తిప్పడంపల్లి కోట.; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఆత్మకూరు సంస్థానానికి తిప్పడంపల్లి రాజధానిగా ఉండేది. ఆత్మకూరు సంస్థానానికి ‘అమరచింత’ సంస్థానం అనే పేరు కూడా ఉంది. ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరాన నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి. 190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 70 గ్రామాలు ఉండేవి.రెడ్డిరాజులు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. చంద్రగిరికి చెందిన గోపాల్‌రెడ్డికి కాకతీయ సామంత రాజులతో ఏర్పడిన పరిచయం కారణంగా సా.శ.1268లో వడ్డేమాన్‌కు మగతల నాగగౌడ పదవితో ఇచ్చి సంస్థాన బాధ్యతలను అప్పగించారు.అమరచింత ఈ సంస్థాన మూల పురుషుడు గోపాల్‌రెడ్డే అని చరిత్రకారులు పేర్కొంటున్నారు.సా.శ.1268లో గోపాల్‌రెడ్డితో ప్రారంభమైన ఆత్మకూరు ప్రస్థానం 1948లో సంస్థానం విలీనం అయ్యేవరకూ కొనసాగింది.ఈ సంస్థానానికి చివరిగా రాజా శ్రీరామభూపాల్ బాధ్యతలు వహించారు. తిప్పడంపల్లి రాజధానిగా చేసుకుని రాజా పెదవెంకటరెడ్డి, బాలకృష్ణారెడ్డి, సీతారామభూపాలుడు,శ్రీరాంభూపాలుడు,రాణి భాగ్యలక్ష్మమ్మ వరకు ఈ ఐదుగురు పరిపాలన సాగించారు.అయితే తిప్పుడంపల్లి నుండి ఆత్మకూరుకు రాజధాని మారింది.ఇక్కడ కోట నిర్మించిన తరువాత ఆత్మకూరుకు ఎందుకు మార్చవలసివచ్చిందో కారణాలు ఇతమిద్దంగా తెలియవు. సంస్థానానికి చివరి పాలకురాలు రాణి భాగ్యలక్ష్మమ్మ.
ఆత్మకూరు సంస్థానం నేడు శిథిలావస్థకు చేరుకుంది. కోట లోపలి భాగంలో ఎలాంటి రాజ భవనాలూ లేవు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు కోట లోపల ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించారు.

కామెంట్‌లు