కవితావిందుకు స్వాగతం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గాలివీచినట్లు
ఏరుపారినట్లు
ఊహలూరినట్లు
కవితలు కదులుచున్నాయి

మిఠాయి తినినట్లు
మంచిమాట వినినట్లు
తేనెను నాకినట్లు
కవితలు తీపిగానున్నాయి

నిండుజాబిలి ఉన్నట్లు
విరబూచినచెట్టు ఉన్నట్లు
ముస్తాబయిన పెళ్ళికూతురున్నట్లు 
కవితలు సొగసుగానున్నాయి

ముత్యాలను సరముగా గుచ్చినట్లు
మల్లెలను మాలగా అల్లినట్లు
దీపాలను వరుసలో పెట్టినట్లు
కవితలో అక్షరాలు కుదిరిపోయాయి

అరుణోదయ కిరణంలా
చల్లని వెన్నెలవెలుగులా
తారల తళుకుబెళుకులా
కవితలు మెరిసిపోతున్నాయి

విషయాలను వర్ణించి
కళ్ళకు చూపించి
పెదవులను కదిలించి
కవితలు మనసులను తట్టుచున్నాయి

గాలిలో ఎగిరినట్లు
మబ్బుల్లో తిరిగినట్లు
కమ్మని కలకన్నట్లు
కవితలు భావనకలిగిస్తున్నాయి

పద్యాలపసందు
పాటలవిందు
వచనకవితలవడ్డింపు
కలసి కవితలుగుబాళిస్తున్నాయి

కవితాకన్యక కవ్వించి
సాహితి సహకరించి
శారదదేవి కరుణించి
కవితలు కళ్ళముందుకొస్తున్నాయి

కవితలను అందుకోండి
మనసుపెట్టి చదవండి
ఆస్వాదించి అర్ధంచేసుకోండి
మనసులను మురిపించండి

కవితలవిందుకు కదిలిరండి
కడుపునిండా ఆరగించండి
కమ్మగా ఆస్వాదించండి
కవులను మనసులతలచండి 

నచ్చితే
మెచ్చుకోండి
నచ్చకపోతే
విమర్శించండి



కామెంట్‌లు
Babu శుభాకర్ చెప్పారు…
సూపర్ కవిత రాజేంద్రప్రసాద్ గారు