*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 027*
 *ఉత్పలమాల:*
*రామహరే కకుత్సకుల | రామహరే రఘురామరామ శ్రీ*
*రామహరే యటంచు మ | ది రంజిల భేకగళంబులీల నీ*
*నామము సంస్మరించిన | జనంబు భవం బెడబాసి తత్పరం*
*ధామ నివాసు లౌదురఁట | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! కాకుత్స వంశంలో పుట్టిన రామా! హరీ! రఘువంశం లోని రాజులందరి కంటే గొప్పవాడవైన రామా! హరీ! అని కప్ప గొంతుక వంటి గొంతు తో అయినా సరే నిన్ను మనసంతా నింపుకుని తలచుకునే జనాలు, ఈ భవబంధాలు వదిలించుకుని ఆ పరంధాముని నివాసమైన వైకుంఠానికి చేరుకుంటారు ..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*భజన సంప్రదాయ గొప్పతనం మనకు పరిచయం చేస్తున్నారు కవి భద్రాచల రామదాసు. నామ స్మరణ లో ఒక గొప్ప మార్గం "భజన సంప్రదాయం". హనుమ కంటే భజన సంప్రదాయానికి తలమానికమైన వారు వేరొకరు వుండరు. రామ భజన చేసి చేసి, సీతారాములను తన మనసులోనే వుంచుకున్నాడు. రామ భజన చేసిన గౌతమి తన శాపవిమోచనం పొందగలిగింది. సామాన్య ప్రజలు నామ స్మరణకు దగ్గరగా వుండడానికి అతి సులువైన మార్గం భజన సంప్రదాయం. ఇది సామూహిక కార్యక్రమం. ఈ భజన కార్యక్రమంలో ఏ చదువూ లేని ప్రజలు కూడా కేవలం వినికిడి వల్ల నామ స్మరణ చేయ గలుగుతున్నారు. ఇంతటి ఘనమైన నామ స్మరణ ను మనలో మనసులో నిలుపుకుని, పరాత్పరుని చేరుకునే ప్రయత్నంలో పరమేశ్వరుని కరుణ మనపై వుండాలని ప్రార్థిస్తూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు