*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 021*
 *ఉత్పలమాల:*
*కంటి నదీతటంబుఁబొడ | గంటిని భద్రనగాధివాసమున్*
*గంటి నిలాతనూజ నురు | కార్ముక మార్గణ శంఖచక్రముల్*
*గంటిని మిము లక్ష్మణునిఁ | గంటి కృతార్ధుడనైతినో జగ*
*త్కంటక దైత్య నిర్దళన | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయా రూపమైన దశరధ రామా! రాక్షస సమూహాలను సంహరించి గోదావరీ నదీతీరంలో భద్రగిరి పైన ప్రత్యక్షమైన నిన్ను, భూదేవి కూతురు అయిన సీతా దేవిని, నీ తమ్ముడు లక్ష్మణుని చూసాను. నిత్యము నీ దగ్గర గా వుండే ధనస్సును, బాణాలను, శంఖు, చక్రాలను కూడా చూచి ధన్యుడనయ్యాను, రామా!...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"ధన్యుడనైతిని ఓ రామా! నా పుణ్యము పండెను శ్రీ రామా!!" రామదాసు కీర్తన గుర్తుకు వచ్చింది. "కొలువై ఉన్నాడే కోదండపాణి! కొలువై ఉన్నాడే!",  "ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట! బాగ తెల్పగరాదా!" త్యాగరాజ కీర్తనలు. కంచెర్ల గోపన్న, త్యాగరాజు గార్లు ఇద్దరూ కారణ జన్ములే. రామ సేవకోసమే పుట్టినవారు. కేవలం రాముణ్ణి సేవించాలి కనుక సేవించలేదు, వీరు. ఆర్తి,ఆర్ద్రత తో నిండిన మనసులో, రామనామ రూపంలో రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని తెలియని ఒక తపనతో జీవనం సాగించారు. మనకందరకూ మార్గ దర్శకత్వం చేయడానికి. ఇంతటి ప్రాతఃస్మరణీయులకు నమస్కరిస్తూ మనం కూడా వారి దారిలో నడిచేటట్టు అనుగ్రహించమని వేడుకుంటూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు