పెద్దల మాట; - :సి.హెచ్.ప్రతాప్
 ఒక తల్లి నెమలి తన పిల్లని ఎంతో అపురూపంగా పెంచుకుంటోంది. దానికి ఇష్టమైన పదార్ధాలు సేకరించి తీసుకువచ్చి ఎంతో ప్రేమగా పిల్ల నెమలికి తినిపించి ఎంతో మురిసిపోయేది..  ఒకరోజు తల్లి నెమలి ఆహారం సేకరించడానికి బయలుదేరింది. ఆ రోజు ఎదో ప్రమాదం జరగబోతోందని తల్లి నెమలికి పదే పదే అనిపించసాగింది. అయినా ఇంట్లో వుండిపోతే తన పిల్లకు ఆహారం ఎక్కడినుండి వస్తుందన్న బెంగతో పిల్లకు ఇంటి నుండి కదలవద్దని పదే పదే హెచ్చరించింది.
 
అలాగే ఇంట్లోనే వుండి ఆడుకుంటానని పిల్ల నెమలి హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగానే పిల్ల ఒక్కర్తీ ఇంట్లో ఆడుకోసాగింది. అయితే కొంత సేపయ్యాక ఒక్కర్తీ ఆడుకోవడం తో విసుగు చెందింది. అమ్మకు భయంతో పాటు చాదస్తం కూడా ఎక్కువ.ఎప్పుడు తనకు పిరికితనం నూరిపోస్తూ వుంటుంది.బయటకు వెళ్ళొద్దు, ఇంకెవ్వరూ ఇచ్చిన ఆహారం ముట్టవద్దు, అపరిచితులను ఇంట్లోకి రానివ్వొద్దు అనేవి తల్లి ఎప్పుడూ చాదస్తంగా చెప్పే మాటలేగా. అయినా ఒక్క రోజు బయటకు వెళ్తే మాత్రం ఏం కొంప మునుగుతుంది అని పిల్ల నెమలి అనుకుంది.  కొంచెం సేపు బయటకు వెళ్ళి ఆడుకుందామని బయటకు వచ్చి స్నేహితులతో కలిసింది. వారందరూ కలిసి ఆటపాటలతో బాగా ఆనందించసాగారు. ఇంతలో కొందరు వేటగాళ్ళు వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్ల నెమళ్ళను మాటువేసి పట్టుకొని బందించేసారు. ఈ రోజు ఇన్ని నెమళ్ళు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.


నెమలి పిల్ల తన తప్పును గ్రహించింది కానీ చాలా ఆలస్యం అయింది.
 
గుండెలవిసేలా ఏడుస్తూ తల్లి గురించే ఆలోచించింది  కానీ తప్పించుకునే మార్గం కనిపించలేదు. నెమలి పిల్ల తన తల్లి మాట విని ఇంట్లోనే ఉండి ఉంటే, సురక్షితంగా వుండేది. అందుకే పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట అని తన తల్లి తరచుగా చెబుతుండేది. ఈ రోజు కూడ బయటకు వెళ్ళోద్దని తల్లి పదే పదే హెచ్చరించినా తను మాట వినకుండా బయటకు వచ్చి ఈ వేటగాళ్ళ ఉచ్చులో పడిపోయింది.. తల్లి గుర్తుకురాగా ఆ పిల్ల నెమలి పెద్ద పెట్టున ఏడవడం ప్రారంభించింది. దానిని చూసి మిగితా పిల్ల నెమళ్ళు కూడా ఏడవడం ప్రారంభించాయి. ఈ ఏడుపులు విన్న ఒక కాకి వెంతనే కావ్ కావ్ మంటూ ఎగురుకుంటూ వెళ్ళి తన బంధు మిత్రులందరినీ పిలుచుకొని వచ్చింది. అవన్నీ మూకుమ్మడిగా వేటగాళ్ళ మీద దాడి చేసేసరికి వేటగాళ్ళు భయంతో పారిపోయారు. కాకులు తమ ముక్కులతో పొడిచి పిల్ల నెమళ్ళ బంధనాలను విడిపించాయి. అక్కడితో పిల్ల నెమళ్ళకు పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పింది.


అవి కృతజ్ఞతతో కాకులను కౌగిలించుకున్నాయి. ఇంకెప్పుడూ తమ తల్లిదండ్రుల మాట జవదాటకూడదని నిర్ణయించుకున్నాయి.

కామెంట్‌లు