చౌసతి యోగిని దేవాలయం..; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 చౌసతి యోగిని దేవాలయం. (64 యోగినుల మందిరం) ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో హీరాపూర్ అనే పల్లెలో ఉంది. 
ఈ మందిరాన్ని 9వ శతాబ్దంలో రాణీ హీరాదేవి నిర్మించినట్లు భావిస్తున్నారు.ఘఘ
ఈ దేవాలయం వృత్తాకారంలో పూర్తిగా ఇసుకరాయితో కట్టబడింది. లోపలి వైపు గోడకు గూళ్లు ఉన్నాయి. ప్రతి గూటిలోను ఒక దేవత బొమ్మ చొప్పున 56 దేవతా ప్రతిమలున్నాయి. ఇవి నల్లని రాతితో చెక్కబడి గోడకు ఇమడ్చబడి ఉన్నాయి. ఈ గుడి మధ్యలో మూల విగ్రహం కాళి రాక్షసుడి తలపై కాలుపెట్టి నిలబడిన భంగిమతో కనిపిస్తుంది. ఈ గుడి మధ్యభాగంలో చండీ మండపం ఉంది. దానిలో మిగిలిన 8 దేవతా విగ్రహాలు నాలుగు వైపులా ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఈ చండీ మంటపంలో మహాభైరవుని పూజించినట్లు ఊహిస్తున్నారు.
ఇది పైకప్పు లేని ఒక తాంత్రిక దేవాలయం. ఇక్కడ పంచభూతాలను ఆరాధిస్తూ క్షుద్రపూజలను నిర్వహిస్తారు.
ఇక్కడి పూజారుల స్థల పురాణం ప్రకారం దుర్గాదేవి రాక్షస సంహారం కొరకు 64 గ్రామదేవతల రూపాలలో వెలసింది. ఈ 64 మంది యోగినులు యుద్ధం అనంతరం దుర్గాదేవిని తమ ఉనికిని చాటడానికి ఒక దేవాలయాన్ని సృష్టించాల్సిందిగా కోరారు.
ఈ యోగిని విగ్రహాలు సాధారణంగా స్త్రీ మూర్తుల రూపంలో ఒక జంతువును వాహనంగా చేసుకుని చేతిలో రాక్షసుని తలను పట్టుకుని శక్తి రూపంలో ఉన్నాయి. ఈ ప్రతిమలలో క్రోధము, దుఃఖము, సంతోషము, ఆహ్లాదము, లాలస మొదలైన అన్ని భావాలు వ్యక్తమౌతున్నాయి.
ఇటువంటి మందిరమే ఒడిషా రాష్ట్రం బలంగిర్ జిల్లాలోని రాణిపూర్- ఝరియల్ ప్రాంతంలోను, భారతదేశంలో మరో ఏడుచోట్ల నెలకొని ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారము 64 సంఖ్య చతుష్షష్ఠి కళలను సూచిస్తున్నది.

కామెంట్‌లు