సోమరికి ఒక పాఠం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

 రాఘవయ్య కొడుకు మురారికి మహాబద్ధకం,సోమరి ఏపని చేసేవాడుకాదు శుభ్రంగా తిని నిద్రపోయేవాడు.
        కొడుకు సోమరి తనంతో విసిగి పోయిన రాఘవయ్య కొడుకుతో"కనీసం వందరూపాయలు  నీస్వశక్తితో సంపాదించి నాకు నీ మొహం చూపించు,లేకపోతే ఇక ఇంటికి రాకు" అని ఖరాఖండిగా చెప్పేశాడు.
    తన తండ్రే ఆ విధంగా చెప్పేసరికి మురారికి ఏంచెప్పాలో,ఏంచేయాలో తెలియలేదు.ఏమైనా వందరూపాయలు సంపాదించి తిరిగి రావాలనుకున్నాడు.కానీ మురారికి ఏ పనిరాదు.ఎంత ఆలోచించినా ఏ పని చెయ్యాలో అర్థం కాలేదు.మురారికి ఒక ఆలోచన వచ్చింది.అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే మునిని అడిగి సులభంగా డబ్బు సంపాదించే మంత్రం అడగాలనుకున్నాడు. అలా మునిని వెతుకుతూ వెళుతూనే ఉన్నాడు ముని కనబడలేదు కానీ చీకటి పడిపోయింది.వాడికి భయంవేసింది దారి తెలియలేదు! బాగా చీకటి పడిన తరువాత ఓ చెట్టు పైనుండి దబ్బున ఒక వింత దెయ్యం మురారి ముందుకు దూకింది! మురారి గజ గజ వణికిపోయాడు.
       "నన్నేమీ చేయకు" వణుకుతూ అడిగాడు.
       "నివ్వెరు ఎందుకొచ్చావు ఇక్కడికి" కీచు గొంతుతో అడిగింది దెయ్యం.
      తండ్రితో జరిగిన సంభాషణ, వంద రూపాయల సంగతి చెప్పాడు మురారి.
       కీచు గొంతుతో పకపకా నవ్వింది దెయ్యం.
      "ఎందుకు నవ్వుతున్నావు?" అడిగాడు.
    "నేనుకూడా బతికున్నప్పుడు నీలాగే పరమ బద్ధకస్తుణ్ణి,ప్రతి పైసాకు నా తండ్రి సంపాదన మీదే ఆధారపడ్డాను.దేవుడు మనిషికి బుర్రలో తెలివి, పనిచేసేందుకు చేతులు,పని వద్దకు వెళ్ళడానికి కాళ్ళు ఇచ్చాడు.వీటిని సక్రమంగా ఉపయోగించనివాడు,ఇతరుల సంపాదన మీద ఆధార పడ్డవాడు నాలాగ దెయ్యం అయి నాలాగ అడవులు పట్టి పోతాడు.అందుకే నీ మేలు కోరి చెబుతున్నాను, సోమరి తనం వదలి పని చెయ్యడం నేర్చుకో,నీ పొట్ట నీ సంపాదనతో నింపుకో లేకపోతే నాలాగ దెయ్యం అయిపోతావు! " అని హెచ్చరించింది దెయ్యం.
       "నాకళ్ళు తెరిపించావు దెయ్యం అన్నా,ఈ రోజు నుండి పని వెతుక్కుని కష్టపడి నా సంపాదన నేను సంపాదించు కొంటాను.నాతండ్రికి కష్టాన్ని కలిగించను" అని వాగ్దానం చేశాడు.
      "మీ ఊరు జమీందారు దగ్గర పని దొరుకుతుంది ప్రయత్నించు" చెప్పింది దెయ్యం.
       "ఊరికి దారి చూపించు" అడిగాడు మురారి.
       దెయ్యం దారి చూపింది.మురారి వెళ్ళి జమీందారును కలసి ఆయన దివాణంలో కాపలా దారుడిగా చేరాడు. మురారి తండ్రి కొడుకు ప్రయోజకుడుడైనందుకు సంతోషించాడు.
       సోమరి పోతు మంచి పనివాడుగా మార్చినందుకు దెయ్యానికి దెయ్యం రూపంనుండి విముక్తి కలిగింది.
                  ***** *******

కామెంట్‌లు