యువస్వరాలు--మహానగరంలో "వీధి గాయనీగాయకులు";-- యామిజాల జగదీశ్
 మద్రాసు మహానగరంలో పాండిబజార్, ఎలియట్స్ బీచ్ తీరం, తిరువాన్ మ్యూర్ సముద్రతీరం, మెట్రో రైల్వే స్టేషన్లు  వంటి ప్రదేశాలలో ఆ సంగీత బృందాన్ని స్దానికులు చూసే ఉండొచ్చు.
వారాంతంలో సాయంత్రాలు, అలాగే ఇతర ముఖ్యమైన రోజులలో ప్రజలు గుమికూడే చోట ఈ సంగీతబృందం తరఫున యువగాయనీగాయకులు పాడుతుండటాన్ని ఓ అలవాటుగా చేసుకున్నారు.
ఇంతకూ వారెవరో కాదు. "ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ చెన్నై" On the streets of Chennai అనే సంగీతబృందానికి చెందినవారే వీరు.
పాశ్చాత్య దేశాలలో ప్రజలు గుమికూడే వీధులలో ఓ మూల నిల్చుని కొందరు కలిసి పాటలు పాడుతుండటం అనేది సర్వసాధారణం.
అయితే ప్రజలు భారీ సంఖ్యలో నడయాడే చెన్నై మహానగరంలోని బహిరంగ ప్రదేశాలలో పాటలు పాడి జనాన్ని ఆకట్టుకోవడం అంత సులభం కాదు. కానీ చెన్నైలో కొన్ని సంవత్సరాలుగా బహిరంగ ప్రదేశాలలో పాడుతూ జనం హృదయాలను దోచుకున్న ఈ గాయక బృందం ఏర్పడిన తీరు చూద్దాం. 
చెన్నైలో 2017 లో బెసెంట్ నగర్ సముద్ర తీరం సమీపాన ఉన్న ఓ కాఫీ షాపులో అయిదుగురు కలిసి ప్రారంభించిందే ఈ సంగీత బృందం.
చెన్నైలో ఇటువంటి వీధి గాయక బృందాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ చెన్నై బృందం వ్యవస్థాపకుడు సెందిల్ రాజ్ ఇలా చెప్పారు...
బెంగళూరులో పని చేస్తున్నప్పుడు కొందరు మిత్రులతో కలిసి ఓమారు ఊటీ వెళ్ళాం. అక్కడ పాటలు పాడి కాలక్షేపం చేసాం. అప్పుడు చెన్నై నుంచి వచ్చిన కొందరు మాతో కలిసి పాటలు పాడారు. అక్కడి నుంచి బయలుదేరినప్పుడు చెన్నైలో మాట్లాడుకుందాం అని పరస్పరం సెల్ ఫోన్ నెంబర్లు  ఇచ్చుకున్నాం. ఆ విధంగానే చెన్నై బెసెంట్ నగర్ లో ఉన్న కిఫీ షాపులో మేం కలిసాం. మొదట్లో అయిదుగురు మిత్రులం కలిసి పాటలు పాడటం మొదలుపెట్టాం. ఇక్కడి నుంచే ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ చెన్నై ప్రయాణం మొదలైంది. మా పాటలు విన్న కాఫీ షాప్ వినియోగదారులు "పాటలు వింటుంటే మనసుకి హాయిగా ఉంది. మానసిక ఒత్తిడి తగ్గుతోంది. సంతోషం కలుగుతోంది" అని మమ్మల్ని కొనియాడారు.
ముదట్లో రెండేళ్ళ పాటు అక్కడే పాటలు పాడాం. అనంతరం చెన్నై నగరంలో జనం అధికంగా నడయాడే చోట్లలో పాటలు పాడాలని నిర్ణయించుకున్నాం. వీరి పాటలు విన్న కొందరు మా బృందంలో చేరడానికి ఆసక్తి చూపారు. ఆ విధంగానే మా సంగీత బృందం సంఖ్య విస్తరించిందన్నారు సెందిల్ రాజ్! 
అయిదుగురితో ప్రారంభమైన ఈ బృందంలో ప్రస్తుతం ఎనిమిది వందలమందికిపైగానే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇరవై అయిదేళ్ళ లోపు యువతీయువకులే. వైద్యులు ఐటీ పరిశ్రమకు చెందిన వారు ఇలా వివిధ రంగాలకు చెందినవారు ఈ సంగీత బృందంలో చేరారు. 
సాధారణంగా సాయంత్రం వేళల్లో వీరు పాటలు పాడుతుంటారు. అయితే అంతర్జాతీయ హ్యాపీ డే అయిన మార్చి ఇరవయ్యో తేదీన దాదాపు పదకొండు గంటలపాటు వీరు టీ. నగర్లోని పాండిబజారులో పాటలు పాడారు. 
ఇళయరాజా, ఎ.ఆర్. రహ్మాన్ సంగీతదర్శకత్వంలో జనాదరణ పొందిన పలు పాటలనే కాకుండా అక్కడ గుమికూడిన సంగీతాభిమానులు కోరిన పాటలనుసైతం పాడి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ బృందానికి అయ్యే ఖర్చును ఎలా భరిస్తున్నారనే ప్రశ్నకు సెందిల్ రాజ్ "మా పాటల కార్యక్రమం పూర్తి ఉచితం. మా బృందానికి సంబంధించి మైక్ సెట్లు మాత్రమే ఉన్నాయి. మా బృందంలో ఉన్న వారు ఎవరికి వారు తమ సొంత సంగీత పరికరాలను తీసుకొచ్చి వాయిస్తుంటారు. ఇళ్ళ నుంచి సంగీత కార్యక్రమం జరిగే చోటుకి కూడా వారు తమ తమ సొంత ఛార్జీలతో వస్తారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలలో ప్రేక్షకులు ప్రేమతోనో అభిమానంతోనో కానుకలు ఇచ్చినా తీసుకోవడం లేదు. అయినా కానుకలు తీసుకోబోమన్న విషయాన్ని మేం ముందుగానే ప్రకటిస్తాం. కొందరు అభిమానులు మమ్మల్ని తమ ప్రాంతానికి వచ్చి పాడమని ఆహ్వానిస్తుంటారు. అలాగే హోటళ్ళ వారు కూడా ఆహ్వానించిన సందర్భాలున్నాయి. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలలో మాత్రం మేము డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బులను మా సంగీత బృందం ఖర్చులకు వినియోగిస్తాం" అన్నారు. 
ఈ బృందంవారు సొంతంగా ఓ ఆల్బమ్ కూడా రూపొందించి ఆవిష్కరించారు. ఈ ఆల్బంలో ఎనిమిది పాటలున్నాయి.
కరోనా కాలంలో సంగీత కార్యక్రమాన్ని తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ప్రజలను చైతన్యపరిచే విధంగా కొనసాగించారు. చెన్నైలో మాత్రమే కాకుండా కోయంబత్తూరు, మదురై వంటి నగరాలనుంచి కూడా ఈ బృందానికి ఆహ్వానాలొచ్చాయి. 
2019  డిసెంబర్ లో 14, 15 తేదీలలో నాన్ స్టాప్ గా ఈ బృందం చెన్నై నగరంలో పాటలు పాడటం విశేషం.
 

కామెంట్‌లు