నక్కబావ పిల్లిబావ (సరదా జానపద కథ)-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక పిల్లి ఉండేది. అది ఒక రోజు పక్కనే వున్న అడవిలో పోతావుంటే దానికి ఒక నక్క కనబడింది. నక్కను చూస్తానే పిల్లికి దాన్తో స్నేహం చేయాలనిపించింది. దాంతో అది దాని దగ్గరకు పోయి “నక్కబావా! నక్కబావా! నాతో స్నేహం చేస్తావా" అని అడిగింది. దానికా నక్క “చూడు పిల్లిబావా... నువ్వుండేదా అడవి బైట, నేనుండేదా అడవి లోపల. మనకు స్నేహమెట్లా కుదుర్తాది" అనింది. అపుడా పిల్లి “దానిదేముందిలే నక్కబావా... నేనే రోజూ అడవిలోనికి వస్తా సరేనా" అనింది. నక్క 'సరే' అనింది. అప్పటినుంచీ పిల్లి రోజూ అడవిలోకొచ్చేది. అట్లా కొన్ని రోజులకు అవి రెండూ మంచి స్నేహితులైపోయినాయి.
అడవిలోని మిగతా జంతువులు అది చూసి “చూడు... నక్కబావా! చేయకూడని స్నేహం చేయడం మంచిది కాదు. అడవిలో ఇన్ని జంతువులను వదిలేసి అట్లా బైటున్న దానితో స్నేహం చేయడం ఏం బాగాలేదు. మా మాటిని దాన్తో స్నేహం చేయడం మానెయ్. లేకుంటే అనవసరంగా ఆపదల్లో పడతావ్" అని చెప్పినాయి. కానీ నక్క ఎవరి మాటలూ పట్టించుకోలేదు.
ఒకరోజు అడవిలో పెద్ద పండగ జరిగింది. దాంతో నక్క పిల్లిని “ఈ రోజు మా యింటికి రా" అని పిల్చుకోని పోయి మంచి మంచి పిండివంటలు కడుపు నిండా పెట్టింది. ఒకరోజు పిల్లి నక్కతో “ఎప్పుడూ నేనే అడవిలోనికి వస్తావున్నా గానీ నువ్వు ఒక్కసారి గూడా నా కోసం వూర్లోకి రాలేదు. రేపు మా వూర్లో పెద్ద పండగ జరుగుతా వుంది. నువ్వు రా. కజ్జికాయలు, బచ్చాలు బాగా తినొచ్చు" అనింది.
నక్క బావకు ఆ మాటింటూనే నోట్లో నీళ్లూరినాయి. కానీ వూర్లోకి రావాలంటే భయమేసి “నన్ను చూస్తే మనుషులు వూకుంటారా? వెంటబడి తరిమితరిమి కొడతారు గదా... మరెట్లా రావడం" అనడిగింది. అప్పుడా పిల్లి “అర్ధరాత్రి అందరూ పండుకుంటారు గదా... అప్పుడురా. మట్టసంగా మనకు కావాల్సినవన్నీ బాగా తినొచ్చు" అనింది. నక్క "సరే" అనింది. 
తరువాత రోజు రాత్రి నక్క పిల్లితో బాటు వూర్లోకి వచ్చింది. ఒకొక్క ఇళ్లే దాటుకుంటా పోతా వుంటే ఒకచోట ఘుమఘుమఘుమ వాసనొచ్చింది. వెంటనే పిల్లి “నక్క బావా! నక్కబావా!
ఈ ఇంట్లో పండుగ బాగా చేసుకున్నట్టున్నారు. గమ్మున చప్పుడు కాకుండా లోపలికి పోయి కడుపు నిండా తినొద్దాంరా” అంటూ ఎగిరి కిటికీలో దూరింది. అది చూసి నక్క “పిల్లిబావా! నేను నీ మాదిరి ఎగిరి దుంకలేను గదా. మరెట్లా రావడం" అనింది. అప్పుడా పిల్లి నక్కను తీస్కోని పోయి జాలాడి చూపించి “నేను పైనుంచొస్తా... నువ్వు దీంట్లోంచి దూరి లోపలికిరా" అనింది. సరేనని నక్క ఆ కన్నంలోంచి కష్టపడి దూరి లోపలికొచ్చేసింది. రెండూ సంబరంగా దొరికినవన్నీ లొట్టలేసుకుంటా హాయిగా కడుపు నిండా తిన్నాయి.
అంతలో పిల్లికి అటక మీద ఒక ఎలుక పోతా కనబడింది. దాన్ని పట్టుకుందామని పిల్లి ఎగిరి అటక మీదకు ఒక్క దుంకు దుంకింది. ఎలక దొరకలేదు గానీ పిల్లి తగిలేసరికి అక్కడున్న గిన్నెలన్నీ ధనధనధన చప్పుడు చేస్తా కింద పడ్డాయి. ఆ చప్పుడుకి ఇంట్లో పండుకున్నోళ్ళంతా అదిరిపడి లేచినారు. 
వెంటనే పిల్లి “నక్కబావా ! నక్కబావా! తొందరగా పారిపో... ఇంట్లో వాళ్లు వచ్చేస్తా వున్నారు” అని చెప్పి కిటికీలోంచి బైటికి దూకి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. 
నక్కగూడా వురుక్కుంటా పోయి జాలాడి బొర్రలో దూరింది... కానీ అప్పటికే అది కడుపు నిండా బాగా మెక్కింది గదా. దాంతో అది పట్టలేదు. సగం దూరంలో ఇరక్కపోయి ముందుకీ పోలేకా, వెనక్కీ రాలేక గింజుకోసాగింది.
అంతలో లోపలికొచ్చినోళ్ళకి జాలాడి బొర్రలో తనకలాడతా వున్న నక్క కనబడింది. “ఇంట్లోకి ఈ నక్కెట్లా వచ్చిందబ్బా" అని ఆశ్చర్యపోతా దాని తోక పట్టుకోని బైటకు లాగి కట్టెలు తీసుకోని కొట్టిన చోట కొట్టకుండా దభీదభీమని కొట్టడం మొదలుపెట్టినారు. ఇట్లాగే కాసేపుంటే చావడం ఖాయమనుకున్న నక్కకు హఠాత్తుగా ఒక ఉపాయం తోచింది.
వెంటనే అది నాలిక బైటికి పెట్టి కదలకుండా చచ్చినదాని మాదిరి పడిపోయింది. దాంతో వాళ్ళు అది చచ్చిందనుకోని తోక పట్టుకోని లాక్కోనొచ్చి ఇసిరి ఇంటి బైట పాడేసి పోయినారు. వాళ్ళట్లా లోపలికి పోవడం ఆలస్యం నక్క లేచి కుంటుకుంటా తిరిగి అడవికి బయలుదేరింది. అట్లా పోతా పోతా....
“చేయరాని స్నేహం చేయరాదు.... 
ఒకవేళ చేసినాననుకో పోగూడని చోటికి పోరాదు...
ఒకవేళ పోతిననుకో తినగూడని చోట తినరాదు... ఒకవేళ తింటిననుకో దొరకగూడని వారికి దొరకరాదు... 
ఒకవేళ దొరికితిననుకో తన్నులు తిని సావకుండా చచ్చినట్లు పడి వుండటం వుత్తమమైన పని" అనుకోనింది.
***********
కామెంట్‌లు