అమ్మకో లేఖ;- జగదీశ్ యామిజాల
 ప్రియమైన అమ్మకు...
ఎలా ఉన్నావమ్మా.... వారం పది రోజుల్లో నేనక్కడికి వచ్చే అవకాశముంది. కొన్ని రోజుల క్రితం తమ్ముడికో ఉత్తరం రాశాను. కానీ వాడి నుంచి జవాబు లేదు. వాడు బాగానే చదువుకుంటున్నాడు కదమ్మా. 
అమ్మల గురించి ఎవరెవరో ఎన్నెన్నో రాసి ఉండొచ్చు. అమ్మ ఓ ధైర్యం. ఓ ప్రేమ. ఓ భరోసా. 
నిన్ను విడిచిపెట్టి ఉద్యోగం నిమిత్తం ఇలా వేరే ఊరుకి రావాల్సి వచ్చింది. నీకు దూరంగా ఉన్నాననే మాటే గానీ నా ఆలోచనలన్నింట్లోనూ నువ్వే ఉన్నావు. నువ్వే నన్ను నడిపిస్తున్నావు. 
నీకెక్కడైనా దూరంగా ఉద్యోగం వస్తే తెలుస్తుందిరా నేనేంటో అని ఎందుకన్నావో గానీ ఇప్పుడా భారం తెలుస్తోందమ్మా. ఈ మాటేదో ఉత్తినే చెప్తున్నది కాదు. హృదయంలోంచి చెప్తున్నాను. 
నేను చదువుకునే రోజుల్లో నాకు ప్రేమా, ధైర్యం అవసరమైనప్పుడల్లా, నువ్విస్తూనే వచ్చావు. మాటల్లో చెప్పలేని లోటు. నీరసం. అటువంటప్పుడల్లా బరువెక్కిన నా మనసుని చెప్పాలనుకునే లోపు నీకెట్టా తెలిసేదో తెలీదు, నన్ను పక్కనే కూర్చోపెట్టుకుని నువ్వు చెప్పే ప్రతి మాటా నాకెంతో ధైర్యాన్నిచ్చాదో. కొత్త శక్తి వచ్చేది. 
నన్ను మందలించాలనుకున్నప్పుడల్లా మందలించావు. అప్పుడు నీమీద కోపం వచ్చేది. కానీ క్రమశిక్షణ తప్పకూడదనే రీతిలో ఉండే నీ మందలింపంతా ఎండాకాలం వాన లాంటిదని ఇప్పుడనిపిస్తింది. నీ మందలింపు మాటున ఒదిగి ఉన్న  ప్రేమ గొప్పతనమేంటో ఇప్పుడు తెలిసొస్తోందమ్మా. 
నేను నా మొదటి ఇంఃర్వ్యూలో విఫలమై బాధ పడుతుంటే నువ్వు చెప్పిన మాటలు నాలో కొత్త ఆశలకు చోటిచ్చాయి. ఇది కాకపోతే ఇంకొకటిరా అన్న నీ మాటే నాకప్పుడు ఎంత మనోధైర్యాన్నిచ్చిందో చెప్పలేనమ్మా.
ఒత్తిడులు, ఎదురుదెబ్బలు తింటున్నప్పుడల్లా నీ జ్ఞాపకాలే నాకొక టానిక్ అనుకో. ఎన్నున్నాసరే కచ్చితత్వాన్ని వీడకని నువ్వన్న మాట అక్షరసత్యమమ్మా.
ఈసారి నేనక్కడికి వచ్చినప్పుడు రోజూ నువ్వు కలిపిచ్చే టీ తాగాలమ్మా. నేనిక్కడా అక్కడా టీ కొట్లలో ఛాయ్ తాగుతున్నా నువ్వు కలిపిచ్చే టీ ముందర అవన్నీ రుచీపచీ లేనివేనమ్మా. బయట దుకాణాల్లో టీ తాగుతున్నఫ్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది నీ టీయే.
అమ్మ అనే బంధం ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన అనుబంధమమ్మా. అందులోని మమకారాన్నో మాధుర్యాన్నో మాటల్లో చెప్పలేనమ్మా. ఎవరి అనుభవం ఎవరి అనుభూతి వారిదేనమ్మా.
అమ్మా! నీకు నామీదున్నంత నమ్మకం మరెవ్వరికీ ఉంటుందనుకోను. ఆ తలపే నాకొక భరోసా. అట్టాగే నువ్వున్నావనే ధీమా నాకొక అండా దండా!
నీమీది ఆలోచనలతోనే పెనవేసుకున్న నా చేతలకూ రాతలకూ పునాది నీ ప్రేమానురాగాలేనమ్మా. నన్ను నడిపించేవి నీ మాటలే. నాకొక నవశక్తి. నాకు మార్గనిర్దేశం చేసేవి నీ మాటలే. 
నీ గురించి ఎంత రాసినా ఇంకా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. మన మధ్య బంధానికి పునాది నీ నిస్వార్థ ప్రేమేనమ్మా. 
అన్నట్టు నేనొచ్చేటప్పుడు నీకేం తీసుకురావాలో ఉత్తరం రాయి. కానీ నువ్వనే మాటేంటో నాకు తెలుసమ్మా. "నువ్వొస్తున్నావుగా. అదే నాకు చాలు" అంటావు. చెప్తున్నాగా, నువ్వుగా ఏదీ అడగవని నాకు తెలుసు. రాబోయేది చలికాలం. ఇక్కడి స్వెట్టర్లు బాగుంటాయి. నీకో రెండు స్వెట్టర్లు తీసుకొస్తాను. అందులో ఒకటి నీకిష్టమైన గులాబీ రంగొకటి. మరొకటేమో నాకిష్టమైన నీలంరంగుది. 
సెలవులకి ఆమోదముద్ర పడటంతోనే బయలుదేరొస్తానమ్మా. ఆరోగ్యం పదిలం. తమ్ముడిని అడిగినట్టు చెప్పు. వీలుంటే ఉత్తరం రాయించు. నువ్వూ అందులోనే ఓ నాలుగు మాటలు రాయి. నీ అక్షరాలను  స్పృశించి ఆనందపడతాను. త్వరలోనే నీముందుంటాననే ఆశతో ఇప్పటికివే నా మాటలమ్మా...
నీ మాటకోసం నిరీక్షించే నీ జగదీశ్

కామెంట్‌లు