*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 025*
 *చంపకమాల:*
*చక్కెర మాని వేము దినఁ | జాలిన కైవడి మానవాధముల్*
*పెక్కురు బక్క దైవముల | వేమరు గొల్చెద రట్లు కాదయా*
*మ్రొక్కిన నీకు మ్రొక్కవలె | మోక్ష మొసంగిన నీవ యీవలెన్*
*దక్కిన మాటలేమిటికి | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయకు సముద్రము వంటి వాడవైన రామచంద్రా! తెలివి లేని వారు, తియ్యగా వుండే చక్కెర ఎదురుగా వున్నా, పక్కన వున్న వేప ఆకును తినడానికి ఇష్టపడతారు. అలాగే, అందరూ కనబడిన, వినబడిన ఎందరో దేవతలను కొలుస్తారు. అలా చేయకూడదు. మోక్షమునే ఇవ్వగలిగిన నిన్ను కొలిస్తే చాలు కదా రామా ...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ కలియుగంలో ఎంతో మంది గురువులు, దేవతలు మనకు కనబడతారు. గురువులు ఎంత మంది వున్నా, సద్గురువు ఒక్కరే. అలాగే, అన్ని దేవతలకు పరదేవత ఒక్కరే. సద్గురువు నందు నమ్మకాన్ని వుంచుకుంటే, పరమేశ్వరుని మనకు ఆయనే పరిచయం చేస్తారు. ఆ తరువాత నుండి ఆ పరమాత్మను నమ్మకం తో పట్టుకుని వుండవలసిన పని మనదే. కానీ, మనం చపల చిత్తులము కదా! అందుకని, ఎవరో ఒక్క దేవుడు, దేవత పై నమ్మకాన్ని నిలుపుకోనేలా చేయమని ఆ దేవుడు లేదా దేవతనే అడగాలి. ఎంతలా నమ్మాలి అంటే, మనం వేంకటేశ్వరుని నమ్ముకుంటే, శివుని గుడికి వేళితే వేంకటేశ్వరుడు కనిపించేటంత.ఈ పరిస్థితి మనకు కలిగితే, తదుపరి మోక్షమే.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు