వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు;-- యామిజాల జగదీశ్
 ఓ అనుభవజ్ఞుడి మాట...
అవకాశం అనేది మన జీవితంలో 
ప్రతి రోజూ ఆరోజు మనకు లభించే తీయనైన పండువంటిది... పాడైపోయేలోపల ఆ పండుని తినాలి. లేకుంటే పండు కుళ్ళిపోయి పారేయాల్సి వస్తుంది. ప్రయోజనం లేనిదవుతుంది.
ఇప్పటి సెకండ్లను...రేపో ఎల్లుండో ఉపయోగించలేం.
ఎల్లుండి మీరు చేయబోయే పని ఆ రోజు చెయ్యవలసిందే తప్ప ఈరోజు చేసేది కాదు.
ఈరోజు తేదీ అనేది, నెల అనేది ఏడాదిలో మరొకసారి రాదు.
కనుక ఈరోజు లభించే అవకాశాన్ని ఈరోజే సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
గ్రీకు దేశానికి చెందిన ఓ శిల్పి మనిషి దగ్గరకు వచ్చిపోయే అవకాశం గురించీ ఓ విగ్రహంద్వారా చెప్పించారు. ఆ విగ్రహం పేరు - అవకాశ (opportunity) విగ్రహం!   
గ్రీకు పురాణాలలో అవకాశాల దేవత పేరు కైరోస్!
ఆ విగ్రహానికి రెండు రెక్కలుంటాయి. 
తల ముందు భాగంలో జడ ఉంటే, వెనుక భాగాన బట్టతల కనిపిస్తుంది.
"అవకాశ విగ్రహాన్ని" శిల్పి కొన్ని ప్రశ్నలు అడిగితే అది ఇచ్చిన జవాబులు చూద్దాం.......
"నీకు రెక్కలు ఎందుకు?"
"నేను ప్రజల వద్దకు ఎగురుకుంటూ పోవడానికి" అని  విగ్రహం మాట.
"తల ముందు భాగంలో జడ ఎందుకు?"
"ప్రజలు నన్ను పట్టుకోవడం కోసం!" చెప్పింది విగ్రహం.
"ఎందుకు మునివేళ్ళపై నిల్చున్నావు?"
"అవకాశాన్ని వినియోగించుకోని వారి నుంచి రెప్పపాటు కాలంలో ఎగిరిపోవడానికి!" 
"తల వెనుక భాగాన ఎందుకు బట్టతల?" 
'అవకాశాన్ని చేజార్చుకున్నవారు నన్ను పట్టు కోకుండా ఉండటానికి!" చెప్పింది విగ్రహం!
శిల్పి కల్పితం ఎంత అద్భుతంగా ఉందో చూడండి....
ఈ "అవకాశ విగ్రహం" ద్వారా ఆ శిల్పి ఎంత మంచి పాఠాన్ని చెప్పారో కదూ.
ఒకసారి అవకాశాన్ని చేరిపోతే అదే అవకాశం మళ్ళీ అదే అవకాశం రానే రాదు అనచెప్పడానికి ఇంతకన్నా మరేం కావాలి.
అవును,....
అవకాశం అనేది అందరికీ ఎల్లప్పుడూ రాదు. వచ్చినప్పుడు దానిని గట్టిగా పట్టుకోవాలి.
అవకాశాన్ని చేజార్చుకోకూడదు.చేజార్చితే అవకాశం కోసం నిరీక్షిస్తున్న మరొక వ్యక్తి దానిని ఎగరేసుకుపోతాడు.
ఈరోజు వచ్చిన అవకాశానని వదులుకుని మరొక గొప్ప అవకాశం దక్కతుందనీ నమ్మికతో ఉండటం కన్నా వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ముఖ్యం. అది పురోగతికి బాట వేస్తుంది.


కామెంట్‌లు