*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 026*
 *ఉత్పలమాల:*
*"రా" కలుషంబు లెల్ల బయ | లంబడ ద్రోచిన "మా" కవాటమై*
*ఢీకొని ప్రోచు నిక్కమని | ధీయుతులెన్నఁదదీయ వర్ణముల్*
*గైకొని భక్తిచే నుడువఁ | గానరు గాక! విపత్పరంపరల్*
*దాకొనునే జగజ్జనుల | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! నీ పేరులోని "రా" అక్షరము పాపములను పోగొడుతుంది. "మా" అక్షరము అజ్ఞానమును అడ్డుకునే తలుపు లాగా మా మనస్సు లోకి పాపపు ఆలోచనలు రాకుండా కాపాడుతుంది. ఇది తెలిసిన తెలివైన వారు భక్తి తో ఎప్పుడూ నీ నామమును జపించుతూ వుంటారు. అలా భక్తితో నీ నామ జపం చేసే వారికి కష్టాలు ఒకదాని తరువాత ఒకటిగా రానే రావు కదా...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ కలియుగంలో ప్రస్తుత కాలములో నామ జపం, భక్తి మాత్రమే మనలను కాపాడ గలిగే తిరుగులేని బ్రహ్మాస్త్రాలు. నామ జపంతో పొందగలిగే భగవంతుని కృప అనుపమానము. అమేయము. ఒక హనుమ, అన్నమయ, త్యాగరాజు, భద్రాచల రామదాసు మొదలైన వారు నామ జపం విషయంలో మనకు మార్గదర్శకులు.  ప్రాతః స్మరణీయులు పరమాచార్య, రాఘవనారాయణ శాస్త్రి గారు, సద్గురువు శివానంద మూర్తి గారు వున్న సమయంలోనే మనం కూడా పుట్టటం అనేది మన పెద్దలు చేసుకున్న పుణ్య ఫలం. ఈ పెద్ద వారు, పుణ్యమూర్తులు ఆచరించి చూపిన జప మార్గాన్ని భక్తి శ్రద్ధలతో విడువకుండా ఆచరించి, పరమశివుని చేరుకునే అవకాశాన్ని, ఆ పరాత్పరుడు మనకు కలిపించాలని, ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు