కలలు కన్నాను. నా గురించి పత్రికలలో వచ్చిన వార్తలు చదివాను. నానారకాల ఆహారపదార్థాలు తిన్నాను. నేను కనిపించకపోవడానికి సంబంధించి అనేకమంది అనేక రకాలుగా అనుకున్నారు.
 అగాథా ఎటో వెళ్ళిపోయారు, నువ్వేమనుకుంటున్నావని నన్ను గుర్తించని వారు నన్నే కొందరు అడిగారు. నేను వారికి ఓ కల్పిత కథలు చెప్పాను. ఇలా పది రోజులు గడిచాయి...." అంటూ ఏమీ జరగనట్టుగా అగాథా మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాయడం మొదలుపెట్టారు.
ఆమె రాసిన ప్రతి కథనూ ఎంతో ఆరాటంతో పాఠకులు చదివారు. ప్రతి కథలోనూ ఓ సస్పెన్స్ ఉంటుంది. ప్రతీ పాఠకుడూ చదువుతున్న కొద్దీ ఓ డిటెక్టివ్వులా ఆలోచనలో పడతాడు. బహుశా ఇలాగే అయ్యుంటుంది అని అనుకుంటారు. చివరికి వారనుకున్నట్టు కాకుండా ముగింపు మరోలా ఉంటుంది. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది.
అగాథా రాసిన అన్ని కథలకూ ముగింపు ఉండేది. కానీ అగాథా అదృశ్యమైన ఆ పది రోజుల రహస్యం మాత్రం తెలీలేదు. దయయుంచి చెప్పండి అని అనేకమంది అడిగారు. ఒక్క మాటా రాలేదు ఆమె నోటంట.
ఇంతకూ ఏమై ఉంటుంది? బహుశా అలా అయ్యుండొచ్చు అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారే తప్ప సరైన జవాబు దొరకలేదు.
సస్పెన్స్ థ్రిల్లర్ రచనలు చేసిన అగాథా ఇంగ్లండుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప రచయిత్రి అని మాత్రం అందరికీ తెలిసిందే.

కామెంట్‌లు